expats
-
ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?
న్యూఢిల్లీ: ప్రవాసులకు భారత్‌లో నివాస వ్యయాల పరంగా ముంబై ఖరీదైన పట్టణంగా ఉన్నట్టు మెర్సర్ 2023 జీవన వ్యయ సర్వే నివేదిక వెల్లడించింది. ముంబై తర్వాత ఖరీదైన పట్టణాలుగా న్యూఢిల్లీ, బెంగళూరు నిలిచాయి. అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంక్ (నివాస వ్యయాల పరంగా) 147గా ఉంది. న్యూఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, హైదరాబాద్ 202, కోల్‌కతా 211, పుణె 213 ర్యాంకులతో ఉన్నాయి. ముంబైతో పోలిస్తే హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా పుణెలో ప్రవాసులకు వసతి వ్యయాలు సగమే ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశంలో కోల్‌కతా అతి తక్కువ వ్యయాలతో ఉన్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను సర్వే చేసి మెర్సర్స్ ఈ నివేదికలో ర్యాంకులు కేటాయించింది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్, సింగపూర్, జ్యూరిచ్ ప్రవాస ఉద్యోగులకు అత్యంత ఖరీదైన పట్టణాలుగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అతి తక్కువ వ్యయాలతో కూడిన పట్టణాలుగా హవానా, కరాచీ, ఇస్లామాబాద్ ఉన్నాయి. నివాసం, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంటి వస్తువులు, వినోదానికి అయ్యే ఖర్చు ఇలా 200 వస్తువులకు అయ్యే వ్యయాల ఆధారంగా మెర్సర్ ఈ అంచనాలను రూపొందించింది. ఇతర ప్రాంతాల్లో కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వస్తు సేవల ధరలపై ద్రవ్యోల్బణ ప్రభావం వంటివి భారత పట్టణాల ర్యాంకులు దిగువకు మారేలా కారణమైనట్టు మెర్సర్ ఇండియా మొబిలిటీ లీడర్ రాహుల్ శర్మ తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికా వద్దు భారత్ ముద్దు.. 60 ఏళ్ల వయసులో 100 వ్యాపారాలు) ఢిల్లీ, ముంబై అనుకూలం బహుళజాతి సంస్థలు విదేశాల్లో కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఢిల్లీ, ముంబై వ్యయాల పరంగా అనుకూలమైన వేదికలుగా ఉన్నట్టు మెర్సర్ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇక్కడ నివాస వ్యయాలు తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
నిమ్జ్ నిర్వాసితులపై లాఠీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఝరాసంగం: తమ భూములకు పరిహారం చెల్లించే వరకు, రైతు కూలీలకు న్యాయం చేసేవరకు నిమ్జ్ (జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి)లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ నిర్వాసితులు బుధవారం చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగిలో నిర్వహించిన ర్యాలీని మంగళవారం రాత్రి నుంచే మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీయడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఇదే గ్రామానికి చెందిన పద్మమ్మ అనే మహిళ ముఖానికి గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో పోలీసులు ఆమెను జహీరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో నిర్వాసితులను అదుపులోకి తీసుకొని చిరాగ్పల్లి పీఎస్‌కు తరలించారు. లాఠీచార్జిపై మండిపడ్డ కొందరు ఆందోళనకారులు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. నిమ్జ్ గోబ్యాక్ .. సేవ్ ఫార్మర్ ఝరాసంఘం మండలం చీలపల్లి వద్ద నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు ప్రభుత్వం 512 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ స్థలంలో సమీకృత రక్షణ వ్యవస్థ పరిశ్రమ నిర్మాణానికి సంస్థ భూమి పూజ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నిర్వాసితులు ‘గోబ్యాక్ నిమ్జ్.. సేవ్ ఫార్మర్, జై జవాన్.. జై కిసాన్, సారవంతమైన భూములు లాక్కోవద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 2013 చట్టం ప్రకారం పరిహారమివ్వాలి నిమ్జ్ కోసం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల పరిధిలో మొత్తం 12,635 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 3,100 ఎకరాలను సేకరించింది. అయితే ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం చెల్లించిందని.. తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. -
త్యాగానికి బహుమతి! పరిహారం మంజూరు
ఎల్ఎన్ పేట, హిరమండలం, శ్రీకాకుళం పీఎన్ కాలనీ: వంశధార నిర్వాసితులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అదనపు పరిహారాన్ని వైఎస్సార్ సీపీ ప్ర భుత్వం ప్రకటించింది. మెత్తం రూ.216.71కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లోని పునరావాస కాలనీల్లో లబ్ధిదారులను గుర్తించే పనిలో అ«ధికారులు పడ్డారు. ఇదీ చరిత్ర.. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా 2005లో హిరమండలం వద్ద 10 వేల ఎకరాల్లో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వంశధార రిజర్వాయర్ (జలాశయం) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్వాసితులను గుర్తించేందుకు అనేక సర్వేలు 2007 వరకు జరిగాయి. సర్వే అనంతరం పంట భూములకు పరిహారం చెల్లించి నిర్మాణం పనులు చేపట్టారు. రిజర్వాయర్ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట మండలాల్లోని 19 గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. మరో 14 గ్రామాలు పాక్షికంగా నష్టపోయాయి. 8 వేల కుటుంబాలు నిర్వాసితులుగా గుర్తించారు. అప్పట్లో ఎకరా పల్లం భూమికి రూ.1.29లక్షలు, ఎకరా మెట్టు భూమికి రూ.90 వేలు నష్ట పరిహారం చెక్కుల రూపంలో అందజేశారు. ఇప్పుడు అదనపు పరిహారం చెల్లించేందుకు రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు పొందుపరుస్తున్నారు. అయితే చాలామంది భూ యజమానులు చనిపోయారు. వారి స్థానంలోకి వచ్చిన వారి ఫ్యామిలీ సర్టిఫికెట్(లీగల్ హేర్) వివరాలు సేకరిస్తున్నారు. అదనపు పరిహారం చెల్లింపు ఇలా.. భూములు కోల్పోయిన రైతులతో పాటు పీడీఎఫ్ పొందిన కుటుంబాలకు ఆదనపు పరిహారం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. రిజర్వాయర్ నిర్మాణం కోసం 9,579.62 ఎకరాల భూమిని సేకరించగా వీటిలో 8775.42 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయి. 804.20 ఎకరాల డి–పట్టా భూములు ఉన్నాయి. భూములకు గాను ఎకరానికి రూ.లక్ష అదనపు పరిహారంగా మొత్తం 95.80 కోట్లు విడుదల చేశారు. 12,091 మంది పీడీఎఫ్ అర్హత కలిగిన కుటుంబాలు ఉండగా వీరిలో 7,103 కుటుంబాలకు పీడీఎఫ్ పరిహారానికి, 4,988 మంది 18 ఏళ్లు దాటిన వారికి ఒక్కొక్కరికి రూ.లక్ష చెప్పున్న రూ.120.91 కోట్లు విడుదల చేశారు. ఎమ్మెల్యేదే కీలక పాత్ర వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం తీసుకురావటంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కీలక పాత్ర పోషించారు. ఆమెతో పాటు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, ప్రస్తుత రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావులు కూడా కృషి చేశారు. అదనపు పరిహారం విడుదలపై కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, వంశధార ఎస్ఈ డోల తిరుమలరావులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మాట నిలబెట్టుకునేలా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో హిరమండలం వచ్చి ఒక బహిరంగ సభలో నిర్వాసితుల కష్టాలను తెలుసుకున్నా రు. అప్పుడే మన ప్రభుత్వం వస్తే ఆదుకుంటామని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు రూ.216.71 కోట్లు విడుదల చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి కోరిన ప్రొఫార్మాలో వంశధార నిర్వాసితుల నుంచి వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా నిర్వాసితుల పూర్తి వివరాలు సేకరించి కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. – ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్, శ్రీకాకుళం సంతోషంగా ఉంది వంశధార నిర్వాసితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనపు పరిహారం ఇస్తాననడం ఎంతో సంతోషంగా ఉంది. çస్థిరాస్తులను కోల్పోయి నిరాశ్రయులయ్యాం. పునరావాస కాలనీల్లో అదనపు పరిహారం కోసం గ్రామాల్లో సర్వే ముమ్మరంగా సాగుతుంది. – గవర వెంకటరావు,నిర్వాసితుడు గార్లపాడు -
హుస్నాబాద్ రణరంగం
సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై మళ్లీ లాఠీచార్జి జరిగింది. పూర్తిగా పరిహారమిచ్చాకే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్ చేపట్టాలంటూ నిర్వాసితుల ఆందోళన.. ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణుల ర్యాలీ.. పరస్పరం రాళ్లదాడులు.. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి.. కొట్టుకుంటూ, లాక్కెళ్లి పోలీస్స్టేషన్లకు తరలించడంతో హుస్నాబాద్ పట్టణం రణరంగంగా మారింది. సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లిలో పోలీసుల అరెస్టులతో మొదలైన ఆందోళన.. మంగళవారం సాయంత్రానికి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెల్లవారుజామున అరెస్టులతో మొదలై గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్ నిర్వహించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధాన కాల్వ పనులపై కోర్టు స్టే ఉండటంతో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు మరో కాల్వ నిర్మాణం చేపట్టి, నీళ్లు నింపాలని నిర్ణయించారు. ఇందుకోసం గుడాటిపల్లిలో సేకరించిన భూమిలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టగా.. నిర్వాసితులు అడ్డుకుని, నిరసన తెలిపారు. అయితే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భారీగా పోలీసు బలగాలు గుడాటిపల్లికి చేరుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిపేసి.. ఇళ్లలోకి చొరబడి నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నిర్వాసితులు పాదయాత్రగా హుస్నాబాద్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మంగళవారం హుస్నాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం కూడా నిర్వాసితులు ఆందోళన కొనసాగించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన భూ నిర్వాసితులు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. ఓ వైపు నిర్వాసితుల ఆందోళన కొనసాగుతుండగానే.. మరోవైపు టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలంతా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోవాలంటూ సమాచారం వెళ్లింది. గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్‌రన్ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డు కుంటున్నాయని, వెంటనే ట్రయల్ రన్ చేపట్టాలంటూ ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం ఇద్దామని.. అంతా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచన వచ్చింది. టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర నేతలు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కూడా అక్కడికి వస్తున్నారని తెలిసిన నిర్వాసితులు.. ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరిస్తామంటూ భారీ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్ వైపు బయలుదేరారు. పోలీసులు వారిని క్యాంపు ఆఫీసుకు కొద్దిదూరంలో హన్మకొండ ప్రధా న రహదారిపై అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు ప్రధాని రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టీఆర్ఎస్ శ్రేణులు బయటికొచ్చి.. క్యాంపు ఆఫీస్‌లో పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. ప్రాజెక్టు ట్రయల్‌రన్ వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో ర్యాలీగా బయలుదేరారు. బయట నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారని, వెళ్లొద్దని ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. టీఆర్ఎస్ నేతలు వినలేదు. మరోవైపు ఆందోళన విరమించాలంటూ పోలీసులు కోరినా నిర్వాసితులూ వినలేదు. కాసేపటికే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాలు ఎదురుపడటంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు వచ్చి లాఠీచార్జి మొదలుపెట్టారు. దొరికినవారిని దొరికినట్టు కొడుతూ.. కర్ర, ఫైబర్ లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రధానంగా నిర్వాసితులను ఉరికించి కొట్టారు. కొందరిని ఈడ్చిపారేశారు. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డాయి. నిర్వాసితులను కొడుతుంటే వారి కుటుంబ సభ్యులు, మహిళలు అడ్డురాగా వారిపైనా పోలీసులు లాఠీ ఝలిపించారు. కొందరిని క్యాంపు ఆఫీస్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకూ కొట్టుకుంటూ లాక్కెళ్లారు. తమ వారిని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి కొట్టి చంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళలు, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని లాఠీలతో చెదరగొట్టి నిర్వాసితులను లోనికి తీసుకెళ్లారు. దీనితో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. నలుగురు మహిళలు స్పృహతప్పి పడిపోగా ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనల్లో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు గుర్తుపెట్టుకుని మరీ కొట్టారు! పోలీసులు గత మూడు రోజులుగా ఆందోళనలో ముందున్న నిర్వాసితులను గుర్తుపెట్టుకుని మరీ లాఠీలు, కర్రలు విరిగేలా కొట్టారని కుటుంబ సభ్యులు, గుడాటిపల్లి గ్రామస్తులు మండిపడ్డారు. తమ వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పరామర్శించారు. కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం రాత్రి గుడాలిపల్లి నిర్వాసితులను, గాయపడిన మహిళలను పరామర్శించారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కలిసి తమపై దాడి చేశారని మహిళలు రోదిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు. రిజర్వాయర్ లెక్క ఇదీ.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గౌరవెల్లి రిజర్వాయర్‌ను 1.14 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 1,870 ఎకరాల భూమికి ఎకరానికి రూ.2.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించి సేకరించారు. 2015లో టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. దీనితో గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి, మద్దెలపల్లి, చింతలతండా, జాలుబాయితండా, కొత్తపల్లి, సేవనాయక్ తండా, తిర్మల్ తండా, సోమాజి తండాల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు పూర్తిగా రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యాయి. రీడిజైన్ కోసం అదనంగా 1,900 ఎకరాలు అవసరమవడంతో.. మొదట 1,600 ఎకరాలను ఒక్కో ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. గత నవంబర్‌లో మరో 222 ఎకరాలను ఎకరానికి 15 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. నిర్వాసితుల డిమాండ్లివే! ► భూనిర్వాసితులు తమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. 2015 నాటికి నిర్వాసితుల్లో మేజర్లకు రూ.8 లక్షల చొప్పున, మైనర్లకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనిని నిర్వాసితులు తిరస్కరించారు. అందరికీ రూ.8 లక్షల పరిహారమివ్వాలని కోరారు. ఈ ఏడేళ్లలో చాలా మంది మేజర్లు అయ్యారు. అందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలంటున్నారు. ► నిర్వాసితులకు పరిహారం చెల్లించే సమయంలో 57 మంది రైతుల పేర్లు మిస్సయ్యాయని.. మరో 59 మంది వృద్ధులని చెప్పి ప్యాకేజీ అందించలేదని.. వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. ► ఇక 88 ఎకరాలకు చెందిన రైతులు తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ► మరోవైపు అధికారులు మాత్రం భూసేకరణకు సంబంధించి 80శాతం పరిహారం చెల్లింపు పూర్తయిందని, మిగతా వారికి నెలరోజుల్లో చెల్లిస్తామని చెప్తున్నారు. ఇక ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి మైనర్లు తిరస్కరించడం వల్లే చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. -
కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా
సాక్షి, గజ్వేల్: కన్నతల్లిలాంటి ఊరు.. అక్కడి మట్టితో బంధాన్ని తెంచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని మల్లన్నసాగర్ నిర్వాసితులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానే కొత్త ఆశలు.. ఆకాంక్షలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కాలనీలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 2000కుపైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. నిన్నమొన్నటి వరకు పచ్చని పంట పొలాలు, ప్రాణాధారంలాంటి చెరువులు, కుంటలు, పాడిపశువుల మధ్య స్వేచ్ఛగా గడిపిన వీళ్లంతా కాంక్రీటు వనంలో కొత్త అనుభవాలను ఎదుర్కోబోతున్నారు. నిర్వాసితుల ఉద్విగ్న పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉపాధిపై ఆందోళన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చే ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో రూపుదిద్దుకున్న ఆర్అండ్ఆర్ కాలనీలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వాసితులంతా ఆర్అండ్ఆర్ కాలనీకి తరలివస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కొత్త బతుకును వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాసం పక్కనపెడితే... ఇకపై తమ ఉపాధి పరిస్థితి ఏమిటనే అంశంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. ముంపు గ్రామాల ప్రజలకు 650 ఎకరాల్లో 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌లో గతంలో 300 ఎకరాలు సేకరించగా.. ఇటీవల మరో 350 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులు కోరిన ప్రకారం ఇళ్లను ఎంత మందికి అవసరమైతే అంత మందికి నిర్మించి ఇవ్వడానికి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ముందే నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు వద్దనుకునేవారికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలను అందిస్తున్నారు. ఇప్పటికే 2,400 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 2 వేలకుపైగా పంపిణీ చేశారు. మరో 3,400 మందికి ఓపెన్ ప్లాట్లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటిని 250 గజాల్లో సుమారు 563 ఎస్ఎఫ్టీ వైశాల్యంతో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి పోగా మిగిలిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రెండు ఫంక్షన్ హాళ్లు, ఒక మార్కెట్, 8 అంగన్ వాడీ కేంద్రాలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. 200 కోట్లకుపైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది. కొన్ని నెలలుగా నివాసం ఆర్అండ్ఆర్ కాలనీని సకల సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు ఆర్అండ్ఆర్ కాలనీ పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే లక్ష్మాపూర్‌కు చెందిన 175 ఇళ్లు, ఎర్రవల్లికి చెందిన 553, సింగారానికి చెందిన 181 ఇళ్లలో కొత్తగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. కొన్ని రోజులుగా వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన నిర్వాసితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి దాదాపు 986 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి. ఇదిలా ఉండగా ఆర్అండ్ఆర్ కాలనీ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి. చదవండి: వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు -
కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి!
తాడిమర్రి: అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు తాగు, సాగునీరు సౌకర్యాల కోసం 1993 సంవత్సరంలో 10 టీఎంసీల లక్ష్యంతో తాడిమర్రి మండల సరిహద్దు, వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించారు. రూ.31.3 కోట్ల వ్యయంతో 1993లో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిలుపుదల చేశారు. దీంతో అప్పటి వరకు చేసిన నిర్మాణాన్ని తొలగించి 1999లో తిరిగి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం రూ.93.87 కోట్లు మంజూరు తేసింది. కానీ పనుల్లో పురోగతి లేదు. ఈ క్రమంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మరో రూ.50 కోట్లు విడుదల చేయించడంతో పాటు పనుల్లో వేగం పెంచారు. చివరకు ఆ మహానేత హయాంలోనే 2006లో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యింది. పరిహారం అందక.. మరోదారి లేక సీబీఆర్ నిర్మాణంతో ముదిగుబ్బ మండలంలోని మొగళచెట్లపల్లి, యర్రగుంటపల్లి, రాఘవపల్లి, చిన్నకోట్ల, పెద్దచిగుళ్లరేవు, తాడిమర్రి మండలంలోని పెద్దకోట్ల, గుడ్డంపల్లి, మోదుగులకుంట, మర్రిమాకులపల్లి, చిన్నచిగుళ్లరేవు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పెద్దకోట్ల, గుడ్డంపల్లి, మోదుగులకుంట గ్రామాల ప్రజలు ముంపు గ్రామాలను వదిలి పునరావాసం కింద మరో ప్రాంతంలో గ్రామాలను నిర్మించుకున్నారు. వారికి రిజర్వాయర్ రీహ్యాబిలిటేషన్(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ కింద పరిహారం అందించారు. మర్రిమాకులపల్లి, చిన్నిచిగుళ్లరేవు గ్రామాలకు మాత్రం పరిహారం ఇవ్వలేదు. దీంతో వారు గ్రామాలను వదల్లేక.. మరో ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించడంతో.. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి సీబీఆర్‌కు మూడేళ్లుగా నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 6–7 టీఎంసీలు నీరు చేరితే ఈ రెండు గ్రామాల్లోకి నీరు చొరబడుతోంది. దీంతో గ్రామస్తులు అవస్థలు పడుతూ వచ్చారు. వీరి సమస్యలు విన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాధితుల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేపట్టారు. అయినా అప్పటి పాలకుల్లో కదలిక రాలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి నిర్వాసితుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ పలుమార్లు ముంపు గ్రామాలను పరిశీలించారు. అధికారులతో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. వన్‌టైం సెటిల్మెంట్ కింద నిధులు కలెక్టర్ నివేదిక మేరకు ప్రభుత్వం మర్రిమాకులపల్లిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా వన్‌టైం సెటిల్మెంట్ కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ప్రకారం 410 కుటుంబాలకు రూ.41.60 కోట్లు, 119 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున రూ.8.33 కోట్లు విడుదల చేసింది. అలాగే చిన్నచిగుళ్లరేవు గ్రామంలో 226 కుటుంబాలకు రూ.22.60 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే కొందరు నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్ము జమకాగా.. మరో వారంలో బాధితులందరికీ పరిహారం అందనుంది. నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ ధర్మవరం అర్బన్: సీబీఆర్ నిర్వాసితుల ఖాతాల్లో ఇప్పటికే రూ.50 కోట్ల మేర పరిహారం జమ అయినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆర్డీఓ మధుసూదన్‌తో కలిసి పట్టణంలోని ఎన్జీఓ హోంలో సీబీఆర్ ముంపు గ్రామాల పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. సీబీఆర్ ముంపుకు గురయ్యే గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందించనున్నట్లు తెలిపారు. తాడిమర్రి మండలంలోని సీసీరేవు, మరిమేకలపల్లి, ముదిగుబ్బ మండలంలోని పీసీరేవు, రాఘవంపల్లి గ్రామాల్లో 1,729 కుటుంబాలు నివాసాలు కోల్పోయాయని ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.240.53 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 30 ఏళ్ల నిరీక్షణకు ఫలితం 1993లో రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించగా.. మా గ్రామం ముంపు ప్రాంతంగా ప్రకటించారు. పరిహారం అందితే మరోప్రాంతానికి వెళ్లి ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాం. కానీ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. మూడు దశాబ్దాలుగా మేము ఎదురుచూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు జగన్మోహన్రెడ్డి కరుణించి పరిహారం మంజూరు చేశారు. – నారాయణప్ప, మర్రిమాకులపల్లి, తాడిమర్రి -
మానని గాయం..అదో చీకటిరోజు
వారికి అదో చీకటి రోజు.. వందలాది మంది పోలీసులు ఆ గ్రామాలను చుట్టుముట్టి.. పిల్లా జెల్లా, ముసలి ముతక అని కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. తమ లాఠీలతో అమానుషంగా వ్యవహరించారు. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో సర్వం త్యాగం చేసిన 18 గ్రామాల నిర్వాసితుల పట్ల నాటి టీడీపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిన తీరు ఇది. ఈ ఘటన జరిగి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఇదో మానని గాయంగా నిలిచింది. హిరమండలం/ఎల్.ఎన్.పేట: వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు మండలాల్లో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయనపై ఉన్న నమ్మకంతో అప్పట్లో నిర్వాసితులు సైతం తమ భూములు ఇచ్చేందుకు, గ్రామాలను ఖాళీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ మహానేత ఆకస్మిక మరణంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. ప్యాకేజీ, పరిహారం విషయంలో తీరని అన్యాయం చేసింది. నిజమైన నిర్వాసితులకు కాకుండా తమ పార్టీ చోటా నేతలకు పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయలు ప్యాకేజీ, పరిహారం కోసం మంజూరు చేసినట్టు చెప్పుకొచ్చారు. అదే సమయంలో గ్రామాలను ఖాళీ చేయాలని, పొలాల్లో పంటలు పండించవద్దని హుకుం జారీ చేసింది. ఇంకా సమస్యలు పరిష్కరించలేదని, అంతవరకూ పంటలు పండించుకుంటామని నిర్వాసిత గ్రామాల ప్రజలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 2017 ఆగస్టు 17న దమ్ములకు సిద్ధమవుతున్న రైతులపై నాటి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు. వందలాది మంది మోహరించడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. అండగా నిలిచిన గ్రామ ప్రతినిధులపై కేసులు అక్రమంగా బనాయించారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి నాటి టీడీపీ ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు. నిర్వాసితులకు అండగా నిలిచారు. ఇప్పటికీ మరువలేకున్నాం నాటి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ దాడులు జరిగాయి. వందలాది మంది పోలీసులు గ్రామాల్లో మహిళలు, పిల్లలని చూడకుండా దాడికి తెగబడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. అప్పట్లో జగన్మోహన్రెడ్డి నిర్వాసితులకు అండగా నిలిచారు. అందుకే వైఎస్సార్సీపీకి రుణపడి ఉంటారు. – గొర్లె మోహన్‌రావు, నిర్వాసితుడు, పాడలి అదో చీకటి రోజు నాటి టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. పంట పండించుకుంటామని చెప్పినా వినలేదు. రిజర్వాయర్ నిర్మాణానికి సర్వం త్యాగం చేసిన వారిపై అమానుషంగా వ్యవహరించింది. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసింది. రక్తపాతం సృష్టించింది. నియోజకవర్గ, జిల్లా పెద్దలు కనీసం పరామర్శకు రాలేదు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరువలేరు. – జీ తిరుపతిరావు, నిర్వాసితుడు, పాడలి -
అత్యంత ఖరీదైన నగరం అదే!
న్యూయార్క్ : విదేశీయులకు ఆశ్రయం కల్పించే దేశాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ నిలిచింది.వరుసగా రెండో ఏడాది ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2018 లో రెడ్-హాట్ హౌసింగ్ మార్కెట్, కరెన్సీలో హెచ్చుతగ్గుల కారణంగా యుఎస్ డాలర్‌తో పోటీని తట్టుకొని మొదటి స్థానంలో నిలిచింది. మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక ప్రమాణాలు పాటించినందు వల్లే ప్రపంచం హాంకాంగ్ వైపు చూస్తుందని మెర్సెర్ ఆసియా, మిడిల్ ఈస్ట్, గ్లోబల్ మొబిలిటీ ప్రాక్టీస్ లీడర్ మారియో ఫెరారో అన్నారు. ఈ మేరకు కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ తన వార్షిక నివేదికను వెల్లడించింది. ఇక.. ఈ ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’ లో టాప్ 10 నగరాల్లో ఎనిమిది ఆసియాలోనే ఉండటం విశేషం. ఈ జాబితాలో టోక్యో రెండో స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానాల్లో సింగపూర్, సియోల్, జూరిచ్ షాంఘైలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాట్ చివరి స్థానంలో నిలిచింది. దిగుమతి విపరీతంగా పెరగడం, కరెన్సీ కొరత ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. మరోవైపు.. డాలర్ క్రమేపీ బలపడడం వల్ల యుఎస్ఏలోని అనేక నగరాలు ర్యాంకింగ్స్‌లో ముందంజలో ఉన్నాయి. ‘బిగ్ ఆపిల్’ సిటీ న్యూయార్క్ నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి 10 స్థానాల్లోకి ప్రవేశించగా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వరుసగా 16 ,18 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో డాలర్‌తో పోటీపడలేక అనేక యూరోపియన్ నగరాలు వెనుకంజలో ఉన్నాయి. ఇందుకు వివిధ దేశాలతో ముదిరిన వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ అంశాలను ప్రధాన సమస్యలుగా చెప్పవచ్చు. ఇక ఈ తాజా నివేదికలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ 47 వ స్థానంలో, జర్మన్ నగరాలు బెర్లిన్, డ్యూసెల్డార్ఫ్ స్టుట్గార్ట్ ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. కాగా ప్రపంచంలోని 209 నగరాల ఆధారంగా మెర్సెర్ ప్రతీ ఏటా ఈ ర్యాంకింగ్ ఇస్తోంది. ప్రతి ప్రదేశంలో 200 కి పైగా వస్తువుల వ్యయాన్ని అంచనా వేసి ఈ మేరకు ఖరీదైన నగరాల నివేదిక వెల్లడిస్తుంది. ఇందుకు గృహ, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం తదితర అంశాలను కొలమానాలుగా తీసుకుంటుంది. ఇక ఆసియా దేశాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మెరుగైన వసతి సేవలు,సౌకర్యాల వల్ల విదేశీయుల అక్కడ నివసించేందుకు నిర్వాసితులు మొగ్గు చూపిస్తున్నారని ఫెరారో తెలిపారు. కాగా ఈ జాబితాలో ఆస్ట్రేలియా వెనకబడడానికి డాలర్‌తో పోటీ పడలేకపోవడమే కారణంగా చెప్పవచ్చు.ఆస్ట్రేలియా ప్రధాన నగరం సిడ్ని 50వ స్థానంలో నిలిచింది. ఇక భారత్ విషయానికి వస్తే మొంబై 67వ స్థానంలో నిలవగా న్యూఢిల్లీ 118 వ స్థానంలో నిలిచింది. తక్కువ ఖరీదైన నగరాల జాబితాల్లో ట్యునీషియా ప్రాంతానికి చెందిన ట్యునీస్ నిలవగా ,ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్, పాకిస్తాన్‌కి చెందిన కరాచీ తరువాత స్థానాల్లో నిలిచాయి. -
అభివృద్ధి మాటల్లోనే..
సాక్షి, గన్నవరం (కృష్ణా): ‘ఓడ దాటే దాక ఓడమల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడి మలయ్య’ అన్నట్లు ఉంది టీడీపీ నాయకుల తీరు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలకు హామీల వర్షం కురిపించడం.. ఆ తరువాత ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. పేదలకు నివేశన స్థలాల పంపిణీ కలగానే మిగిలిపోయింది. నియోజకవర్గంలో సుమారు 20 వేల వరకు పేద కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పేద ప్రజలు. ఐదేళ్లలో ప్రతి జన్మభూమి సభలో, ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమాల్లో స్థలాల కోసం అర్జీలు సమర్పించినా ప్రయోజనం లేకపోయింది. నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాల్లో అందుబాటులో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికి పేదలకు పంపిణీ చేసేందుకు పాలకులు ముందుకురాలేదు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజి కింద పక్కాగృహాలు నిర్మిస్తామనే పాలకుల హామీ కూడా కార్యారూపం దాల్చలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజి పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా మెరక పనులు మినహా రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు వంటి కనీస మౌళిక సదుపాయలు కల్పించే దిశగా చర్యలు తీసుకోలేదు. అలంకారప్రాయంగా శిలాఫలకాలు ఉంగుటూరు–ఇందుపల్లి మధ్య బుడమేరు కాలువపై ఉన్న లోలెవల్ వంతెన ప్రతిసారి వాగు పొంగినప్పుడు ముంపునకు గురై తేలప్రోలు–ఉయ్యూరు ప్రధాన రహదారిపై రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. 2006లో బుడమేరు అధునికీకరణలో భాగంగా ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి కార్యరూపం దాల్చలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.24 కోట్లతో బుడమేరుపై వంతెన నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 22న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నెలలు గడుస్తున్న ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. గన్నవరం, ఆగిరిపల్లి మండలల్లోని మెట్ట ప్రాంత ప్రధాన సాగునీటి వనరైన బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తామనే పేరుతో రెండేళ్లుగా భారీగా మట్టి దోపిడికి పాలకులు తెరతీశారు. ఎన్నికలు సమీపించిన వేళ హడవుడిగా రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసి మొక్కుబాడిగా పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) నిర్మిస్తామనే పాలకుల హామీ అమలుకు నోచుకోలేదు. యూజీడీ కోసం ఉపాధి హామీ పథకం నిధులు 70శాతం మంజూరు చేసేందుకు కేంద్రం ముందుకువచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, గ్రామ పంచాయతీ 10శాతం వాటాగా నిర్ణయించారు. దీంతో అధికారులు తేలప్రోలులో రూ.3.75కోట్లతో 25 కిలోమీటర్లు భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేసేందుకు అచనాలు రూపొందించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 30 శాతం నిధులు మంజూరు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామపంచాయితీలు మిన్నకుండటంతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ కలగానే మిగిలింది. -
ఇప్పటివరకు 1317 కుటుంబాలకు మాత్రమే పునరావాసం..
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్లో 56,495 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని కేంద్రం ప్రభుత్వం తెలిపింది. అయితే అందులో ఇప్పటివరకు 1317 ఎస్టీ కుటుంబాలను మాత్రమే పునరావాస కాలనీలకు తరలించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం రాజ్యసభకు తెలిపారు. పోలవరం నిర్వాసిత ఎస్టీ కుటుంబాలకు పునరావాసం కల్పించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు జాతీయ ఎస్టీ కమిషన్ రాష్ట్రపతికి సమర్పించిన నివేదిక వాస్తవమేనా అని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. అదే విధంగా పునరావాసం కల్పించిన కుటుంబాలకు సేద్యానికి పనికిరాని భూములు పంపిణీ చేశారా, దీని ద్వారా వారు జీవనోపాధి కోల్పోయిన విషయం వాస్తవం కాదా అనే ప్రశ్నకు కూడా కేంద్రం సమాధానమిచ్చింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులైన ఎస్టీ కుటుంబాలకు సేద్యానికి యోగ్యమైన భూములనే పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మేఘవాల్ పేర్కొన్నారు. ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులైన గిరిజనులు అనే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ ప్రత్యేక నివేదిక రూపొందించింది వాస్తమేనని మంత్రి అంగీకరించారు. నిర్వాసితులైన గిరిజన కుటుంబాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతి కోసం, రాజ్యాంగపరంగా వారికి సంక్రమించిన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన ముఖ్యమైన చర్యలను ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని తెలిపారు. నిర్వాసిత గిరిజన కుటుంబాలకు సాగు యోగ్యమైన భూముల పంపిణీ, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, ప్రాజెక్టు ప్రారంభానికి ముందుగానే ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తి చేయాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాని అందజేసిన నివేదికలో సిఫార్సు చేసిందని అన్నారు. ఆర్ అండ్ ఆర్ పనుల పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని వెల్లడించారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సమీక్షపై కమిటీ.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జెడ్) నిబంధనల సడలింపు అంశాన్ని సమీక్షించి, పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నెలకొల్పిందని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబిచ్చారు. సీఆర్‌జెడ్ కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, భాగస్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తీర ప్రాంతం కలిగిన ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్ళను ఈ కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. 2018లో విడుదల చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ముసాయిదా ప్రకటనలో ఏపీ తీర ప్రాంతాన్ని కూడా చేర్చినట్టు తెలిపారు. -
కదంతొక్కిన నిర్వాసితులు
శ్రీకాకుళం , కొత్తూరు: వంశధార నిర్వాసితులు తమ న్యాయమైన సమస్యలతో పాటు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని కోరుతూ కదంతొక్కారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులైన కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లోని పలు నిర్వాసిత గ్రామాలకు చెందిన వారంతా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు నాలుగు రోడ్లు కూడలి నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ మహసింగి గ్రామం వరకు కొనసాగింది. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి సిర్ల ప్రసాదరావు అధ్యతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతలను నమ్ముకుంటే.. నెట్టేట ముంచేశారని పలు నిర్వాసిత గ్రామాలకు చెందిన వారు వాపోయారు. అక్రమాలకు పాల్పడి అనర్హులకు యూత్, పలు రకాల ప్యాకేజీలు మంజూరు చేశారు తప్ప, అర్హులను విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వాసిత సమస్యలు పరిష్కరిస్తారని గెలిపించిన స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి అక్రమార్కులకు అండగా నిలిచారని మండిపడ్డారు. నిర్వాసితుల పోరాటాల ఫలితమే ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భావితరాల కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. హిరమండలంలో నిరాహర దీక్షలతో పాటు ప్రత్యక్ష పోరాటాలకు నిర్వాసితులు సిద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదరబాదరగా రూ.420 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇది కేవలం పోరాటాలు ఫలితం తప్ప, టీడీపీ నేతలు కృషి మాత్రం కాదని తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం 2013 భూసేకరణ చట్టం అమలు కోసం నిర్వాసితులు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విదంగా గూనభద్ర రిజర్వాయర్ పక్కన ఉన్న పాతకాలనీ 100 మీటర్ల దూరం కంటే తక్కువుగా ఉన్నప్పటకీ ముంపు గ్రామంగా ప్రభుత్వం గుర్తించక పోవడం దారుణమని విమర్శించారు. నిర్వాసితులను నీరుగార్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కుట్రలు పన్నుతున్నా.. అందుకు ధీటుగా బాధితులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కొయిలాపు సంజీవురావు మాట్లాడుతూ నిరాసితులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, ఐక్య పోరాటాలతోనే వాటిని ఎదుర్కోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి గంగరాపు ఈశ్వరమ్మ, గణపతి, పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు. -
‘20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా లేదు’
సాక్షి, విజయవాడ: 20 ఏళ్లు అయినా కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదని ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. సోమవారం ఏపీసీసీ కార్యాలయంలో రఘవీరా మీడియాతో మాట్లాడుతూ.. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. పోలవరం నిర్వాసితులు, పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు భరోసా కలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు, వైద్యం సరిగా అందడం లేదన్నారు. నష్ట పరిహారం విషయంలో నిర్వాసితులను గిరిజన, గిరిజనేతరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీకి పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి లేఖ రాస్తున్నట్టు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు వర్ణాతీతంగా ఉన్నాయని అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు గురించి కాకుండా నిర్వాసితుల గురించి ఆలోచించాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. 20 తేదీలోపు నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే వాళ్లమని పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ 6 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా దామోదరం సంజీవయ్య ఇంటిని రాహుల్ సందర్శిస్తారని.. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారని.. ఆ తర్వాత కర్నూల్లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలిపారు. రాఫెల్ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రఘవీరారెడ్డి విమర్శించారు. 500 కోట్లతో కొనుగోలు చెయాల్సిన ఒక యుద్ధ విమానానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. 24వ తేదీన రాష్ట్ర నాయకత్వం మొత్తం విజయవాడ వేదికగా నిరసన తెలుపుతుందని ప్రకటించారు. ఆ రోజున గవర్నర్ నరసింహాన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిందిగా కోరారు. -
నిర్వాసితులకు రాళ్ల భూములిచ్చారు : ఎస్టీ కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ : ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే గిరిజనులకు కల్పించాల్సిన పునరావాసంపై రాష్ట్రపతికి జాతీయ గిరిజన కమిషన్ మంగళవారం నివేదిక అందజేసింది. పోలవరం కమాండ్ ఏరియాలో గిరిజనులకు సాగుభూమి ఇవ్వాలని సిఫారసు చేసింది. భూ సేకరణ చట్టం ప్రకారం గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. ఈ మేరకు ఆర్టికల్ 338 ఎ(5) ప్రకారం ఏపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ సూచించింది. రాజ్యాంగ రక్షణలు, సంక్షేమం, సామాజిక ఆర్థికాభివృద్ధి అంశాలను సమర్ధవంతంగా అమలు చేయాలని చెప్పింది. ఈ ఏడాది మార్చి 26 నుంచి 28 వరకూ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలను గిరిజన కమిషన్ సభ్యులు సందర్శించిన విషయం తెలిసిందే. నివేదికలోని ముఖ్యాంశాలు : - గిరిజనుల వద్ద భూమి తీసుకుని సాగుకు అనుకూలత లేని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని ఇచ్చారు. వీరికి పోలవరం కమాండ్ ఏరియాలో సాగుభూమిని ఇవ్వాలి. - కనీసం 2.5 ఎకరాల సాగుభూమిని ప్రాజెక్టు కింద ఇవ్వాలి. - అటవీ ఉత్పత్తులపై ఆధారపడి గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించాలి. - వరదల్లో కూలిపోయిన ఇద్దికులకొట్ట గ్రామంలోని ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలి. - గిరిజనులకు పరిహారం అంశాన్ని సుమొటోగా స్వీకరించి పునఃసమీక్షించాలి. - సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారాన్ని అందజేయాలి. - పునరావాస చర్యల్లో భాగంగా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. - కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. - పరిహార, పునరావాస కార్యక్రమాల బాధ్యతలు అన్నీ ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌కే ఇవ్వాలి. - ప్రాజెక్టుకు పూర్తి కావడానికి నాలుగు నెలల ముందే ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. - ప్రాజెక్టు ప్రభావితులకు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలి. - వీటన్నిటి పర్యవేక్షించే ఆర్ అండ్ ఆర్ అధికారులను బదిలీ చేయకూడదు. ప్రాజెక్టు పూర్తైన ఐదేళ్ల వరకూ అక్కడే సేవలందించాలి. -
మానేరు.. కనరు.. వినరు!
సాక్షి, హైదరాబాద్: ఏళ్లు గడుస్తున్నా మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల వెతలు తీరడం లేదు. ఓవైపు ఈ ప్రాజెక్టును ఆరంభించేందుకు కసరత్తు జరుగుతున్నా.. మరోవైపు దశాబ్దానికి పైగా పరిహారం అందక నిర్వాసితులు గుండెలు బాదుకుంటున్నారు. పదేళ్ల కిందట మొదలుపెట్టిన సహాయ, పునరావాస ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పునరావాస కాలనీల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. పట్టాల పంపిణీ మొదలు గృహ వసతి కల్పన వరకు స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం నిర్వాసితుల పాలిట శాపంగా మారింది. పూర్తికాని ఇళ్లు, రోడ్లు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25.87 టీఎంసీల సామర్థ్యంతో మిడ్‌మానేరు ప్రాజెక్టును 2006 అక్టోబర్‌లో చేపట్టారు. 2009 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని సంకల్పించినా 12 ఏళ్ల అనంతరం పనులు ప్రస్తుతం చివరి దశకు చేరాయి. ప్రాజెక్టు 25 గేట్లు బిగింపు ప్రక్రియ పూర్తయి, నీటి నిల్వకు సిద్ధమైంది. అయితే పన్నెండేళ్ల కింద మొదలైన పునరావాస ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టు కింద బోయినపల్లి మండలంలో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలంలో చీర్లవంచ, చింతల్ఠానా, వేములవాడ రూరల్ మండలంలో అనుపురం, రుద్రవరం, కొడుముంజ, సంకెపల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల్లో 11,731 కుటుంబాలు నిర్వాసితులవుతున్నట్లు 2008లో గెజిట్ జాబితా ప్రచురించారు. ఇప్పటికీ పలు ముంపు గ్రామాల్లో పూర్తిగా పరిహారం అందలేదు. గెజిట్ పబ్లికేషన్ సమయంలో తప్పిపోయిన వారు తమ పేరు నమోదు చేసుకోవడానికి ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు. గెజిట్‌లో దొర్లిన తప్పులు సవరించుకోవడానికి కూడా నానా తిప్పలు పడుతున్నారు. మొత్తం 13 పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి 4,500 ఇళ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా.. వెయ్యి మాత్రమే పూర్తి చేశారు. పునరావాస కాలనీల్లో రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి కనీస వసతులు కల్పించాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం అధికారులను ఆదేశించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. కాలనీల్లో వసతులేవి? నిర్వాసితులు రాక ముందే పలు పునరావాస కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. ఇళ్ల నిర్మాణ సమయంలోనే చాలాచోట్ల మురుగు కాల్వలు మట్టి, ఇసుక, ఇటుక తదితరాలతో పూడుకుపోయాయి. దీంతో కాలనీల్లో పారిశుధ్యం లోపించి దోమల బెడద తీవ్రంగా ఉందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలనీల్లో శ్మశాన వాటికలు లేకపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బంది ఎదురవుతోంది. కొదురుపాక, నీలోజిపల్లి కాలనీల్లో ఎవరైనా చనిపోతే మిడ్‌మానేరు కట్ట కింద అంత్యక్రియలు చేస్తున్నారు. కాలనీల పరిసరాల్లో బస్సులు నిలపడం లేదు. బస్షెల్టర్ల జాడే లేదు. ముంపు గ్రామాల్లో చెరువులు, కుంటల్లో రజకులు బట్టలు ఉతికి పొట్టబోసుకునేవారు. కొత్త కాలనీల్లో చెరువులు, కుంటలు లేకపోవడంతో వారి ఉపాధికి గండి పడింది. కాలనీలో దోబీఘాట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాలనీల్లో నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కోట్లు ఖర్చు చేసి రక్షిత మంచినీటి పథకాలు నిర్మించినా.. అధికారుల సమన్వయ లోపంతో ప్రజలకు నీటి వసతి అందడం లేదు. కొదురుపాక, నీలోజిపల్లి కాలనీల్లో రూ.80 లక్షల అంచనాలతో నీటి పథకాలు నిర్మించి, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా నీటి సరఫరా జరగడం లేదు. గెజిట్‌లో పేరు లేదని పరిహారం ఇవ్వలేదు నేను కుట్టు మిషన్ ద్వారా జీవనోపాధి పొందుతా. నాపేరు గెజిట్‌లో లేకపోవడంతో ఇప్పటి వరకు పైసా పరిహారం ఇవ్వలేదు. నాకు నలుగురు కుమారులు. ఇందులో ముగ్గురు పరిహారానికి అర్హులు. ఎవ్వరికి పరిహారం, పట్టా, ప్యాకేజీ రాలేదు. ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదు. – దోమకొండ రాజవీరు, కొదురుపాక ఇంటి నిర్మాణ బిల్లులు చెల్లించాలి ఆర్అండ్ఆర్ కాలనీల్లో వేల మంది నిర్వాసితులు అప్పులు తెచ్చి రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఆరు నెలల క్రితం పీఎంఈవై పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.1.20 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇవ్వడం లేదు. ఇళ్లు పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు విడుదల చేయాలి. – కూస రవీందర్, నీలోజిపల్లి యువతకు పరిహారం..పరిహాసం మిడ్‌మానేరు ముంపునకు గురైన గ్రామాల్లోని యువతకు రూ.2 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం 2015 మార్చిలో జీవో జారీ చేసింది. 2015 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండినవారిని పరిహారానికి అర్హులుగా నిర్ణయించింది. ఈ మేరకు 4,231 మంది యువతను పరిహారానికి అర్హులుగా గుర్తించారు. అయితే వారిలో ఇప్పటికి సగం మందికి మాత్రమే పరిహారం అందించారు. యువకులకు పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం యువతుల విషయంలో స్పష్టత ఇవ్వలేదని నిర్వాసిత మహిళలు అంటున్నారు. కొందరు నిర్వాసితుల కుటుంబాల్లో ఇద్దరు కుమారులకు పరిహారం అందింది. మరికొందరి ఇళ్లల్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నా పరిహారం అందకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. తాగడానికి నీళ్లు లేవు కాలనీలో నీటి వసతి లేక అరిగోస పడుతున్నాం. బోరు బావుల నుంచి నీరు చిన్న దారలా పోస్తుంది. పది నిమిషాలుంటే ఒక్క బిందె నిండుతుంది. ఎండాకాలం ఏ పనికి పోకుండా కేవలం నీరు తెచ్చుకోవడానికే సరిపోతుంది. – దూలపల్లి పోశవ్వ, కొదురుపాక -
నిర్వాసితులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
సాక్షి, గన్నవరం : విమానాశ్రయ భూనిర్వాసితులు శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పది రోజులుగా ఆందోళన చేస్తున్న తమను చర్చల పేరుతో ఎమ్మెల్యే ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని బయటకు గెంటివేయడంతోపాటు వ్యక్తిగత సిబ్బందితో దాడి చేయించారని మైనార్టీ వర్గానికి చెందిన బాధితులు ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. పెద్దఅవుటపల్లికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు షేక్ హైదర్‌సాహెబ్, మేడూరి తిరుపతయ్య, ఆయన కుమారుడు వినోదరావుకు 1974లో అప్పటి తహసీల్దార్ చిన్నఅవుటపల్లి గ్రామ పరిధిలో 1.10 ఎకరాల చొప్పున రెండు ఎకరాల ఇరవై సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల వారసులు ఆ భూమికి శిస్తు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం వీరి భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే ఎటువంటి పరిహారం చెల్లించకపోవడంతో గత పది రోజులుగా సదరు భూముల్లో పనులు జరగకుండా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటికి రావాల్సిందిగా నిర్వాసితులను కాంట్రాక్టర్ పిలిపించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిర్వాసితులు మల్లవల్లి, కొండపావులూరు, వీరపనేనిగూడెంలో ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం చెల్లించారని మాకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన వంశీ నిర్వాసితుల్లో ఒకరైన షేక్ అబ్దుల్లాను కాలర్ పట్టుకుని ఈడ్చుకువెళ్లి బయటకు నెట్టేశారని అక్కడే ఉన్న వీరి బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది దాడిచేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నిర్వాసితులు ఆయన ఇంటి ముందే గన్నవరం–పుట్టగుంట ఆర్ అండ్ బీ రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. రోడ్డుపై ధర్నాకు దిగినందుకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, చర్చల పేరుతో తమను ఇంటికి పిలిచి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు దుర్భాషలాడి, సిబ్బందితో కొట్టించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు. పోలీస్‌స్టేషన్ ముందు బాధితుల ధర్నా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి శనివారం రాత్రి ఆమె పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రాస్తారోకో చేసిన బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బాధితులను స్టేషన్లో నిర్బంధించి ఆహారం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. బాధితులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
వీడని పీటముడి
బోయినపల్లి (చొప్పదండి) : ‘మిడ్‌మానేరు’ ని ర్వాసితులు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపు విషయంలో పీటముడి వీడడంలేదు. పెరిగిన ధరల ప్రకా రం ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు చెల్లించాల ని నిర్వాసితులు కోరుతున్నారు. గతంలో ఐఏవై కింద ఇల్లు ఉండేదని, దానికి రూ.70 వేలు వర్తించేవని, ఇప్పుడు పీఎంఏవై కిందకు రావడంతో రూ.1.20 లక్షలకు మించి చెల్లించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మధ్య మానేరులో 5 టీఎంసీలు.. ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి మూడు నెలల క్రితం నీటిని విడుదల చేశారు. మిషన్ భగీరథ కోసం 5 టీఎంసీలను ఆ రిజర్వాయర్‌లో నిల్వ చేశారు. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో పలు ముంపు గ్రామాల్లోకి నీరు వచ్చిచేరింది. నిర్వాసితుల ఇళ్లు నీట మునిగాయి. దీంతో వారు ఆర్అండ్ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ రూరల్ మండలం రుద్రవరం, అనుపురం, కొడుముంజ, సంకెపల్లి గ్రామాలు మధ్యమానేరులో ముంపునకు గురువుతున్నాయి. ఈ గ్రామాల్లో 11,731 కుటుంబాలు సర్వం కోల్పోతున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరికి పునరావాసం కల్పించేందుకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాసకాలనీల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కొదురుపాక, నీలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఏళ్లుగా ఉంటున్నారు. నిర్వాసితులకు ఐఏవై (ఇందిరా ఆవాస్ యోజన– గతంలో ఉన్న ఐఏవైని ఇపుడు పీఎంఏవైగా మార్చారు) కింద నిధులు మంజూరు చేయాలని గతనెల 6న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రాజెక్టుల సమీక్షలో హౌసింగ్ ఎండీ చిత్రారామచంద్రన్‌ను నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంత్రి ప్రకటనతో కొత్తగా ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే నిర్వాసితులకు ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు మంజూరవుతాయి. అయితే, తాము అప్పుసప్పు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, సర్కారు ఇచ్చే సొమ్ము సరిపోవడంలేదని నిర్వాసితులు ఆవేదన చెందారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. అంతకుముందున్న ఐఏవై పథకం కింది ఇంటి నిర్మాణాన్ని పీఎంఏవై కిందకు తీసుకొచ్చింది. ఒక్కో ఇంటిపై రూ.50 వేలు పెంచి ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం ఈసొమ్ము సరిపోదని, మార్కెట్లో ధరలను పోల్చుకుని ఒక్కో ఇంటికి కనీసం రూ.2.50 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈపంచాయితీ ఎటూ తేలడంలేదు. బిల్లుల కోసం ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి.. ఆర్అండ్ఆర్ కాలనీల్లో నిర్వాసితులు నిర్మించుకుంటున్న ఇళ్ల జాబితా రూపొందించేందుకు తహసీల్దార్, పంచాయితీరాజ్ ఏఈతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచన మేరకు బిల్లులు మంజూరవుతాయి. ఇందుకోసం ఈక్రింది ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇంటి యజమాని ఆధార్ నంబరు నిర్వాసితుడి బ్యాంకు పాస్‌బుక్ ఇంటి ఎదుట నిర్వాసితుడు దిగిన ఫొటో వీటిని తహసీల్దార్, పీఆర్ ఏఈ కమిటీకి అందజేయాలి ఇలా అందిన దరఖాస్తులను కమిటీ ఉన్నతాధికారులకు నివేదిస్తుంది పరిశీలన పూర్తయ్యాక ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు విడుదలవుతాయి. నిర్వాసితులు సహరిస్తే చెల్లింపులు నిర్వాసితులు నిర్మించుకునే ఇళ్లకు మొదట ఐఏవై కింద రూ.70 వేలు వర్తించేవి. ఆ నిధులు సరిపోవడం లేదనే నిర్వాసితుల కోరిక మేరకు ఇళ్ల నిర్మాణాలను పీఎంఏవైగా మార్చాం. దీంతో ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిర్వాసితులు సహకరిస్తే తక్షణమే బిల్లులు చెల్లిస్తాం. – జీవీ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్వో -
ఖతర్ కీలక చట్టం: విదేశీయులకు గుడ్‌న్యూస్
సౌదీ నేతృత్వంలోని అరబ్ దేశాల నిషేధంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్, విదేశీయులకు గుడ్ న్యూస్ అందించింది. ఓ ల్యాండ్‌మార్కు బిల్లును ఖతర్ ఆమోదించింది. ఆ కీలక చట్టంతో ఖతర్‌కు వెళ్లే విదేశీయులకు శాశ్వత నివాస కార్డులు, కొత్త హక్కులు లభించనున్నాయి. ప్రస్తుతం ఖతర్ జనాభాలో విదేశీయులే ఎక్కువ. గల్ఫ్ ప్రాంతంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఇదే కావడం విశేషం. విదేశీయులు ప్రభుత్వ సర్వీసులు పొందడానికి ఈ చట్టం ఎంతో దోహదం చేస్తోంది. ఈ కొత్త చట్టం కింద కార్డుహోల్డర్స్ ఖతర్ జాతీయులగానే పరిగణించబడతారు. అంతేకాక అక్కడి రాష్ట్రాలు అందించే విద్యా, ఆరోగ్య పరమైన సర్వీసుల విషయంలో అన్ని ప్రయోజనాలను విదేశీయులు పొందుతారని ఖతర్ న్యూస్ ఏజెన్సీకి అధికారులు తెలిపారు. మిలటరీ, ప్రజా సంబంధమైన ఉద్యోగాల విషయంలో స్థానికుల తర్వాత వీరికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు చెప్పారు. స్థానిక భాగస్వామి అవసరం లేకుండా వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని, సొంత ఆస్తులను కలిగి ఉండొచ్చని ఖతర్ న్యూస్ ఏజెన్సీ(క్యూఎన్ఏ) రిపోర్టు చేసింది. విదేశీయులను పెళ్లి చేసుకున్న ఖతారి మహిళల పిల్లలకు, రాష్ట్రాలకు అవసరమైన ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ప్రజలకు, దేశాలనికి చెప్పుకోదగ్గ సేవలు అందించిన వారు ఈ కార్డులకు అర్హులవుతారని క్యూఎన్ఏ తెలిపింది. ఈ కొత్త చట్టం ఖతార్ ప్రధాన వార్తలలో నిలుపుతుందని, ఇతరులతో పోలిస్తే, మరింత ముందస్తుగా ఆలోచించే దేశంగా పేరొందుతుందని మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా అనాలిస్టు అలిసన్ వుడ్ చెప్పారు. ఇలాంటి రెసిడెన్స్ ప్రొగ్రామ్స్ ఇక ఎలాంటి దేశాల్లో లేవన్నారు. ఆయిల్ ధరలు తగ్గడంతో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న ఆరు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా, ఒమెన్ మినహా మిగతా నాలుగు దేశాల్లో స్థానిక జనాభా కంటే కూడా విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులే ఎక్కువ. -
పునరావాసం.. వనవాసం
కదిలిస్తే కన్నీళ్లు ఇరుకుగదులు.. చీకట్లో జీవితాలు పిల్లపాపలతో రాత్రంతా జాగారం చెట్టుకొకరు.. గుట్టకొకరు చీర్లవంచ నిర్వాసితులు పునరావాస కాలనీలో దుర్భరజీవితం ముంపులో అత్యధిక బాధితులు దళిత కుటుంబాలే.. సిరిసిల్ల రూరల్: నిన్నమొన్నటి వరకు వారు పది మందికి అన్నం పెట్టి ఆదుకున్న ఆపద్బాంధవులు. నేడు మధ్యమానేరులో సర్వం కోల్పోయారు. పునరావాస కేంద్రంలో ఓ పూట తిండి కోసం ఎదురుచూడాల్సిన దుర్భర పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పునరావాస కేంద్రాలు వనవాసాలుగా మారాయి. దీంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల మధ్యమానేరులో ముంపునకు గురై ఊరి ఖాళీ చేసి పుట్టెడు దుఃఖంతో వెళ్లిపోయి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న చీర్లవంచ నిర్వాసితులపై కథనం. సిరిసిల్ల మండలం చీర్లవంచలో నిర్వాసితులను ఎవరు కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. మధ్యమానేరులో సుమారు నాలుగు టీఎంసీల నీరు నిలిచి బ్యాక్‌వాటర్ గ్రామాన్ని ముంపుకు గురిచేసింది. దీంతో అధికారులు ౖహె అలర్ట్ ప్రకటించి 500 కుటుంబాలను ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. పూర్తిస్థాయి పరిహారం రాకున్నా ప్రాణభయంతో పిల్లాపాపలతో సామానులు సర్దుకుని తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోకి పరుగులుతీశారు. కరెంట్, మరుగుదొడ్లు లేని చోట తలదాచుకున్నారు. వర్షానికి రాత్రంతా నిద్రలేకుండా జాగారంచేశారు. ఎన్నాడు ఇతరులకు పెట్టడమే తప్ప తాము తీసుకునే పరిస్థితో బతికిన వారు పునరావాస కేంద్రాల్లో పేట్లు పట్టుకుని బుక్కెడు బువ్వకోసం నిలబడాల్సిన పరిస్థితిని తలచుకుని బోరున విలపించారు. నిర్వాసితులను చూసేందుకు ఇతర గ్రామాలనుంచి వచ్చి బం«ధువులు, పుట్టింటివారిని చూసి దుఃఖం ఆపుకోలేక రోదించారు. చంటిపిల్లలను పట్టుకుని ఫ్యాన్లు, కరెంట్ లేని చిన్న గదుల్లో పదేసి కుటుంబాలు తలదాచుకున్నాయి. ఈ చీకటి రాత్రిని చీర్లవంచ నిర్వాసితులు మరచిపోలేకపోతున్నారు. ఆదివారం రాత్రి ఎలాగో పునరావాకేంద్రంలో తలదాచుకుని తెల్లవారి బంధువుల ఇంటికి చాలామంది తమ పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు. ఏ ఆధారంలేని వారు ఈ పునరావాస కేంద్రాల్లోనే జీవనం వెళ్లదీస్తున్నారు. గ్రామంలోని నీరుపోతే మళ్లీ అదే ఇంట్లోకి వెళ్లి ఉందామని చాలామంది నిర్వాసితులు వేచిచూస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ యంత్రాంగం పునరావాస కేంద్రంలోని నిర్వాసితులకు భోజనఏర్పాట్లు చేస్తున్నారు. బతికుండగానే చంపుతున్నారు..? ‘గ్రామంలో ఇంకా 600 మందికి పూర్తిస్థాయి పరిహారం రాలేదు. 450 మందికి ఇళ్ల పైసలు రాలేదు. చాలామంది అర్హులకు ప్లాట్లు కేటాయించలేదు. మరికొందరికి కోరుకున్న చోట కాకుండా మరోచోట పట్టాలిచ్చారని’ నిర్వాసితులు గోడు వెల్లబోసుకున్నారు. ‘మా డబ్బులు మాకిస్తే ఎక్కడో ఓ జాగల బతుకుతాం కదా. ఇలా బతికుండా ఎందుకు మమ్ములను చంపుతున్నారు’ అని ప్రశ్నించారు. మేం చచ్చాక పరిహారం ఇస్తారా.. అంటూ నిలదీశారు. ఏ ప్రభుత్వం వచ్చిన నిర్వాసితుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకునన్నామని, తమకు న్యాయం చేయాలని, పరిహారం ఇవ్వకముందే తమను ఊళ్లో నుంచి వెళ్లగొట్టొద్దని వేడుకున్నారు. జాగ లేక రేకులు వేసుకున్నాం.. –ఆలుగొండ మల్లవ్వ ఒక్కసారిగా నీరు రావడంతో ఇల్లు మునుగుతుందోనని అధికారులు ఏర్పాటుచేసిన వ్యాన్‌లో సామానులు సర్దుకుని నాయినూరిపల్లి పునరరావాస కేంద్రానికి వచ్చాం. ఇక్కడ ఉండడానికి జాగలేదు. మాకు కేటాయించిన స్థలంలో అప్పటికప్పుడు రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకుని ఉంటున్నం. ఈ రేకులు కూడా వాన వచ్చినా.. గాలివచ్చినా కూలిపోతుంది. రాత్రంతా నిద్ర పోలే.. – మాన్వాడ దుర్గవ్వ సీకట్ల పొరగండ్లను పట్టుకుని ఇక్కడికి వచ్చి గోసపడ్డం. సార్లు ఇంత బువ్వపెట్టిండ్రు. కరెంటు లేదు ఏంలేదు. రాత్రంతా నిద్రపోకుండా మెలకువతోనే జాగారం చేసినం. ఎప్పడు తెల్లరుతుంది అని చూసినం. గింత పరిస్థితి వస్తదనుకోలేదు –నెల్లుట్ల కనకయ్య గింత బతుకు బతికి గీ పరిస్థితి వస్తదనుకోలే. ఒక్కసారిగా ఇండ్లలోకి నీళ్లు వస్తే గీ ముసలిదాని పట్టుకుని గీ వయసుల ఎక్కడికని పోతాం. అయ్యో భగవంతా.. అని ఈ బడిలకు వచ్చి తలదాచుకున్నం. ఉన్న నాలుగెకరాలు డ్యాంల పోయింది. గిప్పుడు ఇల్లు మునిగింది. ఉండానికి ఇల్లు కూడా లేదు. మేం ఎట్ల బతికేది. అధికారుల నిర్లక్ష్యంతోనే.. – మచ్చ లక్ష్మణ్.ఉపసర్పంచ్, చీర్లవంచ చీర్లవంచ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడంలో, సర్వేలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఉన్నోడికి ఒక విధంగా, లేనోడికి ఒక విధంగా పరిహారం ప్రకటించి మా పొట్ట కొట్టారు. ఇప్పుడు ఊళ్లోకి నీళ్ల వస్తాయని కుటుంబాలను తరలించి ఇబ్బందులు పెడుతున్నారు. -
పునరావాసానికి ఏం చర్యలు చేపట్టారు?
* ఆలూరును సందర్శించి వీడియో రికార్డు సమర్పించండి * మహబూబ్‌నగర్ కలెక్టర్, భూసేకరణ అధికారులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ర్యాలంపాడు రిజర్వాయర్‌లో భాగంగా నిర్వాసితులవుతున్న మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామస్తుల పునరావాసానికి సంబంధించి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. దాదాపు 1,500 కుటుంబాల పునరావాసం, పరిహారం పంపిణీకి సంబంధించిన రికార్డులతో గురువారం ప్రత్యక్షంగా హాజరుకావాలని కలెక్టర్, స్పెషల్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఆదేశించింది. అలాగే ఈ ముగ్గురు అధికారులు ఆలూరు గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులకు కల్పించిన సౌకర్యాలకు సంబంధించిన వీడియో రికార్డులను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది. పూర్తి పరిహారం చెల్లించకుండా తమను చట్టవిరుద్ధంగా ఊరి నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ హరిజన నాగేష్‌తోపాటు మరో 224 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సురేష్‌కుమార్ ఖైత్ మంగళవారం విచారించారు. నిర్వాసితుల్లో దాదాపు 35 మందికి ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఇతరులకు ప్లాట్లు ఇచ్చిన పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదని, దీంతో వారు ఇళ్లు నిర్మించుకోలేకపోయారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ నివేదించారు. 2005లో ఇచ్చిన జీవో ప్రకారం ఇప్పుడు పరిహారం ఇస్తున్నారని, ఇప్పుడు ఇస్తున్న డబ్బుతో కనీసం వారు ఇటుకలు కూడా కొనలేని పరిస్థితి ఉందని తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు రూపొందించిన జాబితా ప్రకారం 1450 కుటుంబాలకుగాను 94 గహాల నిర్మాణం మాత్రమే పూర్తయ్యిందని, 150 నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా గ్రామంలోకి నీళ్లు వదిలారని, దీంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడాల్సి వచ్చిందని మరో పిటిషనర్ హరిజన్ మల్దకల్ తరఫు న్యాయవాది ఎన్ఎస్.అర్జున్ పేర్కొన్నారు. నిర్వాసితులపట్ల స్థానిక తహసీల్దార్ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని, వారి బాధలు చెప్పుకునేందుకు వెళ్తే హైకోర్టు వెళ్లారు కదా.. అక్కడి నుంచే ఆదేశాలు తెచ్చుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడని పేర్కొన్నారు. -
మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇంచు భూమి ఇవ్వం
మహదేవపూర్ మండలం సూరారం రైతులు కాళేశ్వరం: మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీకి ఇంచు భూమికూడా ఇవ్వమని సూరారం రైతులు స్పష్టంచేశారు. స్థానిక ఐబీ విశ్రాంతి భవనంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రైతులతో చర్చించకుండానే ముంపు భూములను సర్వే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండలంలో సుమారుగా 3వేల ఎకరాలకు పైగా ముంపుకు గురవుతోందన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో నడుస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే మరోవైపు రైతులను నిర్బంధించి పోలీసులతో బందోబస్తు పెట్టి సమావేశాలు ఏర్పాటుచేయడమేనా అని గుర్తు చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. టీవీ షోలపై ఉన్నంత మక్కువ రైతులపైన లేదని విమర్శించారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించకుండా డీపీఆర్‌ప్రకటించడం, టెండర్లు పిలవడం, క్యాంపులు ఏర్పాటు చేయించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్రల సీఎంలు ప్రాజెక్టుల ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా కేసీఆర్ వద్ద మార్కులు కొట్టెయడానికి ఇతర నియోజకవర్గ నాయకులు కాళేశ్వరంలో క్షీరాభిషేకాలు చేశారన్నారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని కోరారు. నాగుల లక్ష్మారెడ్డి, చల్ల కృష్ణారెడ్డి, బండం శ్రీనివాస్‌రెడ్డి, చల్ల చెంద్రయ్య, ములుకల్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన భూనిర్వాసితులు
123 జీవో రద్దు చేయాలి 2013 చట్టం వర్తింపజేయాలి రిట్‌పిటిషన్ వేసిన గౌరవెల్లి నిర్వాసితులు కొనసాగుతున్న దీక్షలు హుస్నాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని గౌరవెల్లి రిజర్వాయర్ భూనిర్వాసితులు 32 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి వేసారిన బాధితులు ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 123 జీవోను రద్దు చేయాలని, 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరుతూ దాదాపు 8 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుడాటిపల్లెకు చెందిన గుర్రం రాజిరెడ్డి, బద్దం మల్లారెడ్డి, కొత్త మోహన్‌రెడ్డి, బొజ్జపురి రాజు, గంభీరపు వివేకానందు( గౌరవెల్లి సర్పంచ్), అంగేటి చంద్రారెడ్డి, గుర్రం రాజిరెడ్డి, కుంట తిరుపతిరెడ్డి 25 మంది నిర్వాసితులతో కలిసి గురువారం హైకోర్టులో రిట్ వేశారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంచొద్దని, 2013 భూ సేకరణ చట్టం వర్తింపజేయాలని వేర్వేరుగా రెండు పిటిషన్లు వేశారు. 18 ఏళ్లు దాటిన చదువుకున్న పిల్లలకు ఉద్యోగం, ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే 2200 ఎకరాలు సేకరించిందని, ప్రాజెక్టు ఎత్తు పెంచితే మరో 1800 ఎకరాలు అవసరమని తెలిపారు. తొలి దశలో ఎకరాకు రూ.2.10లక్షల పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించలేదని, ఇంకా 80 మందికి పరిహారం రావాల్సి ఉందని, ఇళ్ల అడుగుస్థలం దాదాపు 350 ఎకరాలకు పరిహారం అందలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తొలిదశ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండానే రెండో దశకు సేకరిస్తే అంగీకరించలేదని స్పష్టం చేశారు. అన్ని పక్షాలు ఏకమై.. గౌరవెల్లి భూనిర్వాసితులకు మద్దతుగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్ సైతం నిర్వాసితలకు సంఘీభావం తెలిపారు. సీపీఎం పాదయాత్ర, సీపీఐ కలెక్టరేట్ ముట్టడి, కాంగ్రెస్ ఆందోళనలు, వంటావార్పు, బీజేపీ భరోసాయాత్ర, రెడ్డి సంక్షేమ సంఘం 24 గంటల దీక్షలు ఇలా అన్ని వర్గాలు నిర్వాసితులకు మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికే మల్లన్నసాగర్ నిర్వాసితులు 123 జీవో రద్దుకు హైకోర్టును ఆశ్రయించారు. గౌరవెల్లి నిర్వాసితుల పిటిషన్‌పై గురువారం వాదోపవాదనలు విన్న తర్వాత ఈనెల 22కు వాయిదా వేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని త్వరలోనే సీపీఐ తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్నట్లు పార్టీ మండల కార్యదర్శి కొయ్యడ సృజన్‌కుమార్ తెలిపారు. స్పందనే లేకనే.. – గుర్రం రాజిరెడ్డి, నిర్వాసితుడు, గుడాటిపల్లె భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని 32 రోజులుగా రిలే నిరహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అందుకే హైకోర్టులో పిటిషన్ వేశాం. ఏడేళ్లుగా పరిహారం కోసం నిరీక్షిస్తున్నాం. తొలిసారి భూములు ఇచ్చినప్పుడు ఐఏవై కింద ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇటీవల ఆర్డీవో వచ్చి ప్రతి ఇంటికి కేవలం రూ.50వేలు ఇస్తామన్నారు. న్యాయం దక్కే వరకూ.. – కొత్త మోహన్‌రెడ్డి, నిర్వాసితుడు, గుడాటిపల్లె మాకు న్యాయం దక్కే వరకు పోరాడుతాం. 123 జీవో రద్దు చేయాలని హైకోర్టులో కేసు వేశాం. కోర్టు తీర్పు ద్వారా మాకు న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నాం. ఇన్ని రోజులు ప్రభుత్వం చెబితే విన్నాం.. కానీ మా మాటను వింటలేదు. భూ సేకరణ 2013 చట్టం ప్రకారం పరిహారం వచ్చే దాకా పోరాడుతాం. -
నిర్వాసితులంతా హైకోర్టును ఆశ్రయించాలి
సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సాక్షి, హైదరాబాద్: భూ నిర్వాసిత రైతులంతా హైకోర్టును ఆశ్రయించి 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం సాధించాలని సీపీఎం సూచించింది. ఈ చట్టంలో పేర్కొన్న గ్రామసభల నుంచి ఇతర హక్కులన్నీ అమలు జరిపించాలని కోరింది. ఇది బలవంతపు భూసేకరణ కాదని కోర్టులో అబద్ధాలు చెప్పి భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి పొందిందని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కోర్టు రూలింగ్ బాధాకరమైనా, 2013 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో అమలు జరిపిస్తామని కోర్టు పేర్కొనడం రైతులకు కొంత ఊరట కలిగించిందన్నారు. పునరావాసం కింద ఉపాధి పరిహారం రూ. 7.5 లక్షల వరకు చెల్లించేట్లుగా 190 డ్రాఫ్ట్ జీవోను ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది కాని చట్టబద్ధ హక్కులను విస్మరించిందని విమర్శించారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణను చేయాలని కోరే రైతులంతా కోర్టును ఆశ్రయిస్తే అందుకు అందరికీ అనుమతినిస్తామని హైకోర్టు రూలింగ్ ఇచ్చిందని తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ పేర్కొంది. కోర్టు ఇచ్చిన ఈ సౌలభ్యాన్ని భూములు కోల్పోయే రైతులు వినియోగించుకోవాలని కమిటీ కన్వీనర్ బి.వెంకట్ కోరారు. -
నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి
మిర్యాలగూడ : టెయిల్‌పాండ్ భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని దామరచర్ల జెడ్పీటీసీ శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద టెయిల్‌పాండ్ భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే దీక్షలకు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెయిల్‌పాండ్ వల్ల ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముంపులో మునిగిపోతున్న ఎత్తిపోతల పథకాలను పుననిర్మించాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు సైదానాయక్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాపానాయక్, సీపీఎం పట్టణ కార్యదర్శి జగదీష్‌చంద్ర, రైతుల సంఘం నాయకులు గోర్ల ఇంద్రారెడ్డి, కేవీపీఎస్ నాయకులు పరుశురాములు, నిర్వాసితుల కమిటీ నాయకులు లాలునాయక్, ముని, వెంకన్న, ఆంజనేయులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న కేసీఆర్
చట్టప్రకారం భూసేకరణ చేపట్టాలి ప్రశ్నిస్తే లాఠీచార్జి చేస్తారా? బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి హుస్నాబాద్‌రూరల్ : బతుకులు బాగుపడతాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనిబీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా శుక్రవారం రైతు భరోసాయాత్ర చేపట్టారు. ముంపుప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను న్యాయాస్థానాలు తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడైన భూనిర్వాసితులను ఆదుకునేందుకు 2013 భూసేకరణ చట్టం ఉందని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బోగస్ జీవో 123ను తెచ్చి రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూసిందన్నారు. 123 జీవోపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చిన ఐదేళ్లలోపు పరిహారం పూర్తిగా చెల్లించకపోతే రీనోటిఫికేషన్ వేసి కొత్త చట్టం ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నోటిఫికేషన్ ఇచ్చి ఏడేళ్లు గడుస్తున్నా పరిహారం పూర్తిగా చెల్లించకపోవడంతో రీనోటిఫికేషన్ వేయాలన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు బీజేపీ పోరాడుతుందన్నారు. కేంద్రం పేదల కోసం 90 వేల గహాలు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. సర్పంచులు వివేకానంద్, యాదమ్మసంపత్, బీజేపీ రాష్ట్ర నాయకుడు నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, సాయిని మల్లేశం, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి జయపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్,నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి,భగవాన్‌రెడ్డి,వేణుగోపాల్‌రెడ్డి,వేణుగోపాల్‌రావు,మనోహర్‌రావు, కిషన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కర్ర సంజీవ్‌రెడ్డి, లింగారెడ్డి, శంకర్, సతీష్, భూనిర్వాసితులు దొడ్ల మల్లారెడ్డి, రమేశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
మిర్యాలగూడ : టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే దీక్షలకు గురువారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం నాలుగు గ్రామాలు నీటమునిగే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా ఎనిమిది ఎత్తిపోతల పథకాలు కూడా మునిగిపోతున్నాయని, వాటి పరిధిలోని నాలుగు వేల ఎకరాల భూమి బీడుగా మారనుందని పేర్కొన్నారు. 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తిరిగి యధావిధిగా ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా గతంలో కేవలం ఎకరానికి 1.25 లక్షల రూపాయలే చెల్లించారని, ప్రస్తుతం ముంపు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం –2013 ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో సమావేశమై భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్‌నాయక్, పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, కందిమళ్ల లక్షా్మరెడ్డి, సీపీఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రవినాయక్, చంద్రశేఖర్‌యాదవ్, కమిటీ నాయకులు హనుమంతునాయక్, లాలునాయక్, మునినాయక్, బాబి, సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.