కాబోయే ప్రధాని ఆమెనే
బ్రిటన్ పీఠాన్ని అధిష్టంచనున్న థెరిసా మే
బ్రెగ్జిట్ అనుకూల రెఫరెండం తీర్పుతో రాజకీయ అనిశ్చితిలో మునిగిపోయిన బ్రిటన్ లో తదుపరి ప్రధానమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. డేవిడ్ కామెరాన్ వారసురాలిగా బ్రిటన్ పగ్గాలను థెరిసా మే చేపట్టనున్నారు. నాటకీయ పరిణామాల నడుమ ఆమె ప్రధాన పోటీదారు అయిన ఆండ్రియా లీడ్సమ్ పోటీ నుంచి వైదొలగడంతో ప్రధాని రేసులో ఇప్పుడు థెరిసా ఒక్కరే నిలిచారు.
బ్రిగ్జిట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకొంటానని కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో ఆండ్రియా, థెరిసా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. థెరిసాకు పిల్లలు ఉండటం వల్ల ఆమె ప్రధాని పదవిని సమర్థంగా నిర్వహించలేరంటూ ఆండ్రియా ఇటీవల చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఆండ్రియా సోమవారం ఊహించనిరీతిలో ప్రకటన చేశారు. ప్రధాని రేసు తుదకంటూ కొనసాగడం సబబు కాదని, కాబట్టి తాను ఈ రేసు నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ విస్మయ పరిచారు. బ్రిటన్ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్రెగ్జిట్ ప్రక్రియను థెరిసా సమర్థంగా నిర్వహించగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో త్వరలోనే బ్రిటన్ ప్రధానిగా థెరిసా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.