కామెంట్
బ్రిటన్ ప్రధానులలో హెర్బర్ట్ హెన్రీ ఆస్క్విత్ భిన్నమైనవారు. మొదటి ప్రపంచ యుద్ధారంభ సమయంలోనూ నిమ్మళంగానే ఉన్నారాయన! ఎంతటి అత్యవసర పరిస్థితులూ, సంక్షోభాలూ ఆయన్ని వెంటబడి తరమలేకపోయాయి. ‘తొందరెందుకు?’ అన్నట్లే తాపీగా ఉండేవారు. నెమ్మదిగా మాట్లాడే వారు. అర్ధరాత్రి వరకు సాగే విందు వినోదాలలో కనిపించేవారు. వీధులలోని పుస్తకాల దుకాణాలలో కాలక్షేపం చేసేవారు. బాడుగ టాక్సీ ఎక్కేసేవారు. అంగరక్షకులు లేకుండానే కాలు కదిపేవారు. అలాంటి వ్యక్తి తన కంటే 35 ఏళ్లు చిన్నదైన ఒక యువతి ప్రేమలో కొండంచు పైనుంచి జర్రున జారినట్లుగా పడిపోయారు. ఆ యువతి ధ్యాసలో తలమునకలైపోయి మొదటి ప్రపంచ యుద్ధ సమయపు ఘోరమైన విపత్తులలో ఒక దానికి జీవం పోశారు!
చారిత్రక రచనల్ని కాల్పనిక సాహిత్యంగా పరిగణించటం మన ఇండియాలో సాధారణ విషయం. అయితే మనకు తెలియనిదేమిటంటే – మంత్రముగ్ధులను చేసే కల్పనతో అక్షర రూపం దాల్చిన వాస్తవ చరిత్రలు కూడా ఉంటాయని! అటువంటి రచనే రాబర్ట్ హ్యారిస్ రాసిన తాజా పుస్తకం ‘ప్రెసిపిస్’ (కొండ చరియ). నిజ జీవిత పాత్రలు, నిజమైన సంఘటనలు, నిజంగా లభ్యమైన లేఖలతో ఈ పుస్తకం ఉత్కంఠను కలిగిస్తూ ... ‘ఇదంతా నిజమేనా లేక అల్లికలోని నేర్పరితనమా?’ అనే ప్రశ్నను మీలో రేకెత్తిస్తుంది.
‘ప్రెసిపిస్’ హెర్బర్ట్ హెన్రీ ఆస్క్విత్ కథ. ఆస్క్విత్ 1908 నుంచి 1916 వరకు బ్రిటన్ ప్రధాని. ఆయన పేరుతోనే ఆయనకు ‘ఎర్ల్ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అండ్ ఆస్క్విత్’ అనే బిరుదు (టైటిల్) ఉండేది. సమాజంలోని సంపన్న వర్గాలలో గొప్ప గుర్తింపు కలిగిన వెనీషియా స్టాన్లీ అనే కులీన యువతి పట్ల ఆయన తీవ్రమైన మోహావేశంతో ఉండేవారు. ఆయనకు 62. ఆమెకు 27. రచయిత చెప్పిన విధంగా, ‘‘ఈ పుస్తకంలో ఉటంకించిన లేఖలన్నీ ప్రధాని ఆస్క్విత్ – పాఠకులు ఆశ్చర్యచకితులు అయ్యేంతగా–ప్రామాణికమైనవి. ప్రధాని ఆస్క్విత్‌కు వెనీషియా స్టాన్లీ రాసిన లేఖలు మొత్తం తొలిసారి వెలుగు చూసినవి’’.
ఆయన తన లేఖల్లో ‘‘నా ప్రియా’, ‘‘ప్రియ సఖీ’’, ‘‘ప్రియమైన ప్రేయసీ’’ అని ఆమెను సంబోధించేవారు. రహస్య దౌత్య సందే శాలను, మంత్రివర్గ చర్చల వివరాలను ఆమెతో పంచుకునేవారు. విన్‌స్టన్ చర్చిల్ (అప్పటికి నేవీ ఆఫీసర్)ను, లేదా లార్డ్ కిచనర్ (ఆర్మీ ఆఫీసర్)ను ఎలా దారికి తేవాలని అనే విషయమై తరచూ ఆమె సలహాలను కోరేవారు. ఆయన ప్రతిరోజూ, తరచుగా ఒక్కరోజులోనే రెండు మూడుసార్లు ఆమెకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది.
