విజయనగరం జిల్లా శృంగవరపుకోట వద్ద ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయనున్న ప్రదేశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పారిశ్రామికంగా వెనుకబడిన విజయనగరం జిల్లాకే కాదు ఉత్తరాంధ్ర ప్రగతికే ఊతమిచ్చేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా వృథాగా ఉన్న జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్) సంస్థ భూముల సద్వినియోగం చేయాలని సంకల్పించింది. 1,166 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా సుమారు రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు ఈ జిల్లాకు రానున్నాయి. తద్వారా 45 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాదు.. పరోక్షంగా వివిధ అనుబంధ వ్యాపార, సేవా రంగాల ద్వారా మరింత మందికి ఉపాధి చేకూరుతుంది. ఈ పార్కు జిల్లా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో కీలకమవుతుందనడంలో సందేహం లేదు.
తొలుత అల్యూమినియం శుద్ధి కర్మాగారం
మహానేత వైఎస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంతో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తూనే మరోవైపు పారిశ్రామికంగానూ విజయనగరం జిల్లాకు ఊతమివ్వాలని తలపోశారు. అదే సమయంలో విశాఖ–విజయనగరం జిల్లాల సరిహద్దు (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా)లో విరివిగా ఉన్న బాక్సైట్ నిక్షేపాల సద్వినియోగంతో అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుచేయడానికి జిందాల్ గ్రూప్ యాజమాన్యం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో 2005లో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 14 లక్షల టన్నుల అల్యూమినియం ఉత్పత్తి లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సంస్థను 2005 జూలై 8న ఏర్పాటుచేసింది.
అప్పట్లోనే భూసేకరణ పూర్తి
అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకోసం జిందాల్ సంస్థ శృంగవరపుకోట మండలంలో కొనుగోలు చేసిన 180 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 985 ఎకరాలను కేటాయించింది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి కాగా ఎక్కువ భాగం అసైన్డ్ భూములు. వాటిపై ఆధారపడిన రైతులకు చట్టప్రకారం పరిహారాన్ని జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (జేఎస్‌డబ్ల్యూఏఎల్) యాజమాన్యం చెల్లించింది. 2007–08 నాటికల్లా భూసేకరణ పూర్తయింది. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పురోగతి ఆగిపోయింది. తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ ఆ ప్రాజెక్టుపై దృష్టిపెట్టలేదు.
గిరిజనుల సంక్షేమం కోసం..
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ గిరిజనులు చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019లో కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సైట్ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. నాడు సేకరించిన విలువైన భూమిని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో జిందాల్ యాజమాన్యం ఇటీవల ఎంఎస్‌ఎంఈ పార్కు లేదా లాజిస్టిక్స్ పార్కు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.
ఏయే పరిశ్రమలకు అవకాశమంటే..
టెక్స్‌టైల్స్, అపెరల్స్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఇథనాల్ మాన్యుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, కాయిర్ ఇండస్ట్రీ, లిథియం–ఆయాన్ బ్యాటరీ రీసైక్లింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, టాయ్ ఇండస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు.
వ్యూహాత్మక ప్రాంతంలో పార్క్
► ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ప్రతిపాదించిన ప్రదేశం వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది.
► రాజమహేంద్రవరం–విజయనగరం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది.
► విశాఖపట్నం–అరకు రోడ్డుతో శరవేగంగా నిర్మాణమవుతున్న విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే ఉంది.
► విశాఖపట్నం పోర్టుకు, భోగాపురంలో నిర్మాణమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉంది.
► చెన్నై–హౌరా రైల్వేలైన్, విశాఖ–కిరండూల్ (కేకే) రైల్వేలైన్‌లకు సమీపంలో ఉంది.
► తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇది సమీపంలో ఉంది.
.. ఇలా అన్నివిధాలా కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతంలో రూ.531 కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతిపాదించింది. తద్వారా రూ.15వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 45 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment