విశాఖపట్నంలో నిర్వహించిన ‘విజన్ విశాఖ’ సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, సదస్సులో ప్రసంగిస్తున్న సీఎం జగన్
ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన: సీఎం జగన్
రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజిన్ లాంటిది
పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి దీటుగా ఎదుగుతుంది
వ్యవసాయంతోపాటు తయారీ, సేవా రంగాలూ వృద్ధి చెందాల్సిందే
ఏపీలో ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్.. రూ.16 వేల కోట్లతో 4 కొత్త పోర్టుల నిర్మాణం
3 భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి
స్వయం ఉపాధితో జీవన ప్రమాణాలను పెంపొందించాం
నేను ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు.. శాసన రాజధానిగా అమరావతి
విశాఖపట్నంపై ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం
‘విజన్ విశాఖ’ను ఆవిష్కరించిన సీఎం
రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రణాళిక.. సచివాలయం ఐకానిక్ భవనం నమూనా ఆవిష్కరణ
‘ఏపీ డెవలప్‌మెంట్ డైలాగ్ విత్ సీఎం’లో పాల్గొన్న ముఖ్యమంత్రి
ఏరియల్ వ్యూ ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల పరిశీలన
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి వైజాగ్ గ్రోత్ ఇంజన్ లాంటిదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఆర్థికంగా సమగ్రాభివృద్ధి చెందాలంటే విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు చెప్పారు. అయితే తాను ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించామని స్పష్టం చేశారు.
ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలున్న విశాఖ నగరంపై కొద్దిగా శ్రద్ధ పెడితే పదేళ్లల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలతో పోటీపడుతుందన్నారు. ‘విజన్ విశాఖ’సదస్సులో భాగంగా మంగళవారం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2 వేల మందికిపైగా పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ‘ఏపీ డెవలప్‌మెంట్ డైలాగ్ విత్ సీఎం’అంశంపై ప్రసంగించి విజన్ విశాఖ డాక్యుమెంటరీని తిలకించారు. రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధి ప్రణాళికతో కూడిన ‘విజన్ విశాఖ’పుస్తకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన రాజధాని విశాఖలో ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, అంతర్జాతీయ స్టేడియంతో పాటు ఐకానిక్ సెక్రటేరియట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఐకానిక్ సెక్రటేరియట్ భవన నమూనాను కూడా సీఎం జగన్ ఆయన ఆవిష్కరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఆర్థికాభివృద్ధిలో నగరాభివృద్ధి కీలకం
రాష్ట్రానికి విశాఖ ఎందుకు అవసరం? నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలి? అనే అంశాలపై మనం చర్చించాల్సిన అవసరం ఉంది. విభజన తర్వాత ఏపీ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. దేశవ్యాప్తంగా జీఎస్‌డీపీలో వ్యవసాయం వాటా సగటున 17–18 శాతం ఉంటే మన రాష్ట్రంలో 35 శాతం ఉంది. ద్వితీయ, తృతీయ రంగాలైన తయారీ, సేవా రంగాలు వృద్ధి చెందకుంటే రాష్ట్రం ఆర్థికంగా నిలబడలేదు. అవి శరవేగంగా వృద్ధి చెందితేనే మన ముందున్న సవాళ్లను అధిగమించి ఆశించిన మేరకు ఆర్థికాభివృద్ధిని సాధించగలం. విభజనతో హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వల్ల రాష్ట్రం మీద పెను ప్రభావం పడింది.
ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా పురోగమించాలంటే ఒక చోదకశక్తి అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ఆర్థిక చోదక శక్తి అయిన హైదరాబాద్‌ను మనం కోల్పోయాం. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఐడీపీఎల్, ఎన్‌ఎండీసీ, ఎన్‌ఎఫ్‌సీ, ఐఐసీటీ లాంటివన్నీ అక్కడే ఉండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సంస్థలు వస్తే అభివృద్ధి పరంగా వెంటనే మంచి మార్పు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మంచి జీతాలు లభిస్తున్న ఉద్యోగులు ఉంటారు. మంచి సంస్థలు రావడం, మంచి ఆర్థిక ప్రగతి నమోదు ఒక సైకిల్ లాగా జరుగుతుంది. తద్వారా ఆ నగరం బాగా విస్తరిస్తుంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన ప్రభుత్వరంగ సంస్థల్లో 90 శాతం హైదరాబాద్‌లోనే స్థాపించడంతో అది వేగంగా అభివృద్ధి చెందింది. దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అలా జరగలేదు.
విశాఖతో సేవా రంగం వాటా పెరుగుతుంది..
ఆర్థిక రంగాన్ని ముందుకు నడిపేది సేవారంగమే. జాతీయ స్థాయిలో చూస్తే జీఎస్‌డీపీలో సేవారంగం వాటా 55 శాతంగా ఉంది. తెలంగాణలో సేవా రంగం వాటా దాదాపు 62.87 శాతం. ఇందులో మెజార్టీ హైదరాబాద్ నుంచే వస్తోంది. మన రాష్ట్రంలో సేవారంగం వాటా 40 శాతం మాత్రమే ఉంది. తయారీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే సమాన స్థాయి లో ఉన్నప్పటికీ సేవా రంగం విషయంలో మనం గణనీయ ప్రగతి సాధించాల్సిన అవసరం ఉంది. అది పెరిగినప్పుడే మన ఎకానమీ పెరుగుతుంది. 2022–23లో ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518 కాగా తెలంగాణలో రూ. 3,12,398 గా ఉంది. తెలంగాణ తలసరి ఆదాయంలో అత్యధిక భాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఏపీలో సేవా రంగం వాటా పెరగాలంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవాలి. మహానగ రాలతో పోటీపడే సత్తా ఉన్న నగరం విశాఖ మాత్రమే.
మన బలం.. మన తీరమే
దేశంలోనే రెండో అతిపెద్ద సముద్రతీర ప్రాంతం మనకు ఉంది. 974 కి.మీ పొడవైన తీరం వల్ల పోర్టు ఆధారిత అభివృద్ధికి అవకాశం ఉంది. తద్వారా తయారీ రంగానికి మంచి అవకాశాలుంటాయి. పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా తయారీ రంగానికి సహకారాన్ని అందిస్తూ తీరం వెంట పారిశ్రామిక వాడలు, విశాఖను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. 2019కు ముందు ఏపీలో కేవలం 4 చోట్ల నుంచే ఎగుమతులు జరగ్గా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.16 వేల కోట్లతో మరో 4 పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే రూ.4 వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేశాం. రామాయపట్నం పోరు్టకు వచ్చే నెలలోనే షిప్పులు వచ్చే పరిస్థితి ఉంది. కాకినాడలోని ప్రైవేట్ పోర్టుతోపాటు మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తీరం వెంట ప్రతి 50 కి.మీ లకు పోర్టు లేదా ఒక ఫిషింగ్ హార్బర్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లనూ ఏర్పాటు చేస్తున్నాం.
భారీ పారిశ్రామిక పార్కులు..
పారిశ్రామిక నోడ్స్‌లో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తిలో ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌ను నెలకొల్పాం. అచ్యుతాపురం, ఓర్వకల్లు, కృష్ణపట్నంలలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రమంతటా సమతుల్య అభివృద్ధి ఉండేలా చూస్తున్నాం. ప్రభుత్వ చర్యలు, వ్యాపార అనుకూల వాతావరణం వల్ల మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. విశాఖ జీఐఎస్‌లో రూ.13 లక్షల కోట్లకుపైగా విలువైన 352 ఒప్పందాలు కుదిరాయి. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
స్వయం ఉపాధికి ప్రోత్సాహం... కొత్తగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
కేవలం భారీ పరిశ్రమల ద్వారా మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ స్వయం ఉపాధి మార్గాల వైపు నడిపిస్తోంది. లంచాలకు తావులేకుండా, దళారీలు లేకుండా డీబీటీ పద్ధతిలో ప్రయోజనాన్ని అందిస్తున్నాం. ఉదాహరణకు చేయూత పథకాన్నే తీసుకుంటే క్రమం తప్పకుండా ఒక్కో మహిళకు రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు స్థిరంగా ఇచ్చాం. లబ్ధిదారులైన ఆ మహిళలను బ్యాంకులతో అనుసంధానం చేశాం. అమూల్, ఐటీసీ, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇలాగే అమలు చేసింది. ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ రంగ వాటా కొద్ది శాతమే. మేం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య 4 లక్షలు కాగా మేం వచ్చాక మరో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అదనంగా కల్పించాం. దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4 లక్షలే కాగా 50 శాతం కొత్త ఉద్యోగాలను మేం వచ్చాక సృష్టించగలిగాం. ఉపాధిలో వ్యవసాయానిది కూడా ప్రముఖ పాత్ర. మన వ్యవసాయ రంగంపై 62 శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. 52 శాతం మంది రైతులకు అర హెక్టారు లోపే భూమి ఉంది. 70 శాతం మందికి హెక్టారు లోపే పొలం ఉంది. ఏపీలో సన్న, చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరు ఆదాయాలు పొందలేకపోతే ఆర్థిక వ్యవస్థ కూప్పకూలిపోతుంది. అందుకే రైతులకు ఆర్బీకే లు, అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా తోడుగా నిలుస్తున్నాం.
ఎంఎస్‌ఎంఈలకు అండగా..
అతి భారీ, భారీ పరిశ్రమల వల్ల 3 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తే ఎంఎస్‌ఎంఈలు 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 1.5 కోట్ల మందికి స్వయం ఉపాధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం వెనుక వీటి పాత్ర కీలకం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధికి సహకారాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో కోటిమందికిపైగా మహిళలు స్వయం సహాయ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మన ప్రభుత్వం రాకముందు స్వయం సహాయక సంఘాల రుణ బకాయిలు, ఎన్పీఏలు 80 శాతం వరకూ ఉంటే ఇప్పుడు 0.3 శాతం మాత్రమే ఉన్నాయి.
సొంతంగా కార్లు, వాహనాలు నడుపుతూ జీవించేవారికి వాహనమిత్ర ద్వారా అండగా నిలుస్తున్నాం. కులవృత్తులు చేసుకుంటున్న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్లు లాంటి వారికి కూడా ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఆర్థికాభివృధ్ధిలో వీరందరిదీ కీలక పాత్ర. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో ప్రోత్సాహకాలను విడుదల చేసి ప్రభుత్వం ఆదుకుంది. అందుకే వృద్ధి గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. 2018–19లో ఆర్థిక వృద్ధిరేటులో రాష్ట్రం చివరిలో ఉండగా గతేడాది మొదటి 5 రాష్ట్రాల్లో నిలవడం దీనికి నిదర్శనం.
ఎందుకీ ఏడుపులు..?
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. విశాఖ విషయంలో మనం ఏం చేయాలి? నగర అభివృద్ధి చరిత్రను ఎలా మార్చాలి? వచ్చే పదేళ్లలోగా మనం మహా నగరాలతో ఎలా పోటీపడాలన్నదానిపై దృష్టి సారించాలి. ఇదే విజన్ విశాఖకు అర్ధం, పరమార్థం కావాలి. ఈ ప్రాంతం, నగరం పట్ల అభిరుచి, అంకిత భావం, చిత్తశుద్ధి లేకపోతే ఈ విజన్¯ సాకారం కాదు. వాస్తవంలోకి రాదు. అన్నిటికంటే ముందు.. ఒక సీఎంగా ఉన్న నేను ఇక్కడకు వచ్చి నివాసం ఉండాలి.
నేను ఈ మాట చెప్పగానే ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు, సొంత ప్రయోజనాలున్న నెగెటివ్ మీడియా ఒక్కసారిగా భోరున విలపిస్తాయన్న సంగతి మీకు తెలిసిందే. వైజాగ్‌కు మారుస్తున్నామంటే చాలు.. భూములు కబ్జా చేయడానికే వస్తున్నారంటూ సిగ్గు లేకుండా కథనాలు వ్యాప్తి చేస్తున్నారు. కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారు. ఇవన్నీ వాళ్లు ఎందుకు చేస్తున్నారంటే?..సీఎం అనే వ్యక్తి ఇక్కడకు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది! ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పురోగతి సాధిస్తుంది! అందుకే సీఎం ఇక్కడకు రాకూడదని అడ్డుపడుతున్నారు. దీనివెనుక వారికి స్వార్థ ప్రయోజనాలున్నాయి. అమరావతి రాజధాని ప్రకటనకు ముందే వేలాది ఎకరాలను బినామీల పేర్లతో కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారు.
విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్లు
రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు ‘వైజాగ్ విజన్’డాక్యుమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
అవి ఏమిటంటే...
► కనెక్టివిటీలో భాగంగా రూ.8,980.82 కోట్లతో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణం, 6 లైన్ల బీచ్ కారిడార్ ప్రాజెక్టు, సబ్బవరం నుంచి షీలానగర్‌కు 6 లైన్ల రహదారి, షీలానగర్ నుంచి పోర్టు వరకు రోడ్డు నిర్మాణం. మరో రూ.1906.15 కోట్లతో నగరంలో వివిధ రోడ్ల నిర్మాణం.
► ప్రైట్ కారిడార్‌లో భాగంగా రూ.196 కోట్లతో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు, శోంఠ్యాం నుంచి సింహాచలం వరకు ఫ్రైట్ కారిడార్.
► రూ. 14,309 కోట్లతో విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు
► రూ. 4,727 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం.
► పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రూ.2,633.47 కోట్లతో కనమాం వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు, మురుగునీరు శుద్ధి ప్లాంటు, కోడూరు వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం వగైరా.
► రూ. 10,823 కోట్ల పారిశ్రామిక పెట్టుబడుల్లో భాగంగా ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు టీవీఎస్ లాజిస్టిక్స్, జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు తదితరాలు.
► రూ. 975 కోట్లతో విశాఖలో 24 గంటలు మంచినీటి సరఫరా పథకం
► రూ. 1,703 కోట్లతో నగరంలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు
► సోషల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్‌లో భాగంగా రూ. 50 కోట్లతో 100 పార్కుల అభివృద్ధి, రూ. 250 కోట్లతో 151 చెరువుల అభివృద్ధి ప్రాజెక్టును రానున్న 5 ఏళ్లలో చేపట్టనున్నారు.
► రూ. 300 కోట్లతో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణం
► నగరంలో రూ.169.3 కోట్లతో ఇండోర్ స్టేడియంల నిర్మాణం
► రూ. 33.33 కోట్లతో అత్యాధునిక శ్మశానవాటికల నిర్మాణం
► రూ.40 కోట్లతో అమ్యూజ్‌మెంట్, ఫన్ జోన్లు ఏర్పాటు.
► రూ. 87.5 కోట్లతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం.
► రూ. 108 కోట్లతో నేచురల్ హిస్టరీ పార్కు, రూ. 220 కోట్లతో కన్వెన్షన్ సెంటర్, రూ. 18 కోట్లతో నేచురల్ కాటేజెస్ నిర్మాణం, రూ. 394.8 కోట్లతో బీచ్ డెక్, సైన్స్ మ్యూజియం నిర్మాణం.
► రూ.178.22 కోట్లతో ఎకో వైజాగ్ పేరుతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు నిర్మాణం, వనాల నిర్మాణం, రూ.16 కోట్లతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం.
► వీటితో పాటు రూ.4,039.20 కోట్లతో జగనన్న కాలనీల నిర్మాణం. రూ.1250 కోట్లతో మాల్స్, గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు
స్వప్రయోజనం ఆశిస్తే కడప అనలేనా?
హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో మనం పోటీపడాలంటే వైజాగ్ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లాంటిది. రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక చోదకశక్తి కావాల్సిందే. నిజంగా నాకేమైనా స్వప్రయోజనం ఉంటే నేను కడప గురించి మాట్లాడేవాడిని. భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది? ఏం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయాలు పెరుగుతాయి? దేనివల్ల ఆర్థికంగా పురోగమిస్తాం? అనే ఆలోచన చేయకపోతే అన్యాయం చేసిన వాళ్లమవుతాం. ఈ కోణంలో మనం వైజాగ్ గురించి ఆలోచించలేకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? అని అంతా ప్రశ్నించుకోవాలి.
నాయకుడి దార్శనికత సరిగా లేకపోతే వైజాగ్ అభివృద్ధి చెందదు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కోసం ఎవరైనా గట్టిగా నిలబడ్డారంటే.. అది నేను మాత్రమే. విశాఖ కోసం ప్రతిపక్షాలతో, ఎల్లో మీడియాతో పోరాడుతున్నాం. వారిలో ప్రతి ఒక్కరూ విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాకూడదని కోరుకుంటున్నారు. కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నేను విశాఖలోనే నివాసం ఉంటా. నా ప్రమాణ స్వీకారోత్సవం కూడా విశాఖలోనే జరుగుతుంది. వైజాగ్ పట్ల నాకున్న
కృతనిశ్చయం ఇది.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విశాఖలో రూ.1,528.92 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు నిర్వహించారు.
► రూ. 595 కోట్లతో మధురవాడలో పారిశ్రామిక, గృహ అవసరాల కోసం నీటి సరఫరా ప్రాజెక్టు పనులు
► రూ. 553 కోట్లతో మధురవాడలో సమగ్ర మురుగునీటి వ్యవస్థ పనులు, రూ. 99.47 కోట్లతో ముడసర్లోవ ప్రాంతంలో జీవీఎంసీ కొత్త సమీకృత కార్యాలయ నిర్మాణం.
► రూ. 231.04 కోట్లతో అమృత్ పథకం కింద వివిధ జోన్లలో సమగ్ర నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు పనులు.
► రూ. 15.65 కోట్లతో సాగర్‌నగర్ తాబేలు బీచ్ నిర్మాణ పనులు.
► రూ. 34.76 కోట్లతో ఎన్‌హెచ్–16కి సమాంతరంగా గిరి ప్రదక్షిణ రహదారి విస్తరణ పనులు.
