అమెరికా మందకొడి వృద్ధి పసిడికి బలం..!
• అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో ఔన్స్‌కు 1,358 డాలర్ల పైకి...
• మూడు వారాల గరిష్ట స్థాయి దేశీయంగానూ రెండు వారాల నష్టానికి బ్రేక్
ముంబై/న్యూయార్క్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం (బ్రెగ్జిట్)తో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్, ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.25-0.50 శ్రేణి నుంచి మరింత పెంచే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండడం వంటి అంశాలతో సమీప మూడు నెలల్లో పసిడి పటిష్టతకు ఢోకాలేని అంశాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) అంచనాలను అందుకోలేకపోవడం కూడా మున్ముందూ పసిడి పటిష్టంగానే ఉంటుందన్న ఇన్వెస్టర్ల భరోసాకు కారణం అవుతోంది. రెండవ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.6 శాతం ఉంటుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే దీనికి భిన్నంగా కేవలం 1.2 శాతం వృద్ధి రేటు నమోదుకావడం ఆర్థిక విశ్లేషకులను నివ్వెర పరిచింది. దీనితో ఆ దేశంలో వృద్ధి ఊపందుకోలేదన్న ధోరణి వ్యక్తమవుతోంది. ఇది డాలర్ బలహీనతకూ దారితీసే అంశం. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ధర ఔన్స్ (31.1 గ్రా.)కు గడచిన వారంలో 36 డాలర్లు పెరిగి 1,358 డాలర్లకు చేరింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. ఇక వెండి కూడా లాభాల్లోనే 20 డాలర్ల పైన ట్రేడవుతోంది. పసిడి 1,509 డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని, ఇదే జరిగితే కనిష్ట స్థాయి నుంచి 61.8% బలపడినట్లు (రిట్రేస్‌మెంట్) అవుతుందని, ఈ స్థాయిని దాటితే తిరిగి పసిడి తన చరిత్రాత్మక గరిష్ట స్థాయిలకు చేరే అవకాశం ఉందనీ అంచనా.
దేశీయంగా రూ.31,000 పైకి...
ఇక దేశీయంగా రెండు వారాలుగా కొంచెం వెనక్కు నడిచిన పసిడి తిరిగి శుక్రవారంతో ముగిసిన వారంలో బలపడింది. ముంైబె ప్రధాన మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత పసిడి 10 గ్రాముల ధర వారం వారీగా రూ.125 లాభపడింది. రూ.31,110 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో లాభపడి రూ.30,960కి చేరింది. ఇవి దాదాపు రెండున్నర సంవత్సరాల గరిష్ట స్థాయి. కనీసం ఆరు నెలలు, గరిష్టంగా 18 నెలలు పసిడి మెరుపు కొనసాగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా వెండి కేజీ ధర వారంలో ఏకంగా రూ.650కి చేరింది. రూ.47,470 వద్ద ముగిసింది.
పసిడి వెలుగులే...
‘‘గణాంకాల’’ ప్రాతిపదికననే ఫెడ్ ఫండ్ రేటు పెంపు ఆధారపడి ఉంటుందన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయం, ఈ నేపథ్యంలో రెండవ త్రైమాసిక ఫలితాలు కూడా బలహీనంగానే ఉండడం వంటి అంశాలు పసిడి బలిమికి మున్ముందు కలసి వచ్చేవి అనడంలో సందేహం లేదు. - కార్‌స్టన్ ఫ్రీట్చ్, కామర్జ్ బ్యాంక్ విశ్లేషకులు