శుక్రవారాల్లో వాళ్లిద్దరూ తీరిగ్గా మధ్యాహ్నం ప్రారంభమయ్యేలా సుదీర్ఘ ప్రయాణాలను పెట్టుకునేవారు. ‘‘తక్కిన రోజులలో, వారాంతంలో వారు తరచూ భోజనానికి, విందు భోజనాలకు కలుసు కునేవారు. అయితే వారు ఎప్పుడూ కూడా చుట్టూ ఉన్న ఇతర వ్యక్తుల మధ్యనే కలుసుకోవటం జరిగేది. వారు ఏకాంతంగా కలుసుకునే అవకాశం ఉన్న ప్రదేశాలలో మాత్రం వారి కారు కూడా ఒకటి’’. దీని అంతరార్థం ఏమిటంటే – డ్రైవర్ కారు నడుపుతుండగా ఆ 1908 మోడల్ నేపియర్ కారు వెనుక భాగంలో ఆమె ‘‘తెరలు దించాక’’ వారిద్దరూ లైంగిక క్రియకు ఉపక్రమించేవారు. 30 నిమిషాల తర్వాత ఆమె తన ‘‘స్కర్ట్‌ను సవరించుకుంటూ’’ పైకి లేచేవారు.
హ్యారిస్ రాసిన ఇతర గొప్ప నవలల మాదిరిగానే ‘ప్రెసిపిస్’ కూడా మిలియన్‌లలో అమ్ముడు పోతుందా అనే సందేహం నాకే మాత్రం లేదు. అయితే ఆస్క్విత్ వార సుల ఖండనతో ఈ పుస్తకం వివాదా స్పదం అయింది. ఆస్క్విన్ ముని మన వడు, ‘3వ ఎర్ల్’ బిరుదాంకితుడు అయిన రేమండ్ దీనినొక (కారులో లైంగిక క్రియను) ‘‘అర్థం లేని’’ విషయంగా కొట్టిపడేశారు. ‘‘ఇది పూర్తిగా హాస్యా స్పదం’’ అన్నారు. బహుశా వెనీషియాపై ఆస్క్విత్‌కు ఉన్న గాఢమైన మోహం – అలా జరిగేందుకే ఎక్కువ అవకాశం ఉందని – అనుకోవటానికి ఆస్కారం ఇచ్చిందా?
పుస్తకంలో హ్యారిస్ రాసిన దానిని బట్టి వెనీషియాపై ఆస్క్విత్‌కు ఎంత గాఢమైన, నిలువనివ్వనంత ప్రేమ ఉండేదంటే... కేబినెట్ మీటింగ్‌లో గలిపలీ (టర్కీలోని ద్వీపకల్పం) పైన సైనికచర్య జరిపే తీర్మానాన్ని విన్‌స్టన్ చర్చిల్ ప్రతిపాదనకు పెడుతున్నప్పుడు ఆస్క్విత్ వెనీషియాకు లేఖ రాస్తూ కూర్చున్నారు! ఆయన ధ్యాసంతా తన ప్రేమపైనే ఉంది కానీ, డార్డనెల్లెస్ జలసంధి (గలిపలీ) మీద కాదు. బహుశా అందుకే గలిపలీపై సైనికచర్య అంత ఘోరంగా విఫలం చెంది ఉంటుంది.
ఆ కేబినెట్ సమావేశం ఎలా జరిగిందనే దాని గురించి హ్యారిస్ ఎంత రసవత్తరంగా రాశారో చూడండి. ‘‘ప్రైమ్ మినిస్టర్?’’ అనే పిలుపునకు ఆస్క్విత్ తలెత్తి చూశారు. విన్‌స్టన్ ఆయన వైపే చూస్తూ – ‘‘నేనిప్పుడు కౌన్సిల్ ముందుకు డార్డనెల్లెస్ విషయాన్ని తీసుకు రావచ్చునా?’’ అని అడిగారు. ‘‘తప్పకుండా’’ అంటూ, చప్పున తను రాస్తున్న లేఖను కొన్ని విదేశాంగ శాఖ కార్యాలయ టెలిగ్రామ్‌ల మధ్య దాచేశారు ఆస్క్విత్.
కానీ ఆ లేఖ తిరిగి వెంటనే ఆస్క్విత్ మదిలోకి వచ్చేసింది. ‘‘ఆయన తన కాగితాల కుప్ప కింది నుంచి అప్పుడే ప్రారంభించిన ఆ లేఖను బయటికి లాగారు. తిరిగి రాస్తున్నప్పుడు పక్కనే ఉన్న బాల్ఫోర్ (విదేశాంగ కార్యదర్శి) నిరామయ దృష్టి పడకుండా ఒక చేత్తో లేఖను మూసి ఉంచారు. ‘‘లేఖ రాయటం పూర్తయ్యాక మాత్రమే విన్‌స్టన్ చర్చిల్ ప్రసంగంపైకి ఆయన ధ్యాస మరలింది.
అప్పటికే ఆ ‘ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాలిటీ’ (రాయల్ నేవీ అధిపతి చర్చిల్) తన గలిపలీ ప్రతిపాదనకు తిరుగులేని విధంగా ఆమోద ముద్ర పొందేశారు. హ్యారిస్ రాసిన దాని ప్రకారం... ‘‘ఎవరూ ఎటువంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయలేదు’’. ‘‘డార్డనెల్లెస్‌పై సైనిక చర్యకు ఏకగ్రీవ ఆమోదం లభించింది’’ అని ఆస్క్విత్ ప్రకటించారు. కానీ దాని వివరాలపై ఆయన మనసు పెట్టలేదని తెలుస్తోంది. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధపు ఘోరమైన విపత్తులలో ఒకటి జీవం పోసుకుంది.
ఆస్క్విత్‌ది గతించిపోయిన కాలం. విస్మృత ప్రపంచంలోని ఒక భాగం. తొందరెందుకు అన్నట్లుగా ఆయన తీరు ఉండేది. తాపీగా, నెమ్మదిగా ఉండేవారు. అత్యవసర స్థితులు, సంక్షోభాలు ఆయన్నె ప్పుడూ తరమలేకపోయాయి. తరచూ డిన్నర్ పార్టీలకు వెళ్లే వారు. అవి అర్ధరాత్రి వరకు సాగేవి. బాడుగ టాక్సీలో వెళ్లేవారు. పుస్తకాల దుకాణాలో కాలం గడిపేవారు. అంగరక్షకులు లేకుండా కాలు కదిపే వారు. బిడియపడకుండా మద్యం సేవించేవారు.
యుద్ధం మొదలవటానికి ముందు జరిగిన ఒక సందర్భం ఇది. ‘‘రాత్రి ఒంటి గంటకు ప్రధాని ఆస్క్విత్ ఒక క్వార్టర్ బాటిల్ బ్రాందీని దుస్తుల లోపల ఉంచుకుని తూలుతూ టాక్సీలో ఎక్కి, వెనుక కూర్చు న్నారు. తబ్బిబ్బై తనను చూస్తున్న ఆ టాక్సీ డ్రైవర్‌తో నేరుగా బకింగ్ హామ్ ప్యాలెస్‌కు పోనిమ్మని చెప్పాడు.
ప్యాలెస్‌లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే బ్రిటన్ రాజు ఐదవ జార్జి ప్రత్యక్షమయ్యారు. స్లిప్పర్స్ తొడుక్కుని, నైట్ షర్టుపై గోధుమ రంగు డ్రెస్సింగ్ గౌను వేసుకుని పూర్తి నిద్రకళ్లతో ఉన్నారాయన. ఆ స్థితిలో– కైజర్ (జర్మనీ చక్రవర్తి)కి వ్యతిరేకంగా జార్ (రష్యా చక్రవర్తి) మద్దతు కోరుతూ టెలిగ్రామ్
పంపమని ఆస్క్విత్ ఆయనను కోరారు’’ అని రాశారు హ్యారిస్.
మోదీని అలా ఉంచండి. స్టార్మర్, సునాక్ (బ్రిటన్ ప్రస్తుత, మాజీ ప్రధానులు) కూడా అలా చేయటానికి వెనుకాడి ఉండేవారు. అలా వెనుకాడక పోవటమే ఆస్క్విత్ కథను ప్రత్యేకమైనదిగా చేసింది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment