స్విడన్ పురవీధుల్లో సిరియా శరణార్థుల గోస(ఫైల్ ఫొటో)
స్టాక్హోమ్: బ్రెగ్జిట్ ఓటుతో యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి విడిపోయిన బ్రిటన్.. ఆ దిశగా ఆలోచనలు చేస్తోన్న ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తోంది. ఈయూలో మూడో అతి పెద్ద దేశం స్విడన్ కూడా స్వెగ్జిట్(స్విడన్+ఎగ్జిట్) నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. గురు, శుక్రవారాల్లో ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఓటింగ్ లో స్విడిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకే మొగ్గుచూపారు.
నిజానికి నిన్నమొన్నటి వరకు కూడా స్విడన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేకుండేది. ఎప్పుడైతే కల్లోలిత మధ్య ఆసియా దేశాల నుంచి శరణార్థులు రాక పెరిగిందో.. అప్పటి నుంచి వారి మనోభావాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈయూ నంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి వస్తోన్నారు స్విడిష్ లు.
బ్రిగ్జిట్ విషయంలో బ్రిటిషర్లు చెబుతున్న కారణాన్నే స్విడిష్ లు కూడా వల్లెవేస్తున్నారు. అది.. తమ దేశాలపై 'బ్రెసిల్స్ పెత్తనం'. స్విడన్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు స్టాక్ హోమ్ (స్విడన్ రాజధాని)లో కాకుండా బ్రెసిల్స్ నుంచి వెలువడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఈయూలో ఉండటం వల్ల నష్టమేతప్ప లాభం లేదని, ఈయూలో ఉన్నందుకే శరణార్థుల బాధ్యతలను బలవంతంగా తలకెత్తుకోవాల్సి వస్తోందని ఓటింగ్ లో పాల్గొన్న స్విడిష్ లు అంటున్నారు.
టీఎన్ఎస్ సిఫో సంస్థ శుక్రవారం నిర్వహించిన పోలింగ్ లో 36 శాతం మంది స్విడిష్ లు ఈయూ నుంచి వైదొలకేందుకు ఓటు వేయగా, 32 శాతం మంది ఈయూలో కొనసాగేందుకు మద్దతు పలికారు. మిగిలిన 32 శాతం మంది ఏమీ తెలియదని చెప్పారు. బ్రిటన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న వాదన ఊపందుకోవడంలో రాజకీయ పక్షాలు కీలక పాత్ర పోశించాయి. అదే స్విడన్ లో ఈ ఉద్యమంలోకి ఇంకా రాజకీయ శక్తులు ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశిస్తేగనుక సెగ్జిట్ నిర్ణయానికి విపరీతమైన మద్దతు లభించే అవకాశం ఉంది. స్విడన్ కాకుండా ఈయూ సభ్యులైన బల్గేరియా, హంగరీ, రొమేనియా, పోలండ్, గ్రీస్, ఆస్ట్రియా వంటి దేశాలు శరణార్థి సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి.