ఉమ్మడి ఆర్థిక విధానాలే బ్రెగ్జిట్కు సమాధానం
ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పిలుపు
షాంఘై : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన (బ్రెగ్జిట్) ప్రభావంతో ఎదురవుతున్న సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొనడానికి ప్రధాన ఆర్థిక దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రి జైట్లీ సూచించారు. తదనుగుణంగా తగిన ఉమ్మడి ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలని ప్రధాన ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు, ఇతర రెగ్యులేటర్లను అభ్యర్థించారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్‌డీబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మొదటి సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జైట్లీ సమావేశాలకు హాజరుకాలేకపోవటంతో దాన్ని సమావేశంలో ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ చదివి వినిపించారు.