జాన్సన్‌కు అగ్నిపరీక్ష | Britain Prime Minister Faces Crucial Situation Over Brexit Deal | Sakshi
Sakshi News home page

జాన్సన్‌కు అగ్నిపరీక్ష

Published Sat, Oct 19 2019 4:34 AM | Last Updated on Sat, Oct 19 2019 4:34 AM

Britain Prime Minister Faces Crucial Situation Over Brexit Deal - Sakshi

యూరప్‌ యూనియన్‌(ఈయూ) నుంచి తప్పుకోవడానికి తుది గడువు సమీపిస్తుండటంతో బేజారె త్తుతున్న బ్రిటన్‌ పౌరులకు ఊహించని కబురు అందింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కూ, ఈయూకు మధ్య దీనిపై ఒక ఒప్పందం కుదిరిందన్నదే దాని సారాంశం. అయితే అందుకు సంతోషించాలో, కంగారు పడాలో తెలియని అయోమయావస్థలో చాలామంది పౌరులున్నారు. ఎందుకంటే ఇప్పు డున్న పరిస్థితుల్లో జాన్సన్‌ ఈయూతో ఏ మేరకు మెరుగైన ఒప్పందానికి రాగలిగారో... దానికి పార్లమెంటు ఆమోదముద్ర పడుతుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. జాన్సన్‌ మాత్రం బ్రహ్మాండం బద్దలు చేశానని స్వోత్కర్షకు పోతున్నారు. దాన్ని పార్లమెంటు ఆమోదించి తీరాలం టున్నారు. శనివారం జరగబోయే ఓటింగ్‌లో ఆ కార్యక్రమం పూర్తయితే ఇతర ప్రాధాన్యతల దిశగా వేగం పెంచవచ్చునని హితవు చెబుతున్నారు. కానీ తనకు ముందు పనిచేసిన థెరిస్సా మే ఇలాగే ఒక ఒప్పందానికి వచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టి భంగపడ్డారు. వరసగా మూడుసార్లు పార్లమెంటులో ఓడిపోయి చివరకు ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పట్లో ఆమెకు వ్యతిరేకంగా ఓటేసినవారంద రినీ జాన్సన్‌ కొత్త ఒప్పందంపై ఒప్పించాల్సి ఉంటుంది.

కన్సర్వేటివ్‌ పార్టీకి కొందరు గుడ్‌బై చెప్పగా, మరికొందరిని పార్టీయే బయటకు పంపింది. మిగిలినవారిలో అనేకులు బ్రెగ్జిట్‌ను ఆపాలని కోరు కుంటున్నారు. ఇదంతా చాలదన్నట్టు కన్సర్వేటివ్‌ పార్టీకి మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన డెమొక్రటిక్‌ యూనియనిస్టు పార్టీ(డీయూపీ) ఈ ఒప్పందంపై పెదవి విరుస్తోంది. ఆ పార్టీకి పార్ల మెంటులో పదిమంది సభ్యులున్నారు. విపక్షం లేబర్‌ పార్టీ సరేసరి. తాము ఈ ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. కనుక తాజా ఒప్పందం ఆమోదముద్ర పొందడం అంత సులభమేమీ కాదు. అయితే జాన్సన్‌ మాటల్ని మన దేశంలోని స్టాక్‌ మార్కెట్లు మాత్రం విశ్వసిస్తున్నాయి. కనుకనే బోరిస్‌ జాన్సన్‌ ఒప్పందం గురించి ప్రకటించగానే స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీశాయి. ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం పలికితే దాదాపు ఏడాదికాలంగా ఉన్న అనిశ్చితి తొలగి బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కళకళలాడుతుందని... ఇది టాటా మోటార్స్, టీసీఎస్‌ వంటి సంస్థలకు లబ్ధి చేకూరుస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.

జాన్సన్‌ మొదలుకొని స్టాక్‌ మార్కెట్ల వరకూ ఎవరికెన్ని నమ్మకాలున్నా ఒప్పందం సజావుగా సాకారమవుతుందని చెప్పలేం. 2016లో తొలిసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరిగినప్పుడు బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్‌లు ఈయూ నుంచి దేశం తప్పుకోవాల్సిందేనని తీర్పునిస్తే...ఉత్తర ఐర్లాండ్‌ పౌరులు మాత్రం ఈయూలో కొనసాగాలని తేల్చారు. ఇది బ్రిటన్‌లో ప్రాణాంతక సమస్యగా మారింది. 1949లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న ఐర్లాండ్‌ దేశంతో ఉత్తర ఐర్లాండ్‌ను విలీనం చేయాలంటూ ఐరిష్‌ రిపబ్లికన్‌ ఆర్మీ(ఐఆర్‌ఏ) ఆవిర్భవించింది. హింసాత్మక చర్యలతో బ్రిట న్‌ను హడలెత్తించింది. చివరకు రెండు ఐర్లాండ్‌ల మధ్యా సరిహద్దులేమీ ఉండబోవన్న హామీ ఇచ్చి 1998లో ఆ సంస్థతో బ్రిటన్‌ సంధి కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే 2016 బ్రెగ్జిట్‌ రెఫరెండంలో ఉత్తర ఐర్లాండ్‌ వాసులు తాము ఈయూలో కొనసాగుతామని తేల్చిచెప్పారు. తాము ఈయూ నుంచి వైదొలగుతూ తమ ప్రాంతమైన ఉత్తర ఐర్లాండ్‌ను ఆ సంస్థ పరిధిలో ఎలా ఉంచాలో బ్రిటన్‌కు అర్ధం కావడం లేదు. ఈయూ నుంచి బయటకు వచ్చిన వెంటనే రెండు ఐర్లాండ్‌ల మధ్యా చెక్‌పోస్టులు నిర్మించాలి. సరుకు రవాణాపై సుంకాలు వసూలు చేయాలి. ఇదే జరిగితే ఉత్తర ఐర్లాండ్‌ జనం తిరగ బడతారు. సరిహద్దు రేఖలు గీస్తారా అంటూ ఆగ్రహిస్తారు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఐఆర్‌ఏ మళ్లీ పుంజుకుని సమస్యలు సృష్టిస్తుందని, చివరకు దేశం నుంచి ఉత్తర ఐర్లాండ్‌  విడి పోతుందని బ్రిటన్‌ రాజకీయ నాయకత్వం భయపడుతోంది. దీన్నుంచి గట్టెక్కడం కోసమే తాము ఈయూ నుంచి విడిపోయినా సుంకాల విషయంలో మాత్రం ఆ సంస్థ పరిధిలోనే ఉంటామని థెరిస్సా మే ఒప్పందం నిర్దేశించింది. ఉత్తర ఐర్లాండ్‌కు ఇది సంతోషం కలిగించినా బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలవారు మాత్రం గట్టిగా వ్యతిరేకించారు. ఒప్పందం ఓటమి పాలుకావడానికి అది ప్రధాన కారణం. దీనికి జాన్సన్‌ ఓ చిట్కా కనుక్కున్నారు. దాని ప్రకారం రెండు ఐర్లాండ్‌ల మధ్యా సరుకులపై ఎలాంటి తనిఖీలూ ఉండవు. చెక్‌పోస్టులుండవు. ఉత్తర ఐర్లాండ్‌ నుంచి బ్రిటన్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లే సరుకులపై మాత్రం ఈయూ నిర్దేశించిన సుంకాలను బ్రిటన్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. తన ఒప్పందం మొత్తం బ్రిటన్‌ను ఈయూ సుంకాల పరిధిలో లేకుండా చూసింది గనుక ఎవరికీ అభ్యంతరం ఉండబోదని జాన్సన్‌ నమ్ముతున్నారు.

వాస్తవానికి బ్రిటన్‌ పార్లమెంటుకు శని, ఆదివారాలు సెలవులు. కానీ దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి శనివారం రోజున పార్లమెంటు సమావేశం కాబోతోంది. పార్టీకి దూరమైన కన్సర్వేటివ్‌లను ఆ ఓటింగ్‌లో జాన్సన్‌ తనకు అనుకూలంగా మార్చుకోవాలి. అలాగే లేబర్‌ పార్టీ నుంచి కొందరినైనా చీల్చగలగాలి. డీయూపీని సైతం దారికి తెచ్చుకోవాలి. ఇవన్నీ అసాధ్యమని అందరూ అంటున్నారు. కానీ జాన్సన్‌ మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఓటింగ్‌ పూర్తయి విజయం సాధిస్తే ఒప్పం దానికి అనుగుణంగా చట్టం రూపొందించాలి. అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఈ నెల 31లోగా ఆమోదం పొందాలి. కానీ అంత ఆదరాబాదరాగా ఈ వ్యవహారం ముగుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. బిల్లుపై వెల్లువెత్తే అభ్యంతరాలూ, వాటికి ప్రభుత్వం ఇచ్చే వివరణలూ చాలా ఉంటాయి. అందరినీ సంతృప్తిపరిస్తే సరేసరి...లేనట్టయితే సవరణలకు సిద్ధప డాలి. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడైనా ఆటంకం ఎదురైతే బ్రెగ్జిట్‌ గడువు పెంచుతారా అన్నది ప్రధాన ప్రశ్న. దానికి ఎవరూ జవాబివ్వడంలేదు. చివరికిదంతా జాన్సన్‌ మెడకు చుట్టుకుని ఆయన నిష్క్రమిస్తారో, ఇది మరో రెఫరెండానికి దారితీస్తుందో వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement