
మడకశిర.. జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని జనం. అందుకే యువత ఉపాధి కోసం పెద్దసంఖ్యలో సమీపంలోని కర్ణాటకకు వలసవెళ్తోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే నియోజవకర్గంలోని అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపేందుకు రూ. 214.కోట్లు విడుదల చేసింది. తాజాగా ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు పారిశ్రామికవాడ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
మడకశిర: మండలంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో పారిశ్రామికవాడకు దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే బీజం పడింది. అప్పట్లోనే మడకశిర మండలం గౌడనహళ్లి, ఛత్రం, ఆర్. అనంతపురం గ్రామ పంచాయతీల పరిధిలో 800 మంది రైతుల నుంచి 1,600 ఎకరాల భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపలేదు. భూములిచ్చిన రైతులకు చంద్రబాబు హయాంలో పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా చెల్లించ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బకాయిపడ్డ రూ.25 కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
వసతులు పుష్కలం
పారిశ్రామిక వేత్తలు సౌకర్యాలన్నీ చూశాకే పరిశ్రమల స్థాపనకు ముందుకువస్తారు. మడకశిరపరంగా చూస్తే కావాల్సిన వసతులన్నీ అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. అంతర్జాతీయ విమానాశ్రయమున్న బెంగళూరు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చే అవకాశ ముంది. అదే విధంగా రాయదుర్గం నుంచి మడకశిర మీదుగా తుమకూరు వరకూ ప్రస్తుతం రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇప్పటికే పారిశ్రామికవాడకు చుట్టుపక్కలున్న చెరువులకు ఏటా కృష్ణా జలాలు అందుతున్నాయి. వీటితో పాటు మడకశిర–కర్ణాటకలోని ముఖ్యమైన పట్టణాల మధ్య జాతీయ రహదారుల అనుసంధానం పెరిగింది. ఇవన్నీ పారిశ్రామికవాడ అభివృద్ధికి దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.
చదవండి: (CM Jagan: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్)
ఏపీఐఐసీకి 1,443 ఎకరాల భూమి అప్పగింత
మడకశిర కేంద్రంగా ఏర్పాటు చేసే పారిశ్రామికవాడ వేగంగా ప్రగతి సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి అవసరమైన చర్యలను చేపట్టింది. పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జాప్యం జరగకుండా భూ కేటాయింపునకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు 1,443 ఎకరాల భూమిని వెంటనే అప్పగించింది.
రెండు పరిశ్రమలకు భూమి కేటాయింపు
ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మౌలిక వసతులు కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అర ఎకరా చొప్పున భూమిని కేటాయించింది. అంతేకాకుండా బెంగళూరు చెందిన పలువురు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరుతూ ఏపీఐఐసీకి దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది. వీరికి కూడా భూమి కేటాయించడానికి ఏపీఐఐసీ ప్రక్రియను ప్రారంభించింది. ఇలా ఒక్కో పరిశ్రమ ఏర్పాటవుకు అడుగులు పడుతుండగా...నిరుద్యోగుల కల సాకారమయ్యే రోజు ఎంతో దూరం లేదని తెలుస్తోంది.
చదవండి: (వారానికోసారి కట్టించేసుకోండి)
పారిశ్రామికవాడ అభివృద్ధికి చర్యలు
మడకశిర పారిశ్రామికవాడ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం 1,443 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే రెండు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎకరా భూమి కేటాయించాం. పరిశ్రమల ఏర్పాటుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే దరఖ>స్తులు కూడా సమర్పించారు. వారికి నిబంధనల మేరకు భూములు కేటాయిస్తాం. పారిశ్రామికవాడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఉంది.
– మల్లికార్జున్, జిల్లా మేనేజర్, ఏపీఐఐసీ
మడకశిర సమగ్రాభివృద్ధి
మడకశిరను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ నేతృత్వంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికులకు 75 శాతం ఉపాధి అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగుల జీవితాలు బాగు పడుతాయి. యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం.
–డాక్టర్ తిప్పేస్వామి, ఎమ్మెల్యే, మడకశిర
స్థానికంగానే ఉపాధి
మడకశిర కేంద్రంగా పారిశ్రామికవాడ ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెస్సీ పూర్తి చేశా. ఉద్యోగ వేటలో ఉన్నా. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటైతే తప్పకుండా ఇక్కడే ఉద్యోగం దొరుకుతుంది. అమ్మానాన్నలను చూసుకుంటూ ఇక్కడే ఉండవచ్చు. ఇంతటి అవకాశమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం.
– శోభ, దొక్కలపల్లి, అగళి మండలం
కల నెరవేరింది
నిరుద్యోగులు ఏళ్ల తరబడిగా పారిశ్రామికవాడ కోసం ఎదురు చూస్తున్నాం. మాలాంటి వారి కలను వైఎస్ జగన్ నెరవేరుస్తుండడం ఎంతో గొప్ప విషయం. నేను బీటెక్ పూర్తి చేసినా సరైన ఉద్యోగం దొరకలేదు. పారిశ్రామికవాడలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటైతే మంచి ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా.
– మంజునాథ్, మడకశిర
75 శాతం ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చిన జీఓ ప్రకారం పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాంతం నుంచి ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడు పారిశ్రామికవాడ ఏర్పాటై పరిశ్రమల స్థాపన జరిగితే వీరందరూ తిరిగి స్వగ్రామాలకు వస్తారు.
– కృష్ణయాదవ్, ఆర్ గొల్లహట్టి, రొళ్ల మండలం