కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి! | AP Government Has Released Compensation To CBR Expats | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి!

Published Thu, Oct 8 2020 7:56 AM | Last Updated on Thu, Oct 8 2020 7:58 AM

AP Government Has Released Compensation To CBR Expats - Sakshi

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

తాడిమర్రి: అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలకు తాగు, సాగునీరు సౌకర్యాల కోసం 1993 సంవత్సరంలో 10 టీఎంసీల లక్ష్యంతో తాడిమర్రి మండల సరిహద్దు, వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం పార్నపల్లి సమీపంలో చిత్రావతి నదిపై బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం ప్రారంభించారు. రూ.31.3 కోట్ల వ్యయంతో 1993లో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు నిలుపుదల చేశారు. దీంతో అప్పటి వరకు చేసిన నిర్మాణాన్ని తొలగించి 1999లో తిరిగి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం రూ.93.87 కోట్లు మంజూరు తేసింది. కానీ పనుల్లో పురోగతి లేదు. ఈ క్రమంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ మరో రూ.50 కోట్లు విడుదల చేయించడంతో పాటు పనుల్లో వేగం పెంచారు. చివరకు ఆ మహానేత హయాంలోనే 2006లో రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తయ్యింది.  

పరిహారం అందక.. మరోదారి లేక 
సీబీఆర్‌ నిర్మాణంతో ముదిగుబ్బ మండలంలోని మొగళచెట్లపల్లి, యర్రగుంటపల్లి, రాఘవపల్లి, చిన్నకోట్ల, పెద్దచిగుళ్లరేవు, తాడిమర్రి మండలంలోని పెద్దకోట్ల, గుడ్డంపల్లి, మోదుగులకుంట, మర్రిమాకులపల్లి, చిన్నచిగుళ్లరేవు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పెద్దకోట్ల, గుడ్డంపల్లి, మోదుగులకుంట గ్రామాల ప్రజలు ముంపు గ్రామాలను వదిలి పునరావాసం కింద మరో ప్రాంతంలో గ్రామాలను నిర్మించుకున్నారు. వారికి రిజర్వాయర్‌ రీహ్యాబిలిటేషన్‌(ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీ కింద పరిహారం అందించారు. మర్రిమాకులపల్లి, చిన్నిచిగుళ్లరేవు గ్రామాలకు మాత్రం పరిహారం ఇవ్వలేదు. దీంతో వారు గ్రామాలను వదల్లేక.. మరో ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించడంతో.. 
వైఎస్సార్‌ జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌ నుంచి సీబీఆర్‌కు మూడేళ్లుగా నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి 6–7 టీఎంసీలు నీరు చేరితే ఈ రెండు గ్రామాల్లోకి నీరు చొరబడుతోంది. దీంతో గ్రామస్తులు అవస్థలు పడుతూ వచ్చారు. వీరి సమస్యలు విన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాధితుల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ధర్నాలు చేపట్టారు. అయినా అప్పటి పాలకుల్లో కదలిక రాలేదు. 2019లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మరోసారి నిర్వాసితుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్‌ పలుమార్లు ముంపు గ్రామాలను పరిశీలించారు. అధికారులతో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచారు. 

వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద నిధులు  
కలెక్టర్‌ నివేదిక మేరకు ప్రభుత్వం మర్రిమాకులపల్లిలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ద్వారా వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ప్రకారం 410 కుటుంబాలకు రూ.41.60 కోట్లు, 119 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున రూ.8.33 కోట్లు విడుదల చేసింది. అలాగే చిన్నచిగుళ్లరేవు గ్రామంలో 226 కుటుంబాలకు రూ.22.60 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే కొందరు నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం సొమ్ము జమకాగా.. మరో వారంలో బాధితులందరికీ పరిహారం అందనుంది. 

నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ 
ధర్మవరం అర్బన్‌: సీబీఆర్‌ నిర్వాసితుల ఖాతాల్లో ఇప్పటికే రూ.50 కోట్ల మేర పరిహారం జమ అయినట్లు కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆర్డీఓ మధుసూదన్‌తో కలిసి పట్టణంలోని ఎన్జీఓ హోంలో సీబీఆర్‌ ముంపు గ్రామాల పరిహారానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. సీబీఆర్‌ ముంపుకు గురయ్యే గ్రామాలకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం అందించనున్నట్లు తెలిపారు. తాడిమర్రి మండలంలోని సీసీరేవు, మరిమేకలపల్లి, ముదిగుబ్బ మండలంలోని పీసీరేవు, రాఘవంపల్లి గ్రామాల్లో 1,729 కుటుంబాలు నివాసాలు కోల్పోయాయని ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.240.53 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.  

30 ఏళ్ల నిరీక్షణకు ఫలితం 
1993లో రిజర్వాయర్‌ నిర్మాణం ప్రారంభించగా.. మా గ్రామం ముంపు ప్రాంతంగా ప్రకటించారు. పరిహారం అందితే మరోప్రాంతానికి వెళ్లి ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాం. కానీ అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. మూడు దశాబ్దాలుగా మేము ఎదురుచూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకు జగన్‌మోహన్‌రెడ్డి కరుణించి పరిహారం మంజూరు చేశారు. 
– నారాయణప్ప, మర్రిమాకులపల్లి, తాడిమర్రి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement