బ్రిటన్కు వెన్న పూస్తూనే వాతలు
బెర్లిన్: వెన్నపూస్తూ వాతలు పెట్టిన చందంగా.. బ్రెగ్జిట్ బాధాకరం అంటూనే పాత ఒప్పందాల విషయంలో బ్రిటన్కు హెచ్చరికలు జారీచేశారు జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారయిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆమె.. బ్రెగ్జిట్ ఫలితం ఈయూనే కాక యావత్ యూరప్ ఐక్యతను విచ్ఛిన్నం చేసిందని అన్నారు. (చదవండి: బ్రిటన్ లో అల్లకల్లోలం ఖాయం)
శుక్రవారం మధ్యాహ్నం(స్థానిక కాలమానం ప్రకారం) మీడియాతో మాట్లాడిన మోర్కెల్ బ్రెగ్జిట్ అనంతర పరిణామాలపై మాట్లాడుతూ నిన్నటివరకు ఈయూతో చేసుకున్న అన్ని ఒప్పందాలను సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. 'విడిపోయే ప్రక్రియ పూర్తయ్యే చివరి నిమిషం దాకా బ్రిటన్ తన వాగ్ధానాలు నిరవేర్చాల్సిన అవసరం ఉంది' అని మోర్కెల్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈయూ నేతలు, సభ్యదేశాధినేతలు బ్రిటన్ కు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం మనమున్నది గందరగోళ ప్రపంచమని, శాంతిసమాధానాలతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇంకా.. 'ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటిషర్ల నిర్ణయం బాధాకరం. అది ఐరోపా సమాజ ఐక్యతను విచ్ఛినం చేసింది. యూరప్ దేశాలు వేటికవే భిన్నత్వాన్ని కలిగిఉన్నాయో, ఈయూ అంతకంటే భిన్నమైనది. రెండో ప్రపంచ యుద్ధానంతరం తోడ్పాటును అందించుకునేందుకే ఈయూ ఏర్పాటయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం కూటమిలోని సభ్యదేశాలే ఈయూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పటాపంచలు చేయాల్సిన సమయం వచ్చింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఈయూ మనుగడ సాధించగలదన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు అందరితో చర్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే సోమవారం యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఇటలీ ప్రధాని మాటియో రెంజీలతో భేటీ అవుతున్నా' అని ఏంజిలా పేర్కొన్నారు.