న్యూయార్క్ : విదేశీయులకు ఆశ్రయం కల్పించే దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది.వరుసగా రెండో ఏడాది ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 లో రెడ్-హాట్ హౌసింగ్ మార్కెట్, కరెన్సీలో హెచ్చుతగ్గుల కారణంగా యుఎస్ డాలర్‌తో పోటీని తట్టుకొని మొదటి స్థానంలో నిలిచింది. మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక ప్రమాణాలు పాటించినందు వల్లే ప్రపంచం హాంకాంగ్ వైపు చూస్తుందని మెర్సెర్ ఆసియా, మిడిల్ ఈస్ట్, గ్లోబల్ మొబిలిటీ ప్రాక్టీస్ లీడర్ మారియో ఫెరారో అన్నారు. ఈ మేరకు కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ తన వార్షిక నివేదికను వెల్లడించింది. ఇక.. ఈ ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ లో టాప్ 10 నగరాల్లో ఎనిమిది ఆసియాలోనే ఉండటం విశేషం. ఈ జాబితాలో టోక్యో రెండో స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాల్లో సింగపూర్, సియోల్, జూరిచ్ షాంఘైలు ఉన్నాయి.
ఇక ఈ జాబితాలో తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాట్ చివరి స్థానంలో నిలిచింది. దిగుమతి విపరీతంగా పెరగడం, కరెన్సీ కొరత ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. మరోవైపు.. డాలర్ క్రమేపీ బలపడడం వల్ల యుఎస్‌ఏలోని అనేక నగరాలు ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉన్నాయి. ‘బిగ్ ఆపిల్’ సిటీ న్యూయార్క్ నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి 10 స్థానాల్లోకి ప్రవేశించగా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వరుసగా 16 ,18 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో డాలర్‌తో పోటీపడలేక అనేక యూరోపియన్ నగరాలు వెనుకంజలో ఉన్నాయి. ఇందుకు వివిధ దేశాలతో ముదిరిన వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ అంశాలను ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు. ఇక ఈ తాజా నివేదికలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ 47 వ స్థానంలో, జర్మన్ నగరాలు బెర్లిన్, డ్యూసెల్డార్ఫ్ స్టుట్‌గార్ట్ ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి.
కాగా ప్రపంచంలోని 209 నగరాల ఆధారంగా మెర్సెర్ ప్రతీ ఏటా ఈ ర్యాంకింగ్ ఇస్తోంది. ప్రతి ప్రదేశంలో 200 కి పైగా వస్తువుల వ్యయాన్ని అంచనా వేసి ఈ మేరకు ఖరీదైన నగరాల నివేదిక వెల్లడిస్తుంది. ఇందుకు గృహ, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర అంశాలను కొలమానాలుగా తీసుకుంటుంది. ఇక ఆసియా దేశాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన వసతి సేవలు,సౌకర్యాల వల్ల విదేశీయుల అక్కడ నివసించేందుకు నిర్వాసితులు మొగ్గు చూపిస్తున్నారని ఫెరారో తెలిపారు. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెనకబడడానికి డాలర్‌తో పోటీ పడలేకపోవడమే కారణంగా చెప్పవచ్చు.ఆస్ట్రేలియా ప్రధాన నగరం సిడ్ని 50వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే మొంబై 67వ స్థానంలో నిలవగా న్యూఢిల్లీ 118 వ స్థానంలో నిలిచింది. తక్కువ ఖరీదైన నగరాల జాబితాల్లో ట్యునీషియా ప్రాంతానికి చెందిన ట్యునీస్ నిలవగా ,ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్, పాకిస్తాన్‌కి చెందిన కరాచీ తరువాత స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment