JSW
-
ఎంజీ తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. ‘సైబర్‌స్టర్’ వస్తోంది
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఆల్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కన్వర్టబుల్ సైబర్‌స్టర్ మోడల్‌ను 2025 జనవరి–మార్చి మధ్య భారత్‌లో ప్రవేశపెడుతోంది. ధర రూ.65–70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.ఎంజీ సెలెక్ట్ ఔట్లెట్లలో విక్రయానికి రానున్న తొలి మోడల్ ఇదేనని కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు. వచ్చే రెండేళ్లలో నాలుగు ఎలక్ట్రిక్ మోడళ్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. సైబర్స్టర్తోపాటు మరో మోడల్ సైతం మార్చిలోగా అడుగుపెట్టనుందని గుప్తా వెల్లడించారు.భారత్‌లో లగ్జరీ కార్ల విభాగం గత నాలుగేళ్లలో మాస్ సెగ్మెంట్ కార్ల కంటే రెండింతలై దాదాపు 25 శాతం వృద్ధి చెందిందని చెప్పారు. కంపెనీ పట్ల సానుకూల ప్రభావంతోపాటు సైబర్‌స్టర్ మొత్తం ఈవీలు, బ్రాండ్‌కు మరింత ఆకర్షణను జోడిస్తుందని అన్నారు. ఇది బ్రాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇవ్వడంతోపాటు అదనపు గుర్తింపును ఇస్తుందని వివరించారు. -
ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన ఎంజీ మోటార్: ధర & వివరాలు
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ లైనప్‌ను విస్తరించడంతో భాగంగా.. ఒకేసారి రెండు కొత్త 7 సీటర్ వేరియంట్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి హెక్టర్ ప్లస్ 7 సీటర్ 'సెలెక్ట్ ప్రో' కాగా, మరొకటి 'స్మార్ట్ ప్రో'. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.19.71 లక్షలు, రూ.20.64 లక్షలు.హెక్టర్ ప్లస్ 7 సీటర్ సెలెక్ట్ ప్రో వేరియంట్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్లు వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఐ-స్మార్ట్ టెక్నాలజీతో కూడిన 14 ఇంచెస్ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారులో సుమారు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ బ్లేడ్-స్టైల్ కనెక్టెడ్ టెయిల్ లాంప్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందిన కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ లెథెరెట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..లేటెస్ట్ డిజైన్ కలిగిన ఎంజీ హెక్టర్ ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ వంటి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్లకు ఎంజీ షీల్డ్ ప్రోగ్రామ్ కింద.. 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది. -
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో పోస్కో జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కో తాజాగా దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జట్టు కట్టింది. భారత్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) గల సమగ్ర ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.పెట్టుబడులు, ప్లాంటు నెలకొల్పే ప్రాంతంపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ 1 ఎంటీపీఏ ప్రాజెక్టుకు సగటున సుమారు రూ. 8,000 కోట్ల చొప్పున 5 ఎంటీపీఏ ప్రాజెక్టుకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘భారత్‌లో ఉక్కు, బ్యాటరీ మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించి పోస్కో గ్రూప్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాం’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ముంబైలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ జిందాల్, పోస్కో చైర్మన్ చాంగ్ ఇన్–హువా తదితరులు పాల్గొన్నారు. ‘భారత్‌లో తయారీ రంగ ముఖచిత్రాన్ని మార్చే విధంగా టెక్నాలజీ, పర్యావరణహితమైన విధానాల విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాం’ అని జిందాల్ తెలిపారు. ‘కొరియా, భారత్ ఆర్థిక వృద్ధికి ఈ భాగస్వామ్యం గణనీయంగా ఉపయోగపడుతుంది’ అని చాంగ్ ఇన్–హువా పేర్కొన్నారు.ఎంట్రీ కోసం పోస్కో ప్రయత్నాలుభారత మార్కెట్లో ప్రవేశించేందుకు పోస్కో సంస్థ చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. గతంలో ఒరిస్సాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 12 ఎంటీపీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రణాళికలను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్)తో కూడా జట్టు కట్టే ప్రయత్నం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేసేందుకు ఇరు సంస్థల అధికార్లతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. -
శృంగవరపుకోటలో ఎంఎస్ఎంఈ పార్కు..ఉత్తరాంధ్రకు ఊతం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పారిశ్రామికంగా వెనుకబడిన విజయనగరం జిల్లాకే కాదు ఉత్తరాంధ్ర ప్రగతికే ఊతమిచ్చేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా వృథాగా ఉన్న జిందాల్ (జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్) సంస్థ భూముల సద్వినియోగం చేయాలని సంకల్పించింది. 1,166 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా సుమారు రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు ఈ జిల్లాకు రానున్నాయి. తద్వారా 45 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాదు.. పరోక్షంగా వివిధ అనుబంధ వ్యాపార, సేవా రంగాల ద్వారా మరింత మందికి ఉపాధి చేకూరుతుంది. ఈ పార్కు జిల్లా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో కీలకమవుతుందనడంలో సందేహం లేదు. తొలుత అల్యూమినియం శుద్ధి కర్మాగారం మహానేత వైఎస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంతో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ఇతోధికంగా కృషిచేస్తూనే మరోవైపు పారిశ్రామికంగానూ విజయనగరం జిల్లాకు ఊతమివ్వాలని తలపోశారు. అదే సమయంలో విశాఖ–విజయనగరం జిల్లాల సరిహద్దు (ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా)లో విరివిగా ఉన్న బాక్సైట్ నిక్షేపాల సద్వినియోగంతో అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుచేయడానికి జిందాల్ గ్రూప్ యాజమాన్యం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో 2005లో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 14 లక్షల టన్నుల అల్యూమినియం ఉత్పత్తి లక్ష్యంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సంస్థను 2005 జూలై 8న ఏర్పాటుచేసింది. అప్పట్లోనే భూసేకరణ పూర్తి అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకోసం జిందాల్ సంస్థ శృంగవరపుకోట మండలంలో కొనుగోలు చేసిన 180 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 985 ఎకరాలను కేటాయించింది. ఇందులో కొంత ప్రభుత్వ భూమి కాగా ఎక్కువ భాగం అసైన్డ్ భూములు. వాటిపై ఆధారపడిన రైతులకు చట్టప్రకారం పరిహారాన్ని జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ (జేఎస్డబ్ల్యూఏఎల్) యాజమాన్యం చెల్లించింది. 2007–08 నాటికల్లా భూసేకరణ పూర్తయింది. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పురోగతి ఆగిపోయింది. తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలూ ఆ ప్రాజెక్టుపై దృష్టిపెట్టలేదు. గిరిజనుల సంక్షేమం కోసం.. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు వద్దంటూ గిరిజనులు చేస్తున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో కీలక నిర్ణయం తీసుకుంది. బాక్సైట్ తవ్వకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జేఎస్‌డబ్ల్యూ అల్యూమియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. నాడు సేకరించిన విలువైన భూమిని సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో జిందాల్ యాజమాన్యం ఇటీవల ఎంఎస్ఎంఈ పార్కు లేదా లాజిస్టిక్స్ పార్కు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఏయే పరిశ్రమలకు అవకాశమంటే.. టెక్స్టైల్స్, అపెరల్స్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఇథనాల్ మాన్యుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్, కాయిర్ ఇండస్ట్రీ, లిథియం–ఆయాన్ బ్యాటరీ రీసైక్లింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్, టాయ్ ఇండస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు. వ్యూహాత్మక ప్రాంతంలో పార్క్ ► ఎంఎస్ఎంఈ పార్క్‌కు ప్రతిపాదించిన ప్రదేశం వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ► రాజమహేంద్రవరం–విజయనగరం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ► విశాఖపట్నం–అరకు రోడ్డుతో శరవేగంగా నిర్మాణమవుతున్న విశాఖపట్నం–రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే ఉంది. ► విశాఖపట్నం పోర్టుకు, భోగాపురంలో నిర్మాణమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉంది. ► చెన్నై–హౌరా రైల్వేలైన్, విశాఖ–కిరండూల్ (కేకే) రైల్వేలైన్లకు సమీపంలో ఉంది. ► తాటిపూడి రిజర్వాయర్‌కు కూడా ఇది సమీపంలో ఉంది. .. ఇలా అన్నివిధాలా కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతంలో రూ.531 కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక వసతులతో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతిపాదించింది. తద్వారా రూ.15వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 45 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
జేఎస్‌డబ్ల్యూతో ఎస్ఏఐసీ జత
న్యూఢిల్లీ: చైనా ఆటో రంగ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్.. దేశీ మెటల్ రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ దేశీయంగా ఎంజీ మోటార్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తోపాటు.. వృద్ధికి సహకరించనుంది. లండన్‌లో జరిగిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం జేవీలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 35 శాతం వాటాను పొందనున్నట్లు తెలుస్తోంది. దేశీ వినియోగదారునిపై దృష్టితో నవతరం టెక్నాలజీ, ప్రొడక్టుల ద్వారా మొబిలిటీ సొల్యూషన్స్ అందించేందుకు జేవీకి ఎస్ఏఐసీ మద్దతివ్వనుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీలో జేఎస్‌డబ్ల్యూ 35 శాతం వాటా తీసుకోనుందా లేక ఎస్ఏఐసీ మోటార్ సొంత అనుబంధ సంస్థ ఎంజీ మోటార్ ఇండియాలో పొందనుందా అనే విషయంపై రెండు కంపెనీల నుంచీ స్పష్టతలేకపోవడం గమనార్హం. ఒకప్పటి బ్రిటిష్ బ్రాండ్ ఎంజీ మోటార్‌ను ప్రస్తుతం షాంఘై దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ సొంతం చేసుకుంది. కాగా.. రానున్న ఐదేళ్ల కాలపు ప్రణాళికలో భాగంగా దేశీ కంపెనీలకు 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. తదుపరి దశ వృద్ధికి వీలుగా ఎంజీ మోటార్ నిధుల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
ఐపీవోల జోరు
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్నాయి. నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టవుతున్నాయి. పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో ఇష్యూలు విజయవంతంకావడంతోపాటు.. పలు కంపెనీలు లాభాలతో లిస్టవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాంటార్ స్పేస్ ఐపీవో బుధవారం ప్రారంభంకానుండగా.. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ఇష్యూ ముగియనుంది. మరోవైపు మరో రెండు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. ఎన్ఎస్ఈ ఎమర్జ్‌లో.. కోవర్కింగ్ కార్యాలయ సంస్థ కాంటార్ స్పేస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 93 ధరను ప్రకటించింది. బుధవారం(27న) ప్రారంభంకానున్న ఇష్యూ అక్టోబర్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 16.8 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 15.62 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్‌కానుంది. ఇష్యూ నిధులను కొత్త వర్కింగ్ కేంద్రాల అద్దె డిపాజిట్ల చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 2018లో ఏర్పాటైన కంపెనీ 46,000 చదరపు అడుగులకుపైగా వర్కింగ్ స్పేస్‌లను నిర్వహిస్తోంది. థానే, పుణే, బీకేసీలలో 1,200 సీట్లను కలిగి ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మౌలిక సదుపాయాల రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోకు రెండో రోజు మంగళవారానికల్లా 2.13 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కంపెనీ 13,62,83,186 షేర్లను ఆఫర్ చేయగా.. 29,02,18,698 షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 3.7 రెట్లు, రిటైలర్లు 4.5 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 55 శాతమే బిడ్స్ లభించాయి. షేరుకి రూ. 113–119 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల విక్రయం ద్వారా రూ. 1,260 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ఇష్యూ నిధుల్లో ప్రధానంగా రూ. 800 కోట్లు రుణ చెల్లింపులు, ఎల్పీజీ టెర్మినల్ ప్రాజెక్టు పెట్టుబడులకు రూ. 866 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రెండు కంపెనీలు రెడీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు రెండు కంపెనీలను అనుమతించింది. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లాజిస్టిక్స్ సంస్థ వెస్టర్న్ క్యారియర్స్(ఇండియా) లిమిటెడ్ నిధుల సమీకరణకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో కోసం ఈ ఏడాది మే, జూన్లలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఫిన్‌కేర్ ఎస్ఎఫ్బీ ఐపీవోలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.7 కోట్ల షేర్లను ప్రమోటర్‌సహా ఇతర ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 పెట్టుబడులకు కేటాయించనుంది. ఇక వెస్టర్న్ క్యారియర్స్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని ఇష్యూలో భాగంగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 93.29 లక్షల షేర్లను ప్రమోటర్ రాజేంద్ర సేథియా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వాప్కోస్ వెనకడుగు కన్సల్టెన్సీ, ఈపీసీ, కన్స్ట్రక్షన్ సర్వి సుల పీఎస్‌యూ.. వ్యాప్కోస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూని విరమించుకుంది. ప్రభుత్వం వాటా విక్రయించే యోచనలో ఉన్న కంపెనీ ఐపీవో చేపట్టేందుకు గతేడాది సెప్టెంబర్ 26న సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఈ నెల 21న ఇష్యూని విరమించుకున్నట్లు సెబీకి నివేదించింది. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. ఇష్యూలో భాగంగా తొలుత ప్రమోటర్ అయిన ప్రభుత్వం 3,25,00,000 షేర్లను విక్రయించాలని భావించింది. జల్ శక్తి నియంత్రణలోకి కంపెనీ 2021–22లో రూ. 2,798 కోట్ల ఆదాయం సాధించింది. రూ. 69 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉంది
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పేదల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించడం ఆనందంగా ఉంది’ అని జేఎస్‌డబ్ల్యూ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ సజ్జన్ జిందాల్ శనివారం ట్వీట్ చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ సజ్జన్ జిందాల్ ఈ ట్వీట్ చేశారు. ‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. రాష్ట్రంలోని పేద ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై సీఎంతో చర్చించటం జరిగింది.’ అని ఆయన పేర్కొన్నారు. Its always a pleasure to meet @ysjagan Hon’ble CM of Andhra Pradesh. Discussed about the pathbreaking programs for the upliftment of the poor people of the state. pic.twitter.com/Bz2cx34sEU — Sajjan Jindal (@sajjanjindal) August 19, 2023 -
రూ. 2,800 కోట్ల సమీకరణకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా ప్రణాళికలు
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఎంజీ మోటార్లో జేఎస్డబ్ల్యూకి వాటా!
న్యూఢిల్లీ: ఆటోరంగ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో వాటా కొనుగోలుకి డైవర్సిఫైడ్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీవైడీ ఇండియాలోనూ వాటాను సొంతం చేసుకునేందుకు స్టీల్ నుంచి స్పోర్ట్ వరకూ విభిన్న బిజినెస్‌లు కలిగిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఉత్సాహంగా చర్చిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎఫ్‌వో శేషగిరి రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. వెరసి ఫోర్ వీలర్స్ తయారీపై గ్రూప్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. తద్వారా మరిన్ని రంగాలలోకి గ్రూప్ విస్తరించనున్నట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం అటు ఎంజీ మోటార్ ఇండియా, ఇటు బీవైడీ ఇండియాలతో వాటా కొనుగోలు నిమిత్తం ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై స్పందించడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! మరోపక్క కంపెనీ విధానాల ప్రకారం ఇలాంటి అంచనాలపై స్పందించలేమంటూ ఎంజీ మోటార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. -
సజ్జన్ జిందాల్‌కు ఈవై ఎంటర్ప్రెన్యుర్ అవార్డ్
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్ 2022గా ఎంపికయ్యారు. డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ కేవీ కామత్ అధ్యక్షతన గల ఏడుగురు సభ్యుల జ్యురీ విజేతల వివరాలను ప్రకటించింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ స్టీల్, సిమెంట్, ఇన్ఫ్రా, ఎనర్జీ, పెయింట్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 40వేల మందకి పైగా ఉపాధి కల్పిస్తుండడంతో ఈ సంస్థ అధినేత సజ్జన్ జిందాల్‌ను ఈవై ఎంట్రప్రెన్యుర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి కూడా హాజరయ్యారు. మరో తొమ్మిది ఇతర విభాగాల్లోనూ విజేతలను జ్యురీ ఎంపిక చేసింది. స్టార్టప్ విభాగంలో మెడ్‌జీనోమ్ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో మహేశ్ ప్రతాప్నేని, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వీ వైద్యనాథన్, ఎనర్జీ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా విభాగంలో ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్, ఎండీ ఇర్ఫాన్ రజాక్, తయారీ విభాగంలో బోరోసిల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మ్ ప్రదీప్ ఖెరుకాను జ్యురీ ఎంపిక చేసింది. -
కశ్మీర్లో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ప్లాంటు
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తాజాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లస్సీపురాలో కలర్ కోటెడ్ ఉక్కు తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.150 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.2 లక్షల టన్నులుగా ఉండనుంది. గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ వెల్లడించింది. జమ్మూ, కశ్మీర్‌లోని స్థానిక మార్కెట్లో విక్రయాల కోసం స్టీల్ శాండ్విచ్ ప్యానెల్స్, స్టీల్ డోర్స్ తయారు చేయనున్నట్లు తెలిపింది. స్థల కేటాయింపు పత్రాలను హోం మంత్రి అమిత్ షా సోమవారం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌కు అందిం చారు. స్థానిక వ్యాపారాలు, సమాజానికి ఈ ప్లాంటు ప్రయోజనం చేకూర్చగలదని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించగలదని జిందాల్ తెలిపారు. -
టోక్యోలో ‘ఇండియా హౌజ్’
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లబోయే భారత బృందం కోసం అక్కడ ‘ఇండియా హౌజ్’ను నిరమంచేందుకు జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) గ్రూప్ సిద్ధమైంది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో ఈ దిగ్గజ స్టీల్ కంపెనీ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒలింపిక్స్ ఆతిథ్య నగరాల్లో అభివృద్ది చెందిన దేశాలు ఇలాంటి హౌజ్‌లను నిరమించుకోవడం సహజం. కానీ భారత్ మాత్రం ఇలాంటి అధునాతన సౌకర్యాలతో హౌజ్‌ను నిర్మించుకోవడం ఇదే మొదటిసారి. క్రీడాగ్రామానికి సమీపంలో 2200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తొలిసారి భారత్ అక్కడ ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌజ్‌ను నియమించనుంది దీనికి సంబంధించిన ‘లోగో’ను జేఎస్‌డబ్ల్యూ గురువారం విడుదల చేసింది. ఈ హౌజ్‌లో భారత క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి. అలాగే అధికార వర్గాలకు సమాచార వేదిక, భారత్ నుంచి వెళ్లే ప్రేక్షకులు, మీడియా సిబ్బంది కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ అక్కడ ఉంటాయి. అలాగే భారతీయ వంటకాలన్నీ అందుబాటులో ఉంచుతారు. దీని వల్ల ఇంటి భోజనానికి దూరమైన భావనే కలగదని ఐఓఏ వర్గాలు తెలిపాయి. ఈ హాస్పిటాలిటీ హౌజ్ స్థూలంగా భారత వర్గాలందరికీ సమాచార, సమన్వయ వేదికగా ఉపయోగపడుతుందని ఐఓఏ వర్గాలు తెలిపాయి. -
హరియాణా స్టీలర్స్‌గా జిందాల్ జట్టు
ముంబై: ప్రముఖ కార్పొరేట్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ కొనుగోలు చేసిన జట్టు ‘హరియాణా స్టీలర్స్’గా ప్రొ కబడ్డీ లీగ్‌లో బరిలోకి దిగనుంది. ఈ సీజన్లో మరో నాలుగు జట్లను చేర్చడంతో సచిన్ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్ ద్వయం తమిళనాడు ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసారి మొత్తం 12 జట్ల మధ్య జూలై నుంచి అక్టోబర్ వరకు లీగ్ సుదీర్ఘంగా జరగనుంది. సోమ, మంగళవారాల్లో ఆటగాళ్ల వేలం జరుగుతుంది. -
జేఎస్‌డబ్ల్యూ విజయనగరం సెజ్ సరెండర్!
- ఇదే వరుసలో మరో 56... - ఆర్థిక మందగమనం, పన్ను సమస్యలు ప్రధాన కారణం... న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, ఎస్ కోట వద్ద తమ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఎస్ఈజెడ్- సెజ్)ను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి డెవలపర్ జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ సిద్ధమయ్యింది. దాదాపు 240 హెక్టార్లలో ప్రతిపాదించిన ఈ సెజ్ అల్యూమినియం రంగానికి ఉద్దేశించారు. ఈ సెజ్ డెవలప్మెంట్కు సంబంధించిన అనుమతుల గడువు నిజానికి 2012 ఫిబ్రవరి 26తో ముగిసింది. ముడి ఖనిజం మైనింగ్‌కు పర్యావరణ పరమైన ఆమోదాలు లభించకపోవడం, బాక్సైట్ సరఫరా ఒప్పందాల సంతకాలు పెండింగులో ఉండడం వంటి అంశాల వల్ల ఈ సెజ్ అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో సెజ్‌ను సరెండర్ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. 20న కీలక సమావేశం... జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియంసహా దాదాపు 56 పత్యేక ఆర్థిక జోన్లల పట్ల ఇన్వెస్టర్లు అనాసక్త ధోరణిలో ఉన్నారని సమాచారం. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఆయా సెజ్‌ల డెవలపర్లు తమ సెజ్ ఆమోదిత అప్లికేషన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్శ్వనాథ్, డీఎల్ఎఫ్ వంటి సంస్థలు ఉన్నాయి. వీటికి సంబంధించి న్యూఢిల్లీలో ఫిబ్రవరి 20న జరిగే ఒక అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. నిరుత్సాహానికి కారణం! 50కి పైగా సెజ్ డెవలపర్లు ఇప్పటికే తమ ప్రాజెక్టులను సరెండర్ చేశారు.ఆర్థిక మందగమనంలో ఉండడం వల్ల పలు డెవలపర్లు సెజ్‌ల అభివృద్ధి విషయంలో పలు అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఆయా పరిస్థితుల నేపథ్యంలో మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి అంశాలు సెజ్‌లకు విఘాతంగా మారినట్లు విమర్శలు ఉన్నాయి. దేశంలో ప్రధాన ఎగుమతి కేంద్రాలుగా ఆవిర్భవించిన సెజ్‌లు ఆయా ప్రతికూల అంశాల వల్ల క్రమంగా తమ ఆకర్షణను కోల్పోతున్నాయన్న విమర్శ ఉంది. పెట్టుబడుల పెంపునకు రానున్న బడ్జెట్ సెజ్‌లపై మ్యాట్‌ను ప్రస్తుత 18.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ఇటీవల పరిశ్రమల సంఘం- సీఐఐ కేంద్రానికి తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో విన్నవించింది. 2005-06లో ఈ జోన్ల నుంచి ఎగుమతుల విలువ దాదాపు రూ.22,840 కోట్లు. 2013-14 నాటికి ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువను దాదాపు రూ.20.15 లక్షల కోట్లకు పెంచాలన్నది ప్రణాళిక. ఈ పరిస్థితుల్లో సెజ్‌ల వైపు నుంచి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది.