ఇది పెనుకొండ మండలం గుడిపల్లి ఇండస్టియల్ పార్క్‌లో ఏర్పాటైన ఎస్‌ఆర్‌ఎం కంపెనీ. 2021లో దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నెలకొల్పారు. కార్ల సంబంధిత పరికరాలను రోబోల సహాయంతో తయారు చేసి కంపెనీలకు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా వందల సంఖ్యలో కార్మికులు లబ్ధి పొందుతున్నారు.
సాక్షి, అనంతపురం: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఉమ్మడి అనంతపురం జిల్లా స్వర్గధామంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారమందుతుండడం, పెద్ద నగరాలకు సులువుగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
మూడేళ్లలోనే 900 పరిశ్రమలు..
పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కల్పించారు. వీటిల్లో పుట్టపర్తి మండలం కప్పల బండ, రాప్తాడు, ఆర్.అనంతపురం, కొటిపి గ్రామాల్లోని పార్కుల్లో 50 శాతానికి పైగా రాయితీతో పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించారు. దీంతో గత మూడేళ్లలోనే రూ.300 కోట్ల పెట్టుబడితో 990 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఒక్క శ్రీ సత్యసాయి జిల్లాలోనే 800కి పైగా పరిశ్రమలు రూపుదిద్దుకున్నాయి.
6,200 మందికి ఉపాధి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. 990 పరిశ్రమల ద్వారా దాదాపు 6,200 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుందన్నారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఈ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి.
హిందూపురం డివిజన్ పరిధిలోని గొల్లాపురం గ్రామంలో గతేడాది రూ.7 కోట్ల పెట్టుబడితో ప్రైమ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏర్పాటు చేశారు. గృహోపకరణాలైన డోర్లు, కిటికీలతోపాటు వివిధ రకాల వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 250 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు.
పారిశ్రామిక హబ్‌ల తయారీ లక్ష్యం..
రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాలను పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా మార్చి పారిశ్రామిక హబ్‌లుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక సంకల్పంతో సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నుంచి సులువుగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కారిడార్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు సైతం పరిశ్రమిస్తుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, సమీపంలోనే ఉపాధి దొరుకుతుండడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని విధాల ప్రోత్సాహం
పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. భూముల కేటాయింపుతోపాటు విద్యుత్ రాయితీలను సైతం అందిస్తోంది. హిందూపురం పారిశ్రామికవాడ పరిధిలోని గొల్లాపురం, కొటిపిలో ప్రత్యేకంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే భూములను అభివృద్ధి చేశాం. మౌలిక వసతులు కల్పించాం. యువ పారిశ్రామికవేత్తలు యూనిట్ ఏర్పాటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి.
– మురళీమోహన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment