లైంగిక నేరగాళ్ల నుంచి పసి పిల్లలను కాపాడటం కోసం 2012లో వచ్చిన ‘పిల్లలపై లైంగిక నేరాల నిరోధక(పోక్సో) చట్టం’లో మరిన్ని కఠినమైన నిబంధనలు జోడిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. అది లోక్‌సభ పరిశీలనకు రాబోతోంది. ఇటీవల పసి పిల్లలపై లైంగిక నేరాలు, వేధింపులు విపరీతంగా పెరిగాయి. కొన్ని నేరాలైతే ఊహకందనివి. వాటి వివరాలు విన్నప్పుడు ఆ నేరగాళ్లు అసలు మనుషులా, మృగాలా అన్న సందేహం కూడా కలుగు తుంది. నిరుడు జమ్మూలోని కఠువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికపై సాగిన అకృత్యం అటువం టిదే. సంచార తెగకు చెందినవారిని భయభ్రాంతుల్ని చేసి వెళ్లగొట్టే ఉద్దేశంతో ఆ బాలికను అపహ రించి, హింసించడంతోపాటు డ్రగ్స్ ప్రయోగించారు.
ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. చివరకు రాళ్లతో కొట్టి చంపారు. మధ్యయుగాల నాటి ఆటవిక సంస్కృతి ఒకపక్క, ఆధునికత తెస్తున్న విశృంఖలత్వం మరోపక్క పెరగడంతో దేశంలో నానాటికీ ఈ మాదిరి నేరాలు పెరుగుతు న్నాయి. 2012లో తీసుకొచ్చిన కఠిన చట్టం కఠువా వంటి ఉదంతాలను నిరోధించలేకపోయింది. లోకమంటే పూర్తిగా తెలియని బాల్యంపై సాగే నేరాలు వారిపై జీవితాంతం ప్రభావం చూపుతాయి. వారు అందరిలా సాధారణ జీవనం కొనసాగించలేని నిస్సహాయతకు లోనై, జీవచ్ఛవాలుగా మారు తారు. కనుక కఠిన శిక్షలకు అవకాశం ఉండే చట్టం అమల్లోకొస్తే ఈ తరహా నేరాలు సమసిపోగల వని అందరూ విశ్వసిస్తారు. అందుకే కావొచ్చు... రాజ్యసభలో ఒకరిద్దరు మినహా అందరూ సవ రణ బిల్లును స్వాగతించారు. ఈ బిల్లు పసిపిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని ప్రతిపాదించింది. అలాగే వివిధ లైంగిక నేరాలకు ఇప్పుడున్న శిక్షలను మరింతగా పెంచింది. వాటితోపాటు పసిపిల్లలతో నీలిచిత్రాలు తీసేవారికి, వాటిని వ్యాప్తి చేసేవా రికి విధించే జైలుశిక్ష, జరిమానాలను భారీగా పెంచింది. ఈ చట్టం అమల్లోకొస్తే నేరగాళ్లకు 20 ఏళ్ల కఠినశిక్ష మొదలు... మరణించేవరకూ జైల్లో ఉండేలా జీవితఖైదు విధించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది.
అయితే నేరాలు జరిగేది చట్టాలు లేకపోవడం వల్లనో, ఉన్నా అవి అత్యంత కఠినంగా లేక పోవడం వల్లనో కాదు. అసలు ఆ చట్టాలంటేనే భయభక్తులు లేకపోవడం వల్ల. డబ్బు, పలుకుబడి ఉంటే సులభంగా తప్పించుకోగలమన్న భరోసా ఉండటం వల్ల. నేరం జరిగాక సత్వరం నేరగాళ్లను పట్టుకుంటే... వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలు సేకరించి సాధ్యమైనంత త్వరగా శిక్షించగలిగితే నేర గాళ్ల వెన్నులో చలిపుడుతుంది. నేరం చేయాలంటే భయపడే స్థితి ఏర్పడుతుంది. దురదృష్ట వశాత్తూ మన దేశంలో ఆ పరిస్థితి లేదు. పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు మంత్రులు చెప్పే స్థాయిలో క్షేత్ర స్థాయి ఆచరణ ఉండటం లేదు. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి నేతృత్వంలోని ఫౌండేషన్ ఇటీవల వెలువరించిన నివేదికే ఇందుకు సాక్ష్యం. ఇంతవరకూ ఢిల్లీలో పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో శిక్షలు పడిన ఉదంతాలు కేవలం 9 శాతం మాత్రమేనని ఆ నివేదిక తెలియ జేసింది. ఇదే తీరు కొనసాగితే ఇప్పుడున్న పెండింగ్ కేసుల్లోని బాధితులు న్యాయం కోసం 2029 వరకూ వేచిచూడక తప్పదని వివరించింది.
అత్యాచార బాధితుల్లో కేవలం 15 శాతంమందికి మాత్రమే ఇంతవరకూ నష్టపరిహారం అందింది. దాదాపు 40 శాతంమందికి అసలు చట్టపరమైన సాయం లభించలేదు. ఈ కేసుల్లో దర్యాప్తు, చార్జిషీటు దాఖలు, విచారణలు అత్యంత దయనీ యంగా ఉన్నాయి. 2016లో మొత్తం 36,022 కేసులు నమోదైతే, అప్పటికే ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 12,000. మొత్తం ఈ 48,000 కేసుల్లో ఆ ఏడాది పోలీసులు చార్జిషీటు దాఖలు చేసినవి దాదాపు 33,000. న్యాయస్థానాల్లోనూ ఇదే స్థితి ఉంది. 2016నాటికి 70,000 కేసులు పెండింగ్‌లో ఉండగా, వాటికి కొత్తగా ఈ 33,000 కేసులూ వచ్చి చేరాయి. కనుక వాటి ముందున్న కేసుల సంఖ్య లక్ష దాటింది. కానీ ఆ ఏడాది 11,000 కేసుల్లో మాత్రమే తీర్పులు వెలువడ్డాయి. విషాదమేమంటే వీటిలో కేవలం 3 శాతం కేసుల్లో... అంటే 330 కేసుల్లో మాత్రమే నేరగాళ్లకు శిక్ష పడింది. మిగిలిన కేసుల్లో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇలా ఏటా పెండింగ్ కేసుల సంఖ్య అపరిమి తంగా పెరుగుతుంటే... తీర్పులు వెలువడ్డ అత్యధిక కేసుల్లో నేరగాళ్లు నిర్దోషులుగా విడుదలవు తుంటే చట్టాలంటే భయభక్తులెలా ఉంటాయి? పిల్లలు భద్రంగా ఎలా ఉంటారు?
మృగాళ్ల బారినపడుతున్న బాలబాలికల్లో అత్యధిక శాతం మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారు. కనుక ఆ కుటుంబాలకు చదువుసంధ్యలు అంతంతమాత్రం. ఈ రెండు కార ణాలవల్లా నేరగాళ్లు పోలీసుల్ని సులభంగా ప్రభావితం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కేసులు తెమలకుండా చూస్తున్నారు. ఇక రాజకీయ పలుకుబడి ఉంటే చెప్పనవసరమే లేదు. కఠువా ఉదంతంలో అప్పటి పీడీపీ–బీజేపీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొని వారిని వెనకేసుకొచ్చారు. అక్కడి బార్ అసోసియేషన్, హిందూ ఏక్తామంచ్ వంటి సంస్థలు సైతం ఆ ర్యాలీలో పాల్గొన్నాయి. మరణశిక్ష వంటి కఠినమైన శిక్ష ఉండటం వల్ల మంచి కంటే చెడే అధికంగా జరుగుతుంది. నేరగాళ్లలో అత్యధికులు బాధిత కుటుంబానికి తెలిసినవారో, సన్నిహితులో అయి ఉంటారు. కనుక తమవారికి మరణశిక్ష పడు తుందన్న సందేహంతో ఆ కుటుంబాలు అసలు ఫిర్యాదు చేయడానికే వెనకాడతాయి. పోక్సో కేసుల కోసం 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నెలకొల్పుతామని బిల్లు ప్రవేశపెడుతూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. మంచిదే. కానీ ఇవి మరింతగా పెంచాలి. దాంతో పాటు మనుషుల్లో నీచాభిరుచుల్ని ప్రేరేపించి, మానవ బలహీనతలతో వ్యాపారం చేసే రకరకాల ధోరణులను రూపుమాపాలి. అప్పుడు మాత్రమే మన దేశంలో బాల్యం సురక్షితంగా, భద్రంగా ఉండగలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment