‘తక్షణ తలాక్‌’పై ఇంత తొందరేల? | Editorial Article On BC Triple Talaq Bill | Sakshi
Sakshi News home page

‘తక్షణ తలాక్‌’పై ఇంత తొందరేల?

Published Sat, Jul 27 2019 12:28 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Editorial Article On BC Triple Talaq Bill - Sakshi

తక్షణ తలాక్‌ విధానం ద్వారా విడాకులిచ్చే దురాచారాన్ని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. తలాక్‌ బిల్లు లోక్‌సభ ముందుకు రావడం ఇది మూడోసారి. ప్రభుత్వానికి ఆధిక్యత ఉన్న ఆ సభలో తొలి రెండుసార్లూ బిల్లుకు సులభంగానే ఆమోదముద్ర పడినా, రాజ్యసభలో విపక్షానికి మెజారిటీ ఉండటంతో అక్కడ సాధ్యం కాలేదు. ఇప్పుడైతే రాజ్యసభ ఆమోదం అసాధ్యం కాదన్న విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. మధ్యలో నిరుడు సెప్టెంబర్‌లో ఒకసారి ఆర్డినెన్స్‌ కూడా జారీ అయింది. కానీ తాజా బిల్లును గమనిస్తే ఇన్నాళ్లుగా వ్యక్తమవుతున్న ప్రధాన అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణించదల్చుకోలేదని అర్ధమవుతుంది. ముస్లిం మహిళలకు సమస్యగా మారిన తక్షణ తలాక్‌ విధానం ఉండరాదన్న నిర్ణయంతో ఎవరూ విభేదించడం లేదు. ముస్లిం పర్సనల్‌ లా గుర్తిస్తున్న తక్షణ తలాక్‌ విధానం చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం రెండేళ్లక్రితం తీర్పునిచ్చినప్పుడే చాలామంది దాన్ని హర్షించారు.

మన రాజ్యాంగం భిన్న మతాలకుండే వైయక్తిక చట్టాలను  (పర్సనల్‌ లా) గుర్తించింది. కానీ ఏ చట్టమైనా రాజ్యాంగం నిర్దేశించిన స్త్రీ, పురుష సమానత్వానికి లోబడి ఉండాల్సిందే. వివక్షనూ, ఆధిపత్య ధోరణిని ప్రోత్సహించే ఏదైనా చెల్లుబాటు కాదు. ఒకసారి సర్వోన్నత న్యాయస్థానం చెప్పాక ఆ విధానంలో ఎవరైనా విడాకులివ్వడానికి ప్రయత్నిస్తే అది చెల్లుబాటు కాదు. నిజానికి అందుకు చట్టం అవసరం కూడా లేదు. అయినా చట్టం అవసర  మని ప్రభుత్వం భావిస్తే కాదనేవారుండరు. కానీ తక్షణ తలాక్‌ చెప్పడాన్ని దానికదే నేరంగా పరిగ ణించడం సరికాదని బిల్లును వ్యతిరేకిస్తున్నవారంటున్నారు. మొదట్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు ఉన్న నిబంధనను ప్రభుత్వం స్వల్పంగా మార్చింది. భార్య లేదా ఆమె తరఫు రక్త సంబంధీకులు, బంధువులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మార్చారు. అలాగే దాన్ని రాజీకి వీలైన నేరంగా కూడా పరిగణిస్తూ ప్రతిపాదించారు. మొదట్లో ఉన్నట్టు ఇది నాన్‌ బెయిలబుల్‌ కేసుగానే ఉన్నా విచారణ సమయంలో బెయిల్‌ పొందేందుకు వీలు కల్పించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా తక్షణ తలాక్‌ను నేరంగా పరిగణించరాదన్న ప్రధాన సూచనను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. 

