న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం.
అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది.
ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది.
Comments
Please login to add a commentAdd a comment