సమస్య ఎవరిదైతే వారి గోడు కదా వినాల్సింది. వారి అభిప్రాయం కదా ఆలకించాల్సింది. ఆ పని చేయకుండానే, సమస్యను పరిష్కరిస్తున్నామంటే దానికి అర్థం ఏముంటుంది! ఆడవారి కనీస వివాహ వయస్సును 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు పెంచేందుకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చూస్తే అలాగే అనిపిస్తోంది అంటున్నారు విమర్శకులు.
మన దేశంలో ఆడవారి వివాహ వయస్సు బిల్లును లోతుగా అధ్యయనం చేసే బాధ్యత మీద పడ్డ 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీకి చోటు దక్కడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడవారి జీవితానికి సంబంధించిన విషయంపైనా మగవాళ్ళే కూర్చొని, మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా అని మహిళా ఎంపీలే కాదు, మహిళా సంఘాలూ వేస్తున్న ప్రశ్న అర్థవంతమైనదే కాదు... సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సినది కూడా!\
మగపిల్లలకు ఇప్పటికే ఉన్నట్టుగా, ఆడపిల్లలకు కూడా కనీస వివాహ వయఃపరిమితిని 21 ఏళ్ళకు పెంచడం స్త్రీ సాధికారతకు తోడ్పడే చర్య అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆడపిల్లలు మరింత చదువుకోవడానికీ, సామాజిక అవగాహన పెంచుకోవడానికీ అది వీలు కల్పిస్తుందని భావిస్తోంది. అందుకు తగ్గట్టే 2006 నాటి బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని సవరించే బిల్లును ప్రభుత్వం ఇటీవలి పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో హడా విడిగా ఆమోదింపజేసింది. రాజ్యసభలో విపక్షాల ఒత్తిడితో ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, సూచనలు ఇవ్వడం కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాల్సి వచ్చింది. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ సహా 140 దేశాల్లో కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళే అన్న వాదన ఒకపక్క, తీరా ఈ స్థాయీ సంఘంలోనే లైంగిక సమానత్వం లేకుండా పోవడం మరోపక్క చర్చ రేపాయి.
ప్రస్తుతం మన లోక్‌సభలో 81 మంది, రాజ్యసభలో 29 మంది – మొత్తం 110 మంది మహిళా ఎంపీలున్నారు. కానీ, మహిళలకు సంబంధించిన చరిత్రాత్మక బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన పార్లమెంటరీ సంఘంలోనే స్త్రీలకు కనిష్ఠ ప్రాతినిధ్యం దక్కడం శోచనీయం. అందుకే, ఆ స్థాయీ సంఘంలో చోటు దక్కిన ఏకైక మహిళ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ నేరుగా ఉపరాష్ట్రపతి సచివాలయానికి లేఖ రాయాల్సి వచ్చింది. దేశంలోని స్త్రీలందరిపైనా ప్రభావం చూపే ఒక నిర్ణయం గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో వీలైనంత ఎక్కువమంది మహిళలకు చోటివ్వాలి కదా అన్నది సుస్మిత లాంటి అనేకుల వాదన.
అంతే కాదు... పార్లమెంటరీ నిబంధనల్లోని 84(3), 275 కింద ఉభయ సభల్లోని ఏ మహిళా ఎంపీ అయినా సరే వ్యక్తిగతంగా కానీ, లిఖితపూర్వకంగా కానీ ఈ ప్రతిపాదిత బిల్లుపై స్థాయీ సంఘానికి తమ అభిప్రాయాన్ని వెల్లడించే వీలు కల్పించాలని కోరుతున్నారు. స్త్రీలు – పిల్లలు – విద్య – యువతరం – క్రీడలపై నెలకొల్పిన ఆ పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం తొలిసారి సమావేశమవుతోంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుధే సారథ్యం లోని ఆ కమిటీలో 31 మందిలో 16 మంది బీజేపీ ఎంపీలే. ఏ పార్లమెంటరీ కమిటీకైనా తమ సభ్యు లను నామినేట్ చేసేది రాజకీయ పార్టీలే. ఒక్క టీఎంసీ మినహా పార్టీలన్నీ తమ పురుష ఎంపీలనే నామినేట్ చేయడంతో చిక్కొచ్చిపడింది. పదే పదే స్త్రీల సమస్యలు పరిశీలనకు వచ్చే ఈ మహిళా– శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో వీలైనంత ఎక్కువమంది మహిళలకే ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం, సహజ న్యాయం కూడా! ప్రభువులు ఆ శాఖ బాధ్యతలనైతే ఓ మహిళా మంత్రి (స్మృతీ ఇరానీ)కే అప్పగించారు కానీ, స్థాయీ సంఘ సభ్యుల అంశంలో మాత్రం పార్టీలలో ఎందుకో ఆ ఆలోచన కొరవడింది. అదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది.
లింగ సంబంధమైన కీలక అంశంపై చర్చించే చట్టసభా సంఘంలోనే లైంగిక అసమానత్వం చోటుచేసుకోవడం విడ్డూరమే కాదు... విషాదం. కమిటీలో దాదాపు అంతా మగవాళ్ళే ఉండడం... తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పక సరిదిద్దుకోవాల్సిన పొరపాటే. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ మొదలు డీఎంకె ఎంపీ కనిమొళి దాకా పలువురు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని ఆ కోణంలో నుంచే సర్కారు చూడాలి. అలాగే ఈ సంఘంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం తప్పనిసరి. ఆడపిల్లల వివాహ వయసుపై అనేక ఆందోళనలుండే గిరిజన సమాజపు వాణిని వారే వినిపించ గలరు. చిన్న వయసులో పెళ్ళిళ్ళ వల్ల ఆడపిల్లలు పౌష్టికాహార లోపానికీ, మాతృత్వ సమయంలో అనారోగ్యాలకూ గురికావడం ఎక్కువ. ఈ సాధకబాధకాలను స్త్రీలే సరిగ్గా వివరించగలరు.
హిందూ, ముస్లిమ్, క్రైస్తవ, పార్సీ – ఇలా దాదాపు 7 వ్యక్తిగత చట్టాలలో సైతం యువతుల వివాహ వయసు సూత్రాలను ఈ కొత్త బిల్లుతో సవరించాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికే బీజేపీ చేపట్టిన ఈ డొంక తిరుగుడు బిల్లులు, సవరణలన్నీ అనే విమర్శ కూడా లేకపోలేదు. ఏమైనా, మూడు నెలల్లో తన సూచనలివ్వాల్సిన ఈ కమిటీ... సత్వరమే ఈ బిల్లుతో ప్రభావితమయ్యే భాగస్వామ్య పక్షాలందరి గోడూ వినడం, వాటికి విలువ ఇవ్వడమే అసలైన ప్రజాస్వామిక చర్య. లేదంటే, ప్రపంచానికి పోయే సూచన ఒకటే – ‘ఈ దేశంలో ఇవాళ్టికీ మగవాళ్ళే ఆడవారి హక్కులను నిర్ణయిస్తున్నారు. మహిళలు మౌనప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు’. పాలకులు ఆ నిందను నిజం చేయకపోతే అదే పదివేలు!
Comments
Please login to add a commentAdd a comment