ఏ వైయక్తిక చట్టమైనా వివాహాన్ని సివిల్‌ ఒప్పందంగానే పరిగణిస్తుంది. భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో రెండోవారు దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అది లభించని పక్షంలో పరిహారాన్ని కోరవచ్చు. గృహ హింస చట్టం కింద కేసు పెట్టవచ్చు. అంతేతప్ప ఉల్లంఘించినవారిని నేరస్తులుగా పరిగణించే విధా నం లేదు. సివిల్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించే ఇతర మతాలవారి విషయంలో లేని నిబంధన ముస్లిం పురుషులకు ఎందుకుండాలన్నది బిల్లును వ్యతిరేకిస్తున్నవారి అభ్యంతరం. ఇది రాజ్యాంగం ప్రవ చిస్తున్న సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధం కాదా? ఇందువల్ల ముస్లిం మహిళలకు కలిగే మేలేమిటో కూడా అర్ధం కాదు. భర్త నిరాదరించిన పక్షంలో ఒంటరైన మహిళ వెంటనే కోరుకునేది జీవనం సాగించడానికి అవసరమైన మొత్తం. న్యాయస్థానం ఆ మొత్తాన్ని భర్త నుంచే ఇప్పించాలి. కానీ ఈ బిల్లు చట్టమయ్యాక భర్త జైలు పాలైతే ఆ పరిహారాన్ని అతను చెల్లించడం ఎలా సాధ్యం? అతడు చెల్లించలేని పక్షంలో ఆమెకు పరిహారం దక్కేదెలా? పైగా వివాహంలో పొరపొచ్చాలు వచ్చిన ప్పుడు సహజంగానే ఇద్దరినీ మళ్లీ ఒకటి చేయడానికి అందరూ ప్రయత్ని స్తారు. తక్షణ తలాక్‌ చెప్పిన భర్తపై మహిళ ఆవేశంతో కేసు పెట్టి అరెస్టు చేయిస్తే అలాంటి రాజీ యత్నాలకు అసలు వీలుంటుందా? ఈ బిల్లు చట్టమైతే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా తక్షణ తలాక్‌ చెల్లదని చెప్పిందే తప్ప, దాన్ని నేరపూరిత చర్యగా పరిగణిం చాలని అనలేదు.

చర్చ సందర్భంగా బిల్లును వ్యతిరేకించినవారు దాన్ని స్థాయీ సంఘానికి పంపాలని కోరారు. ఆ సూచన ఆహ్వానించదగ్గది. అక్కడైతే బిల్లును సంపూర్ణంగా అధ్యయనం చేయడానికి, మార్పులు సూచించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీన్ని వెనువెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్న మంత్రి అందుకు కారణం చెప్పారు. 2017 జనవరి నుంచి ఇంతవరకూ దేశవ్యాప్తంగా తక్షణ తలాక్‌తో విడాకులిచ్చిన ఉదంతాలు 547 జరిగాయని వివరించారు. అలాగే సుప్రీంకోర్టు ఇది చెల్లుబాటు కాదని చెప్పాక కూడా 345 ఉదంతాలు చోటుచేసుకున్నాయన్నారు. నిరుడు సెప్టెంబ ర్‌లో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన గణాంకాలను ఒకసారి ప్రస్తావించుకోవాలి. వాటి ప్రకారం అప్పటికి తక్షణ తలాక్‌ ఉదంతాలు 430 జరిగాయి. అంటే ఆ తర్వాత ఇంత వరకూ... అంటే ఈ పది నెలలకాలంలో కొత్తగా 117 ఉదంతాలు జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ముస్లింల జనాభా దాదాపు 17.5 కోట్లు.

ఇన్ని కోట్లమందిలో తక్షణ తలాక్‌ విధానం ఆచరిస్తున్నవారు ఎంత తక్కువమందో మంత్రి చెప్పిన గణాంకాలే వెల్లడిస్తున్నాయి. అయితే తక్కువ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి గనుక తక్షణ తలాక్‌ రద్దు వద్దని ఎవరూ అనరు. కానీ ఆదరాబాదరాగా తీసుకురావలసిన అగత్యం లేదు. ఒక చట్టం చేయదల్చుకున్నప్పుడు దానిపై అన్ని కోణాల్లోనూ చర్చించడం, ఎలాంటి పర్యవసానాలుండగలవో ఆలోచించడం, అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోవడం అవసరం. అప్పుడు మాత్రమే ఏ చట్టమైనా సమ గ్రంగా ఉంటుంది. అసహాయులకు ఆసరాగా నిలుస్తుంది. ఆదరాబాదరాగా తీసుకురావడం వల్ల, సూచనలను పెడచెవిన పెట్టడం వల్ల ఆశిస్తున్న ఫలితం రాదు. తాము ముస్లిం మహిళల ఆత్మగౌర వాన్ని కాపాడదల్చుకున్నామని, వారికి అన్యాయం జరగకుండా చూడదల్చుకున్నామని మంత్రి అంటున్నారు. కానీ ఈ బిల్లు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దాఖలా కనబడటం లేదు. కేంద్రం మరోసారి ఆలోచించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement