న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కో తాజాగా దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జట్టు కట్టింది. భారత్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) గల సమగ్ర ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.
పెట్టుబడులు, ప్లాంటు నెలకొల్పే ప్రాంతంపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ 1 ఎంటీపీఏ ప్రాజెక్టుకు సగటున సుమారు రూ. 8,000 కోట్ల చొప్పున 5 ఎంటీపీఏ ప్రాజెక్టుకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘భారత్‌లో ఉక్కు, బ్యాటరీ మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించి పోస్కో గ్రూప్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాం’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబైలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ జిందాల్, పోస్కో చైర్మన్ చాంగ్ ఇన్–హువా తదితరులు పాల్గొన్నారు. ‘భారత్‌లో తయారీ రంగ ముఖచిత్రాన్ని మార్చే విధంగా టెక్నాలజీ, పర్యావరణహితమైన విధానాల విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాం’ అని జిందాల్ తెలిపారు. ‘కొరియా, భారత్ ఆర్థిక వృద్ధికి ఈ భాగస్వామ్యం గణనీయంగా ఉపయోగపడుతుంది’ అని చాంగ్ ఇన్–హువా పేర్కొన్నారు.
ఎంట్రీ కోసం పోస్కో ప్రయత్నాలు
భారత మార్కెట్లో ప్రవేశించేందుకు పోస్కో సంస్థ చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. గతంలో ఒరిస్సాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 12 ఎంటీపీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రణాళికలను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్)తో కూడా జట్టు కట్టే ప్రయత్నం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేసేందుకు ఇరు సంస్థల అధికార్లతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు.
Comments
Please login to add a commentAdd a comment