posco
-
జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో పోస్కో జట్టు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కో తాజాగా దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జట్టు కట్టింది. భారత్‌లో 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం (ఎంటీపీఏ) గల సమగ్ర ఉక్కు ప్లాంటు ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.పెట్టుబడులు, ప్లాంటు నెలకొల్పే ప్రాంతంపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ 1 ఎంటీపీఏ ప్రాజెక్టుకు సగటున సుమారు రూ. 8,000 కోట్ల చొప్పున 5 ఎంటీపీఏ ప్రాజెక్టుకు రూ. 40,000 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘భారత్‌లో ఉక్కు, బ్యాటరీ మెటీరియల్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యానికి సంబంధించి పోస్కో గ్రూప్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాం’ అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ముంబైలో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ జిందాల్, పోస్కో చైర్మన్ చాంగ్ ఇన్–హువా తదితరులు పాల్గొన్నారు. ‘భారత్‌లో తయారీ రంగ ముఖచిత్రాన్ని మార్చే విధంగా టెక్నాలజీ, పర్యావరణహితమైన విధానాల విషయంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాం’ అని జిందాల్ తెలిపారు. ‘కొరియా, భారత్ ఆర్థిక వృద్ధికి ఈ భాగస్వామ్యం గణనీయంగా ఉపయోగపడుతుంది’ అని చాంగ్ ఇన్–హువా పేర్కొన్నారు.ఎంట్రీ కోసం పోస్కో ప్రయత్నాలుభారత మార్కెట్లో ప్రవేశించేందుకు పోస్కో సంస్థ చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. గతంలో ఒరిస్సాలో 12 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 12 ఎంటీపీఏ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. అయితే, స్థల సమీకరణలో తీవ్ర జాప్యం జరగడంతో ప్రణాళికలను విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (వైజాగ్ స్టీల్)తో కూడా జట్టు కట్టే ప్రయత్నం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి సాధ్యాసాధ్యాల రిపోర్టును తయారు చేసేందుకు ఇరు సంస్థల అధికార్లతో ఒక వర్కింగ్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. -
కృష్ణపట్నంలో ‘పోస్కో’ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్!
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి దక్షిణ కొరియాకు చెందిన ఉక్కు దిగ్గజం పోస్కో స్టీల్ ఆసక్తి వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. తదుపరి చర్చల కోసం సియోల్ నుంచి ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరుతూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ పోస్కో ఇండియా సీఎండీ సంగ్ లేకి లేఖ రాశారు. కృష్ణపట్నంలో యూనిట్ నెలకొల్పే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఎంపిక చేయడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు విషయంపై చర్చిద్దామని పేర్కొన్నారు. పోస్కో ఇండియా బృందం గతేడాది డిసెంబర్ 18న కృష్ణపట్నం రావడంతో పాటు ఫిబ్రవరి 10న సంగ్లే స్వయంగా కృష్ణపట్నం వచ్చి పోర్టు అధికారులతో చర్చలు జరపడం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేసిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని తెలియచేస్తోందన్నారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందన్నారు. కృష్ణపట్నం.. రాష్ట్ర అభివృద్ధి కేంద్రం రానున్న కాలంలో చెన్నై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలతో పోటీ పడుతూ పారిశ్రామికాభివృద్ధి జరిగే అవకాశాలు కృష్ణపట్నంలో పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా ఎదగనుందని కరికల్ వలవన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వ్యూహాత్మక ప్రాంతంలో ఉందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన పోర్టు పక్కనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ఎగుమతులు, దిగుమతులకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. దక్షిణాసియాలోనే పూర్తి ఆటోమేటెడ్ పోర్టు కావడంతోపాటు భారీ నౌకలు రావడానికి అనుగుణంగా ఈ పోర్టును నిర్మించారన్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే సాధ్యమైనంత త్వరగా భూమి అప్పగించేలా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ఉక్కు కర్మాగారం యాంకర్ పరిశ్రమగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందన్నారు. పారిశ్రామిక పాలసీ 2020–23 ఇప్పటికే అమల్లో ఉందని, ఇవికాకుండా పెట్టుబడి విలువ, ఉద్యోగ అవకాశాలు, అనుబంధ కంపెనీల వృద్ధి లాంటి ప్రతిపాదనలతో వస్తే అవసరమైన రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
'విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాజేయాలని చూస్తే ఊరుకోం'
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పోస్కోకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఏయూ మాజీ వీసీ డాక్టర్ జీఎస్ఎన్ రాజు 'పోస్కో వరమా- శాపమా' అనే పుస్తకాన్ని ఆదివారం విశాఖలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. 'స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఒక దురుద్దేశ్య పూర్వకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నష్టాలు సాకుగా చూపి దక్షిణ కొరియా సంస్థ పోస్కోకు కట్టబెట్టేందుకు సిద్ధం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ పోస్కో ఒప్పందం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం దారుణం. ఏపీ మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్. ఎందరో త్యాగాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. నవంబర్ 26న భారీ ఎత్తున సమ్మెకు దిగుతున్నాం' అని నరసింగరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, వైఎస్సార్సీపీ నేత మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటాం. ఉద్యోగుల పదవీ విరమణ అంశం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న మ్యాన్ పవర్ సరిపోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. 18 వేల మంది పర్మినెంట్, మరో 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. పరోక్షంగా లక్షలాది మంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. (ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి: శ్రావణి) స్టీల్ ప్లాంట్ ద్వారా ఏడాదికి కేంద్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల రూపాయలు సెంట్రల్ టాక్స్ వస్తున్నాయి. ఏపీకి సేల్స్ టాక్స్ రూపంలో ఆదాయం వస్తోంది. పోస్కో సంస్థను ఒరిస్సా, బెంగాల్లో అడుగుపెట్టనీయలేదు. ఏపీలో విశాఖ తప్పించి మరెక్కడైనా పోస్కో స్టీల్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. విశాఖ స్టీల్‌పై పోస్కో కన్ను పడింది, కాజేయలని చూస్తే... ఊరుకోం. పోస్కో విషయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారు, అది మానుకోవాలి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వము చేస్తున్న కుట్ర. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. (అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా) -
వైజాగ్ స్టీల్‌తో పోస్కో జట్టు!
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్టీల్ దిగ్గజం పోస్కో మరోసారి భారత్ మార్కెట్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలను మమ్మరం చేసింది. ప్రభుత్వరంగంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్/వైజాగ్ స్టీల్)తో జాయింట్ వెంచర్ కోసం సుముఖంగా ఉంది. గత వారం ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంతో పోస్కో అధికారి ఒకరు భేటీ అయి జాయింట్ వెంచర్ ప్రణాళికలపై చర్చించడం కూడా జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వైజాగ్ స్టీల్‌ను సందర్శించినట్టు సమాచారం. విలువ ఆధారిత స్పెషల్ గ్రేడ్ స్టీల్ ఉత్పత్తుల కోసం ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలసి సంయుక్తంగా విశాఖలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్నది పోస్కో ఆలోచన. గతంలో ఒడిశాలోని జగత్సింగ్పూర్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేసింది. ఇందుకోసం ఒడిశా ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. అయితే, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. -
ఈ నేరాలు ఆగుతాయా?
లైంగిక నేరగాళ్ల నుంచి పసి పిల్లలను కాపాడటం కోసం 2012లో వచ్చిన ‘పిల్లలపై లైంగిక నేరాల నిరోధక(పోక్సో) చట్టం’లో మరిన్ని కఠినమైన నిబంధనలు జోడిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. అది లోక్‌సభ పరిశీలనకు రాబోతోంది. ఇటీవల పసి పిల్లలపై లైంగిక నేరాలు, వేధింపులు విపరీతంగా పెరిగాయి. కొన్ని నేరాలైతే ఊహకందనివి. వాటి వివరాలు విన్నప్పుడు ఆ నేరగాళ్లు అసలు మనుషులా, మృగాలా అన్న సందేహం కూడా కలుగు తుంది. నిరుడు జమ్మూలోని కఠువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికపై సాగిన అకృత్యం అటువం టిదే. సంచార తెగకు చెందినవారిని భయభ్రాంతుల్ని చేసి వెళ్లగొట్టే ఉద్దేశంతో ఆ బాలికను అపహ రించి, హింసించడంతోపాటు డ్రగ్స్ ప్రయోగించారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. చివరకు రాళ్లతో కొట్టి చంపారు. మధ్యయుగాల నాటి ఆటవిక సంస్కృతి ఒకపక్క, ఆధునికత తెస్తున్న విశృంఖలత్వం మరోపక్క పెరగడంతో దేశంలో నానాటికీ ఈ మాదిరి నేరాలు పెరుగుతు న్నాయి. 2012లో తీసుకొచ్చిన కఠిన చట్టం కఠువా వంటి ఉదంతాలను నిరోధించలేకపోయింది. లోకమంటే పూర్తిగా తెలియని బాల్యంపై సాగే నేరాలు వారిపై జీవితాంతం ప్రభావం చూపుతాయి. వారు అందరిలా సాధారణ జీవనం కొనసాగించలేని నిస్సహాయతకు లోనై, జీవచ్ఛవాలుగా మారు తారు. కనుక కఠిన శిక్షలకు అవకాశం ఉండే చట్టం అమల్లోకొస్తే ఈ తరహా నేరాలు సమసిపోగల వని అందరూ విశ్వసిస్తారు. అందుకే కావొచ్చు... రాజ్యసభలో ఒకరిద్దరు మినహా అందరూ సవ రణ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లు పసిపిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని ప్రతిపాదించింది. అలాగే వివిధ లైంగిక నేరాలకు ఇప్పుడున్న శిక్షలను మరింతగా పెంచింది. వాటితోపాటు పసిపిల్లలతో నీలిచిత్రాలు తీసేవారికి, వాటిని వ్యాప్తి చేసేవా రికి విధించే జైలుశిక్ష, జరిమానాలను భారీగా పెంచింది. ఈ చట్టం అమల్లోకొస్తే నేరగాళ్లకు 20 ఏళ్ల కఠినశిక్ష మొదలు... మరణించేవరకూ జైల్లో ఉండేలా జీవితఖైదు విధించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అయితే నేరాలు జరిగేది చట్టాలు లేకపోవడం వల్లనో, ఉన్నా అవి అత్యంత కఠినంగా లేక పోవడం వల్లనో కాదు. అసలు ఆ చట్టాలంటేనే భయభక్తులు లేకపోవడం వల్ల. డబ్బు, పలుకుబడి ఉంటే సులభంగా తప్పించుకోగలమన్న భరోసా ఉండటం వల్ల. నేరం జరిగాక సత్వరం నేరగాళ్లను పట్టుకుంటే... వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి సాధ్యమైనంత త్వరగా శిక్షించగలిగితే నేర గాళ్ల వెన్నులో చలిపుడుతుంది. నేరం చేయాలంటే భయపడే స్థితి ఏర్పడుతుంది. దురదృష్ట వశాత్తూ మన దేశంలో ఆ పరిస్థితి లేదు. పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు మంత్రులు చెప్పే స్థాయిలో క్షేత్ర స్థాయి ఆచరణ ఉండటం లేదు. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి నేతృత్వంలోని ఫౌండేషన్ ఇటీవల వెలువరించిన నివేదికే ఇందుకు సాక్ష్యం. ఇంతవరకూ ఢిల్లీలో పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్షలు పడిన ఉదంతాలు కేవలం 9 శాతం మాత్రమేనని ఆ నివేదిక తెలియ జేసింది. ఇదే తీరు కొనసాగితే ఇప్పుడున్న పెండింగ్ కేసుల్లోని బాధితులు న్యాయం కోసం 2029 వరకూ వేచిచూడక తప్పదని వివరించింది. అత్యాచార బాధితుల్లో కేవలం 15 శాతంమందికి మాత్రమే ఇంతవరకూ నష్టపరిహారం అందింది. దాదాపు 40 శాతంమందికి అసలు చట్టపరమైన సాయం లభించలేదు. ఈ కేసుల్లో దర్యాప్తు, చార్జిషీటు దాఖలు, విచారణలు అత్యంత దయనీ యంగా ఉన్నాయి. 2016లో మొత్తం 36,022 కేసులు నమోదైతే, అప్పటికే ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 12,000. మొత్తం ఈ 48,000 కేసుల్లో ఆ ఏడాది పోలీసులు చార్జిషీటు దాఖలు చేసినవి దాదాపు 33,000. న్యాయస్థానాల్లోనూ ఇదే స్థితి ఉంది. 2016నాటికి 70,000 కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటికి కొత్తగా ఈ 33,000 కేసులూ వచ్చి చేరాయి. కనుక వాటి ముందున్న కేసుల సంఖ్య లక్ష దాటింది. కానీ ఆ ఏడాది 11,000 కేసుల్లో మాత్రమే తీర్పులు వెలువడ్డాయి. విషాదమేమంటే వీటిలో కేవలం 3 శాతం కేసుల్లో... అంటే 330 కేసుల్లో మాత్రమే నేరగాళ్లకు శిక్ష పడింది. మిగిలిన కేసుల్లో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇలా ఏటా పెండింగ్ కేసుల సంఖ్య అపరిమి తంగా పెరుగుతుంటే... తీర్పులు వెలువడ్డ అత్యధిక కేసుల్లో నేరగాళ్లు నిర్దోషులుగా విడుదలవు తుంటే చట్టాలంటే భయభక్తులెలా ఉంటాయి? పిల్లలు భద్రంగా ఎలా ఉంటారు? మృగాళ్ల బారినపడుతున్న బాలబాలికల్లో అత్యధిక శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారు. కనుక ఆ కుటుంబాలకు చదువుసంధ్యలు అంతంతమాత్రం. ఈ రెండు కార ణాలవల్లా నేరగాళ్లు పోలీసుల్ని సులభంగా ప్రభావితం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కేసులు తెమలకుండా చూస్తున్నారు. ఇక రాజకీయ పలుకుబడి ఉంటే చెప్పనవసరమే లేదు. కఠువా ఉదంతంలో అప్పటి పీడీపీ–బీజేపీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని వారిని వెనకేసుకొచ్చారు. అక్కడి బార్ అసోసియేషన్, హిందూ ఏక్తామంచ్ వంటి సంస్థలు సైతం ఆ ర్యాలీలో పాల్గొన్నాయి. మరణశిక్ష వంటి కఠినమైన శిక్ష ఉండటం వల్ల మంచి కంటే చెడే అధికంగా జరుగుతుంది. నేరగాళ్లలో అత్యధికులు బాధిత కుటుంబానికి తెలిసినవారో, సన్నిహితులో అయి ఉంటారు. కనుక తమవారికి మరణశిక్ష పడు తుందన్న సందేహంతో ఆ కుటుంబాలు అసలు ఫిర్యాదు చేయడానికే వెనకాడతాయి. పోక్సో కేసుల కోసం 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నెలకొల్పుతామని బిల్లు ప్రవేశపెడుతూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. మంచిదే. కానీ ఇవి మరింతగా పెంచాలి. దాంతో పాటు మనుషుల్లో నీచాభిరుచుల్ని ప్రేరేపించి, మానవ బలహీనతలతో వ్యాపారం చేసే రకరకాల ధోరణులను రూపుమాపాలి. అప్పుడు మాత్రమే మన దేశంలో బాల్యం సురక్షితంగా, భద్రంగా ఉండగలుగుతుంది. -
సీఎం జగన్‌ను కలిసిన ‘పోస్కో’ సీఈవో
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు కొరియన్ స్టీల్ కంపెనీ పోస్కో ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో బాంగ్ గిల్ హో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయి తమ అభిప్రాయాన్ని తెలిపారు. పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో త్వరలోనే పోస్కో సాంకేతిక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కంపెనీ ఏర్పాటుకై స్థలాన్ని అన్వేషించనుంది. కాగా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో ఉన్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. -
‘పోస్కో’ అంటే పూసుకున్నారు..
భువనేశ్వర్: ప్రపంచానికి సుపరిచితమైన ‘పోస్కో’ పేరు ఒకప్పుడు భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో మారుమోగింది. పోస్కో పేరు చెప్పగానే ఇటు ఒడిశా రాష్ట్రంతోపాటు యావత్ భారతదేశం పులకించి పోయింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ పోస్కో కంపెనీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఉక్కు పరిశ్రమను పెట్టబోతోందని భారత్, తద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఒడిశా రాష్ట్రం ఉప్పొంగిపోయాయి. అడిగిందే తడువుగా వెనకాముందు అలోచించకుండా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం పోస్కో కంపెనీతో 2005లో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామంటూ కేంద్రం ప్రభుత్వ దీవించింది. 52 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెడుతున్న తొలి విదేశీ కంపెనీ పోస్కో కావడమే అందుకు కారణం. పర్యావరణ అవరోధాలు, ప్రజల అవిశ్రాంత పోరాటం, కొత్తగా వచ్చిన చట్టాల నిబంధనలు పన్నేండేళ్ల ‘పోస్కో ప్రాజెక్టు’కు తెరదించాయి. చావు కబురు చల్లగా చెప్పినట్లు ప్రతిపాదిత ఉక్కు ప్రాజెక్టు నుంచి పోస్కో తప్పుకున్నట్లు ఒడిశా రాష్ట్ర పరిశ్రమల మంత్రి దేవీ ప్రసాద్ మిశ్రా శనివారం నాడు ప్రకటించారు. భూమిపైనున్న తమ హక్కుల కోసం 12ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న పోస్కో వ్యతిరేక రైతులకు ఇది నైతిక విజయమే కావచ్చు. పర్యావరణ పరిరక్షకులకు ఉపశమనమూ కలిగించవచ్చు. జరిగిన అపార నష్టానికి ఎవరు వెలగట్టగలరు? అందుకు ఎవరు మూల్యం చెల్లిస్తారు? వస్తాయనుకున్న వేలాది ఉద్యోగాలు రాకపోగా, ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో సగం మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. ప్రాజెక్టు ఏర్పాటు పేరిట కాజు, ఇతర పండ్ల వక్షాలతోపాటు లక్షలాది వట వృక్షాలు నేల కూలాయి. ధ్వంసమైన తమలపాకు తోటలు రైతుల నోట్లో మట్టి కొట్టాయి. సగానికిపైగా అటవి ప్రాంతం ఎడారిగా మారిపోయింది. దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారు? ఎవరిదీ పాపం?! ఒడిశాలోని జగత్సింగ్ పూర్ జిల్లాలో పోస్కో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు 4004 ఎకరాల భూమి అవసరం అవుతుందని కంపెనీ అధికారులు అంచనా వేశారు. చేతిలో గుంట భూమి కూడా లేకుండానే సులువుగా ఆ మొత్తం భూమిని సేకరించి అప్పగిస్తామని రాష్ట్ర పరిశ్రమల అభివద్ధి కార్పొరేషన్ హామీ ఇచ్చింది. ముందుగా 3,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూసింది. చట్టాల అవాంతరాల కారణంగా కేవలం 17,00 ఎకరాలను మాత్రమే సేకరించగలిగింది. తమలపాకు తోటల ద్వారా నెలకు కనీసం 20 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న రైతుల్లో ఎవరు కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు రాలేదు. భ్రమలు, ప్రలోభాలతోపాటు బెదిరింపులు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా దాదాపు వెయ్యి ఎకరాలను సేకరించింది. మొత్తం 2700 ఎకరాలను సేకరించగా, అందులో 17,00 ఎకరాలను కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆ ప్రాంతాన్ని కంపెనీ చదును చేసింది. మొదటి దశకింద 80 లక్షల టన్నుల యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నారు. అవగాహన ఒప్పందం మేరకు ఉక్కు కర్మాగారం నిర్వహణకు ఓ ఓడ రేవును, ఖనిజ గనులను పోస్కోకు అప్పగించాల్సి ఉంది. సమీపంలోని పారదీప్ రేవును కంపెనీకి అప్పగించాలనుకున్నారు. అపార గనులున్న సుందర్‌గఢ్ ప్రాంతం లీజు దక్కేలా చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశోధనలు జరిపిన కంపెనీ అధికారులు అతి తక్కువ ధరకు ఇనుప ఖనిజాన్ని దక్కించుకోవచ్చని ఆశించారు. గనుల తవ్వకాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమాలను అరికట్టడంలో భాగంగా 2013లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర గనుల అభివద్ధి, నియంత్రణా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. కచ్చితంగా వేలం పాట ద్వారా ఎక్కువ బిడ్డింగ్ వేసిన వాళ్లకే గనులను అప్పగించడం సవరించిన దాట్లో ముఖ్యాంశం. 2015లో మళ్లీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన పోస్కో అధికారులు బిడ్డింగ్ ద్వారా గనులను దక్కించుకొని ప్రాజెక్టును నిర్మించడం అర్థరహితమని భావించారు. అప్పుడే ప్రాజెక్టును నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే వారు తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయడానికి రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు సేకరించిన భూమిని తమ వద్దనే ఉంచుకుంటామని, దాన్ని భవిష్యత్తులో వచ్చే పరిశ్రమల కోసం ఉపయోగిస్తామని రాష్ట్ర మంత్రి మిశ్రా చెప్పగా, పోస్కో నిష్క్రమిస్తే అంతకన్నా గొప్ప కంపెనీలను పిలుస్తామని కేంద్ర బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ తాజాగా ప్రకటించారు. తొలి ప్రాజెక్టు వైఫల్యం ద్వారా ఇంతకు వీరు ఏమి నేర్చుకున్నట్టు? -
పోస్కో ప్రాజెక్ట్‌కు ‘గ్రీన్’ సిగ్నల్
పోస్కో: దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ ఒడిశాలో రూ.52 వేల కోట్లతో నిర్మిస్తోన్న ఉక్కు ప్లాంట్‌కు పర్యావరణ అనుమతి లభించింది. అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు ఎనిమిదేళ్ల తర్వాత అనుమతి లభించింది. సామాజిక బాధ్యత కింద పోస్కో కంపెనీ 60 కోట్ల డాలర్ల కార్యక్రమాలు(ఈ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడుల్లో 5%) చేపట్టాల్సి ఉంటుందన్న షరతుతో పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ జియన్ వారం రోజుల్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ అనుమతి లభించింది. పోస్కో కంపెనీ 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో జగత్సింగ్పూర్లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పోస్కో ఈ ప్రాజెక్ట్‌లో స్టీల్ ప్లాంట్, పోర్ట్ ప్రాజెక్ట్‌లను చేపట్టింది. ప్రభుత్వం దీనిని స్టీల్ ప్లాంట్, పోర్ట్ ప్రాజెక్ట్‌లుగా విడగొట్టి స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే పర్యావరణ అనుమతులిచ్చింది. కాగా స్టీల్ ప్లాంట్ తొలి దశ నిర్మాణం 2018కల్లా పూర్తవుతుందని అంచనా. -
ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని దక్షిణ కొరియా కంపెనీలను ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. దేశానికి 8 శాతం వృద్ధిరేటును తిరిగి సాధించగల సత్తా ఉందని.. మందగమనం నుంచి తిరిగి పుంజుకోవడానికి తమ ప్రభుత్వం గత కొద్దినెలల్లో అనేక సంస్కరణలు, విధానపరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకొని పెట్టుబడులతో తరలిరావాలన్నారు. భారత్-దక్షిణ కొరియా ఆర్థిక శాఖల నాలుగో ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడుతూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో దక్షిణ కొరియా ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి హ్యూన్ ఓహ్ సియోక్ పాల్గొన్నారు. కొరియా స్టీల్ దిగ్గజం పోస్కో ఒరిస్సాలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని ఈ సందర్భంగా చిదంబరం తెలిపారు. కాగా, తదుపరి ద్వైపాక్షిక భేటీ దక్షిణ కొరియాలో జరగనుంది.