భారత్ ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ఎఫెక్ట్!: మోర్గాన్ స్టాన్లీ
ముంబై: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడిన (బ్రెగ్జిట్) ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తప్పనిసరిగా ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఈ పరిణామం వల్ల రానున్న రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి 60 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గే అవకాశం ఉంటుందని తన తాజా నివేదికలో పేర్కొంది. వాణిజ్య, ఫైనాన్షియల్ మార్గాల్లో ఈ ప్రతికూలత ఉంటుందనీ వివరించింది. అయితే ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్‌పై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందని కూడా నివేదిక అభిప్రాయపడింది. కనీస స్థాయిలో జీడీపీపై ఈ ప్రభావం 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు ఉంటుందన్నది తమ అంచనాఅనీ, గరిష్ట స్థాయిలో 30 నుంచి 60 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని భావిసున్నామనీ వివరించింది (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం). దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో రికవరీ దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.