పదేళ్ల విజన్‌తో విశాఖ
విశాఖ అభివృద్ధి కోసం పదేళ్ల విజన్‌తో వాస్తవిక దృక్పథంతో ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం,పీపీపీ పద్ధతుల్లో అందరూ ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు పోటీగా విశాఖను తీర్చిదిద్దేలా ఈ విజన్ ఉంటుంది. రాజధానిగా అమరావతి ఆలోచనను నేను ఎందుకు వ్యతిరేకించాలి? అలాంటి వ్యతిరేకత కూడా నాకేమీ లేదు. శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించిందీ, నిర్ణయించిందీ నేనే. కర్నూలును కూడా న్యాయ రాజధానిగా ప్రకటించిందీ నేనే. నాకేమీ ఎలాంటి వ్యతిరేకతా లేదు.
ముందుగానే రూ.లక్ష కోట్లు ఖర్చు
అమరావతి అనేది 50 వేల ఎకరాల ఖాళీ భూమి. రోడ్లు, నీళ్లు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాలు కల్పించడానికే వాళ్లు ఇచ్చిన డీపీఆర్ ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది. అమరావతి ప్రాంతంలో భవనాలు రావాలంటే ముందు కనీసం రూ.లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం ఒక లక్ష కోట్లు అనుకుంటే 20 ఏళ్లలో ఏటా రూ.5 వేల కోట్లు చొప్పున వేసుకుంటే సుమారుగా రూ.10 లక్షల కోట్లో, ఖర్చులు పెరిగి రూ.15 లక్షల కోట్లో అయినా అవుతుంది. అందుకనే అక్కడ అది చేయలేమని అంటున్నాం. అమరావతి ఆలోచనకు నేను వ్యతిరేకం కాదు. వైజాగ్‌లో ఇప్పటికే కనీస మౌలిక సదుపాయాలున్నాయి.
మంచి రోడ్లు, కరెంటు, తాగునీటి సదుపాయం.. ఇలా అన్నీ ఉన్నాయి. కొన్ని మెరుగులు దిద్దితే సరిపోతుంది. వీటితో సిటీ రూపురేఖలు గణనీయంగా మారుతాయి. కార్యనిర్వాహక రాజధానిగా ఇక్కడకు మారే సమయంలో ఉద్యోగులు పనిచేసుకునేందుకు ఐకానిక్ సెక్రటేరియట్ ఉండాలి. అది దేశం దృష్టిని ఆకర్షించాలి. దేశం అంతా ఇటు చూసేలా ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, అహ్మదాబాద్ తరహాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉండాలి. వాటి రాకతో వైజాగ్ స్ధాయి పెరుగుతుంది. దేశమే కాకుండా ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంశాలను బోధించేలా ఎమర్జింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ కూడా రావాలి. రానున్న 15–18 నెలల్లో పూర్తి చేసేలా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టును అనుసంధానించేలా 6 లేన్లతో అందమైన బీచ్ కారిడార్ రోడ్డు ప్రాజెక్టు కూడా రావాల్సి ఉంది. మెట్రో రైలు ప్రాజెక్ట్, ఏడాదిలోగా ప్రారంభమయ్యే మూలపేట పోర్టుతో హారిజాంటల్ గ్రోత్ కారిడార్ ఏర్పడుతుంది. డేటా సెంటర్‌తో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఆతిథ్య రంగంలో ఒబెరాయ్, మై ఫెయిర్ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. నగరానికి అత్యుత్తమ ఫైవ్ స్టార్ సదుపాయాలు సమకూరుతాయి.
ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ రూపంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ప్రధాని తాజాగా దీనికి వర్చువల్‌గా శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ సాధ్యం కానివేమీ కాదు. ఇవన్నీ వాస్తవ రూపంలోకి వచ్చేవే. వచ్చే పదేళ్లలో ఇవన్నీ రాబోతున్నాయి. హైస్పీడ్ రైలు కారిడార్లపై కూడా ప్రధానితో మాట్లాడుతున్నాం. హైదరాబాద్ – వైజాగ్, విజయవాడ– బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లకోసం సంప్రదిస్తున్నాం. ఇవన్నీ రావడమే కాకుండా సీఎం కూడా ఇక్కడకు వస్తే పదేళ్లలో వైజాగ్ ప్రపంచంలో అత్యుత్తమ నగరాలతో పోటీపడుతుంది. ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలున్నా విశాఖ నగర వాసులకు నేను ఒకటే చెబుతున్నా.. మనం తప్పకుండా విజయం సాధిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment