women marriage
-
అమ్మాయిల కనీస వివాహ వయసు ఎంత?
న్యూఢిల్లీ: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిల వివాహ వయసులో ఏకరూపత ఉండాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుపాలంటూ నోటీసులు జారీచేసింది. ముస్లిం పర్సనల్ లా అమ్మాయి రజస్వల అయితే వివాహం చేయడానికి అర్హురాలేనని పేర్కొంటోందని, మిగతా మతాల పర్సనల్ లాల్లో మాత్రం 18 ఏళ్ల కనీస వివాహ వయసుందని మహిళా కమిషన్ పేర్కొంది. ఇదీ చదవండి: ఆప్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు.. గంటల వ్యవధిలోనే సొంత గూటికి.. -
వారి మాట వినరా!?
సమస్య ఎవరిదైతే వారి గోడు కదా వినాల్సింది. వారి అభిప్రాయం కదా ఆలకించాల్సింది. ఆ పని చేయకుండానే, సమస్యను పరిష్కరిస్తున్నామంటే దానికి అర్థం ఏముంటుంది! ఆడవారి కనీస వివాహ వయస్సును 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు పెంచేందుకు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం చూస్తే అలాగే అనిపిస్తోంది అంటున్నారు విమర్శకులు. మన దేశంలో ఆడవారి వివాహ వయస్సు బిల్లును లోతుగా అధ్యయనం చేసే బాధ్యత మీద పడ్డ 31 మంది సభ్యుల పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీకి చోటు దక్కడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆడవారి జీవితానికి సంబంధించిన విషయంపైనా మగవాళ్ళే కూర్చొని, మాట్లాడి నిర్ణయం తీసుకుంటారా అని మహిళా ఎంపీలే కాదు, మహిళా సంఘాలూ వేస్తున్న ప్రశ్న అర్థవంతమైనదే కాదు... సరైన రీతిలో అర్థం చేసుకోవాల్సినది కూడా!\ మగపిల్లలకు ఇప్పటికే ఉన్నట్టుగా, ఆడపిల్లలకు కూడా కనీస వివాహ వయఃపరిమితిని 21 ఏళ్ళకు పెంచడం స్త్రీ సాధికారతకు తోడ్పడే చర్య అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆడపిల్లలు మరింత చదువుకోవడానికీ, సామాజిక అవగాహన పెంచుకోవడానికీ అది వీలు కల్పిస్తుందని భావిస్తోంది. అందుకు తగ్గట్టే 2006 నాటి బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని సవరించే బిల్లును ప్రభుత్వం ఇటీవలి పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో హడా విడిగా ఆమోదింపజేసింది. రాజ్యసభలో విపక్షాల ఒత్తిడితో ఆ బిల్లును కూలంకషంగా పరిశీలించి, సూచనలు ఇవ్వడం కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాల్సి వచ్చింది. అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ సహా 140 దేశాల్లో కనీస వివాహ వయస్సు 18 ఏళ్ళే అన్న వాదన ఒకపక్క, తీరా ఈ స్థాయీ సంఘంలోనే లైంగిక సమానత్వం లేకుండా పోవడం మరోపక్క చర్చ రేపాయి. ప్రస్తుతం మన లోక్‌సభలో 81 మంది, రాజ్యసభలో 29 మంది – మొత్తం 110 మంది మహిళా ఎంపీలున్నారు. కానీ, మహిళలకు సంబంధించిన చరిత్రాత్మక బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన పార్లమెంటరీ సంఘంలోనే స్త్రీలకు కనిష్ఠ ప్రాతినిధ్యం దక్కడం శోచనీయం. అందుకే, ఆ స్థాయీ సంఘంలో చోటు దక్కిన ఏకైక మహిళ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ సభ్యురాలు సుస్మితా దేవ్ నేరుగా ఉపరాష్ట్రపతి సచివాలయానికి లేఖ రాయాల్సి వచ్చింది. దేశంలోని స్త్రీలందరిపైనా ప్రభావం చూపే ఒక నిర్ణయం గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ఆ సంఘంలో వీలైనంత ఎక్కువమంది మహిళలకు చోటివ్వాలి కదా అన్నది సుస్మిత లాంటి అనేకుల వాదన. అంతే కాదు... పార్లమెంటరీ నిబంధనల్లోని 84(3), 275 కింద ఉభయ సభల్లోని ఏ మహిళా ఎంపీ అయినా సరే వ్యక్తిగతంగా కానీ, లిఖితపూర్వకంగా కానీ ఈ ప్రతిపాదిత బిల్లుపై స్థాయీ సంఘానికి తమ అభిప్రాయాన్ని వెల్లడించే వీలు కల్పించాలని కోరుతున్నారు. స్త్రీలు – పిల్లలు – విద్య – యువతరం – క్రీడలపై నెలకొల్పిన ఆ పార్లమెంటరీ స్థాయీ సంఘం బుధవారం తొలిసారి సమావేశమవుతోంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ వినయ్ సహస్రబుధే సారథ్యం లోని ఆ కమిటీలో 31 మందిలో 16 మంది బీజేపీ ఎంపీలే. ఏ పార్లమెంటరీ కమిటీకైనా తమ సభ్యు లను నామినేట్ చేసేది రాజకీయ పార్టీలే. ఒక్క టీఎంసీ మినహా పార్టీలన్నీ తమ పురుష ఎంపీలనే నామినేట్ చేయడంతో చిక్కొచ్చిపడింది. పదే పదే స్త్రీల సమస్యలు పరిశీలనకు వచ్చే ఈ మహిళా– శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కమిటీలో వీలైనంత ఎక్కువమంది మహిళలకే ప్రాతినిధ్యం కల్పించడం సమంజసం, సహజ న్యాయం కూడా! ప్రభువులు ఆ శాఖ బాధ్యతలనైతే ఓ మహిళా మంత్రి (స్మృతీ ఇరానీ)కే అప్పగించారు కానీ, స్థాయీ సంఘ సభ్యుల అంశంలో మాత్రం పార్టీలలో ఎందుకో ఆ ఆలోచన కొరవడింది. అదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. లింగ సంబంధమైన కీలక అంశంపై చర్చించే చట్టసభా సంఘంలోనే లైంగిక అసమానత్వం చోటుచేసుకోవడం విడ్డూరమే కాదు... విషాదం. కమిటీలో దాదాపు అంతా మగవాళ్ళే ఉండడం... తెలిసి జరిగినా, తెలియక జరిగినా తప్పక సరిదిద్దుకోవాల్సిన పొరపాటే. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ మొదలు డీఎంకె ఎంపీ కనిమొళి దాకా పలువురు వ్యక్తం చేసిన ఆగ్రహాన్ని ఆ కోణంలో నుంచే సర్కారు చూడాలి. అలాగే ఈ సంఘంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల స్త్రీలకు ప్రాతినిధ్యం తప్పనిసరి. ఆడపిల్లల వివాహ వయసుపై అనేక ఆందోళనలుండే గిరిజన సమాజపు వాణిని వారే వినిపించ గలరు. చిన్న వయసులో పెళ్ళిళ్ళ వల్ల ఆడపిల్లలు పౌష్టికాహార లోపానికీ, మాతృత్వ సమయంలో అనారోగ్యాలకూ గురికావడం ఎక్కువ. ఈ సాధకబాధకాలను స్త్రీలే సరిగ్గా వివరించగలరు. హిందూ, ముస్లిమ్, క్రైస్తవ, పార్సీ – ఇలా దాదాపు 7 వ్యక్తిగత చట్టాలలో సైతం యువతుల వివాహ వయసు సూత్రాలను ఈ కొత్త బిల్లుతో సవరించాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడానికే బీజేపీ చేపట్టిన ఈ డొంక తిరుగుడు బిల్లులు, సవరణలన్నీ అనే విమర్శ కూడా లేకపోలేదు. ఏమైనా, మూడు నెలల్లో తన సూచనలివ్వాల్సిన ఈ కమిటీ... సత్వరమే ఈ బిల్లుతో ప్రభావితమయ్యే భాగస్వామ్య పక్షాలందరి గోడూ వినడం, వాటికి విలువ ఇవ్వడమే అసలైన ప్రజాస్వామిక చర్య. లేదంటే, ప్రపంచానికి పోయే సూచన ఒకటే – ‘ఈ దేశంలో ఇవాళ్టికీ మగవాళ్ళే ఆడవారి హక్కులను నిర్ణయిస్తున్నారు. మహిళలు మౌనప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు’. పాలకులు ఆ నిందను నిజం చేయకపోతే అదే పదివేలు! -
వివాహ కనీస వయసు.. పాజిటివ్‌తో పాటు నెగెటివ్ కూడా!
అమ్మాయిల కనీస పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని భాగస్వామ్యులైన నేటి యువతరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అయితే దేశంలోని పేదరికం, విద్య, వైద్య సదుపాయాలు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మనస్తత్వం, వైవాహిక వ్యవస్థపై బలంగా నాటుకుపోయిన భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నిపుణుల భావన. పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలనేది వారి సూచన. ఈ నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వాదనలేమిటనేది ప్రస్తావనార్హం. అనుకూల వాదన ► అమ్మాయిలకు చదువులు కొనసాగించే వీలు కలుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాంతో సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వారో హోదాను పొందుతారు. మహిళా సాధికారికతకు దోహదపడుతుంది. ► ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన విస్తృతం అవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. స్థిరమైన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోగలుగుతారు. తమ గొంతుకను బలంగా వినిపించగలరు. ► లేబర్ ఫోర్స్‌లో (ఉద్యోగాల్లో) మహిళల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ 2019 అంచనాల ప్రకారం భారత లేబర్ ఫోర్స్‌లో మహిళలు 20.3 శాతం మాత్రమే. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో ఇది 30.5 శాతం. శ్రీలంకలో 33.7 %. 2020లో ప్రపంచ సగటు 46.9 % ► పోషకాహార స్థాయి పెరుగుతుంది. ► గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా (గర్భస్రావం, ప్రసవ సమయంలో) సంభవించే మరణాలు తగ్గుతాయి. 21 ఏళ్లు దాటితే శారీరక ఎదుగుదల బాగుంటుంది కాబట్టి అమ్మాయిలు బిడ్డను కనేందుకు అనువైన వయసు అవుతుంది. ప్రతి లక్ష మందితో గర్భధారణ, ప్రసవ సమయంలో ఎంత మంది మరణిస్తున్నారనే దాన్ని ‘మాటర్నల్ మొర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్)గా పిలుస్తారు. 2014–16 మధ్య ఎంఎంఆర్ భారత్‌లో 130 ఉండగా, 2016–18 మధ్య ఇది 113 చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్‌ను 70గా నిర్దేశించారు. ప్రతికూల వాదన ► అమ్మాయి పెళ్లి ఎప్పుడనేది భారత సమాజంలో తల్లిదండ్రులకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న. వారిపై బయటికి కనిపించని సామాజిక ఒత్తిడి. కనీస వయసును 21 ఏళ్లకు పెంచినా గ్రామీణ భారతంలో ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ► కనీస వయసు 21 ఏళ్లకు పెంచకముందే... భారత్‌లో 2019 నాటికే అమ్మాయిల సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లుగా ఉందని భారత గణాంక, పథకాల అమలు శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో బాల్యవివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ► ప్రస్తుతం పీసీఎంఏ– 2006లో బాల్యవివాహం చేసిన వారికి, సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫిర్యాదు వస్తేనే కేసులు నమోదవుతున్నాయి. సామాజికంగా ఆమోదయోగ్యం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేకపోతే చెల్లుబాటు అవుతున్నాయి. తేబోయే చట్ట సవరణలో 21 ఏళ్ల కింది వయసులో పెళ్లిళ్లను నిషేధిస్తేనే ఫలితం ఉంటుంది. ► అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. పరువు, కులం పేరిట తల్లిదండ్రులు యువజంటలకు వ్యతిరేకంగా దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో... అధికభాగం 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్నవే ఉన్నాయి. ప్రపంచంలోని భిన్న ఖండాల్లోని వివిధ దేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వివాహ వయసు ఇలా ఉంది. అమెరికాలో మూడు నాలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నా మెజారిటీ రాష్ట్రాల్లో 18 ఏళ్లుగానే ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి
న్యూఢిల్లీ: దేశంలో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో మహిళల కనీస వివాహ వయసు పురుషులతో సమానమవనుంది. స్త్రీ, పురుషుల కనీస వివాహ వయసును సమానం చేసి 21 ఏళ్లుగా నిర్ణయించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం అంగీకారం తెలిపిందని, ఈ శీతాకాల సమావేశాల్లో సంబంధిత సవరణ బిల్లు తేవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్మాయిల పెళ్లి వయసు పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు, శిశువులను పౌష్టికాహార లేమి నుంచి కాపాడేందుకు అమ్మాయిల పెళ్లి వయసును పెంచడం అవసరమని గత ఏడాది స్వాతంత్య్రదిన ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంపై అధ్యయనానికి సమతా పార్టీ మాజీ చీఫ్ జయా జైట్లీ అధ్యక్షతన గత ఏడాదే నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. డిసెంబర్లో ఈ కమిటీ సిఫార్సులను కేంద్రానికి సమర్పించగా, వీటి పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రతి రంగంలో లింగ సమానత్వం, సాధికారత పెంచాలని భావించేటప్పుడు స్త్రీ కనీస వివాహ వయసును 18 ఏళ్లకు పరిమితం చేయడం సబబు కాదని జయా జైట్లీ అభిప్రాయపడ్డారు. 18 ఏళ్ల పరిమితి వల్ల పలువురు మహిళలు కాలేజీలకు వెళ్లే అవకాశం కోల్పోతున్నారని, పురుషులకు 21 ఏళ్ల వరకు స్వీయ సంసిద్ధత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పురుషుడితో సమానంగా స్త్రీలకు అవకాశాలు కల్పించాలంటే అమ్మాయిల కనీస వివాహ వయసును 21కి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై పలువురి అభిప్రాయాలు స్వీకరించామని, వివాహ వయసు పెంపు ప్రతిపాదనకు మతాలకతీతంగా స్త్రీ సమాజం నుంచి అధిక సానుకూలత వచ్చిందన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలతో మాట్లాడామని వివరించారు. ఈ సంఘంలో నీతీ ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, విద్యావేత్తలు నజ్మా అఖ్తర్, వసుధా కామత్, దీప్తీ షా తదితరులున్నారు. నిపుణుల ఆందోళన వివాహ వయసు పెంచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు. వయసు పెంపు ప్రతిపాదనను చట్టబద్ధం చేయడంతో 21 ఏళ్లకు లోపు చేసే వివాహాలు శిక్షార్హమవుతాయని, దీంతో కలిగే దుష్పరిణామాలు, 18 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాల కన్నా అధికమని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమితా పిత్రే అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం సమాజంలో చిన్న వయసులో చేసే వివాహాల శాతం 23 శాతానికి (27 నుంచి) తగ్గిందన్నారు. ఇటీవల కాలంలో పలు అగ్ర, మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు 21 ఏళ్లు దాటిన చాన్నాళ్లకు పెళ్లాడుతున్నారన్నారు.అనేక సమాజాల్లో సగానికిపైగా వివాహాలు 21 ఏళ్లకు ముందే అవుతున్నాయని, దీన్ని ఒక్కమారుగా శిక్షార్హం చేయడం సమాజంలో అలజడకి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. చట్ట సవరణ చేయడం.. మూలకారణాలను వదిలి లక్షణాలకు చికిత్స చేసినట్లని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. శతాబ్దాలుగా ఉన్న అలవాటు ఒక్కమారుగా పోదంది. అసమానత్వం, పేదరికం, విద్యా వైద్య లేమి, ఉపాధి అవకాశాల కొరత లాంటి పలు అంశాలు బాల్య, చిన్నవయసు వివాహాలకు కారణమని తెలిపింది. ఈ చట్టాలకు సవరణ! మహిళల కనీస వివాహ వయసును మార్చేందుకు ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధ చట్టం (పీసీఎంఏ)– 2006కు సవరణలు తీసుకువస్తుంది. పీసీఎంఏలో స్త్రీ, పురుషుల కనీస వివాహ హక్కు వరుసగా 18, 21 ఏళ్లుగా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో పీసీఎంఏతో పాటు స్పెషల్ మ్యారేజ్ (సివిల్) యాక్ట్–1954, హిందూ మ్యారేజ్ యాక్ట్–1955కు సైతం మార్పులు చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కుల వివాహల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలుంటాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మతంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ వర్తించే నిబంధనలుంటాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
పెళ్లికి ఒప్పుకోలేదని..
పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు యువ తి కుంటుంబ సభ్యులపై దారుణానికి ఒడిగట్టాడు. యువతి, తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ çసంఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. సాక్షి, తిరువణ్ణామలై : పెళ్లికి అంగీకరించలేదని యువతి, తల్లిదండ్రులపై దాడిచేసి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో యువతి, తల్లి మృతిచెందగా, యువతి తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కణ్ణమంగళం సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా కణ్ణమంగళం సమీపంలోని కనికాపురానికి చెందిన శివరామన్(54) వ్యవసాయ కూలీ. ఇతని భార్య చామండీశ్వరి(44), వీరి కుమార్తె నిర్మల(24) ఎంఏ, బీఎడ్ పట్టభద్రురాలు. ఇదే గ్రామానికి చెందిన రాజవేలు కుమారుడు అన్బయగన్(34) వీరికి బంధువు అవుతాడు. ఇతను నిర్మలను వివాహం చేసుకోవాలని ఆశతో ఉన్నాడు. నిర్మల చదువుకు అయ్యే ఖర్చులు పూర్తిగా అన్బయగన్ పెట్టినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం శివరామన్ ఇంటికి వెళ్లి నిర్మలను వివాహం చేసుకుంటానని అన్బయగన్ కోరాడు. ఇందుకు చామండీశ్వరి నిరాకరించడం, నిర్మల కూడా వివాహం చేసుకోనని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన అన్బయగన్ ఇంట్లో ఉన్న కత్తితో చామండీశ్వరి, శివరామన్, నిర్మలను పొడిచాడు. నిర్మల, చామండీశ్వరి అక్కడిక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలతో శివరామన్ కేకలు వేశాడు. దీంతో అన్బయగన్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ కేకలు విన్న స్థానికులు ఇంటికి వచ్చి శివరామన్‌ను ఆస్పత్రికి తరలించారు. శివరామన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అనంతరం అన్బయగన్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్పీ పొన్ని, డీఎస్పీ సెంథిల్, కణ్ణమంగళం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
పేద యువతులకు మమత పెళ్లి కానుక
సాక్షి, కోల్‌కతా : పేద యువతుల వివాహనికి చేయూత అందించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాలికలు చదువుకునేలా, బాల్య వివాహల నిర్మూలనే లక్ష్యంగా బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే కన్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగా బాలికలకు సంవత్సరానికి 500 రూపాయల స్కాలర్‌షిప్‌తోపాటు, టెన్త్ పాసయ్యాక ఒకేసారి 25వేల రూపాయలు అందజేస్తున్నారు. ఈ పథకానికి కొనసాగింపుగా రూపశ్రీ పథకాన్ని గత బుధవారం నుంచి అమల్లోకి తీసుకుచ్చారు. ఈ పథకం కింద పేద మహిళల వివాహానికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు 1500 కోట్ల రూపాయలు కేటాయించారని, ఆర్థికంగా వెనుకబడిన ఆరు లక్షల యువతులకు లబ్ధి జరగనుందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. -
సురేఖ.. మార్చుకోలేక!
ఆడపిల్ల. ఇప్పటికీ ఆడ..పిల్లగానే మిగిలిపోతోంది. యుగాలు మారినా.. మానవ మేధస్సు దినదినాభివృద్ధి చెందినా.. ఆ ఒక్క విషయంలో వీరి దృక్పథం మారకపోవడం ఆడపిల్ల భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతోంది. అసలు పిల్లలే కలగలేదని ఎంతో మంది కనిపించని దేవుళ్లకు మొక్కుతూ.. హస్తవాసి కలిగిన వైద్యులంటూ వారి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే సమయంలో కలిగినది ఆడపిల్ల అయితే మరో సమస్య. అత్తమామల ఎత్తిపొడుపులు.. తప్పు చేసిన దానిలా చూసే భర్తతో వేగలేక అదే ఆడపిల్ల నిత్యనరకం అనుభవిస్తోంది. ఈ కోవలో భర్త, అత్తమామల నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. మగ సంతానం లేదనే బెంగతో ఓ మహిళ పెళ్లి రోజునే అర్ధాంతరంగా తనువు చాలించింది. తన రేఖను.. మగ సంతానంపై పెట్టుకున్న ఆశను మార్చుకోలేక చివరకు ఆమే ఈ లోకం వీడింది. ప్యాపిలి, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ మండలం బాచ్చాపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, సుభద్రమ్మ దంపతుల పెద్ద కుమార్తె సురేఖ(22)కు ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామానికి చెందిన మద్దిలేటిస్వామితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గోబి బండి నిర్వహణతో వీరి సంసారం సాఫీగా సాగిపోతోంది. పెళ్లయిన ఏడాదికే ఆడపిల్ల జన్మించడంతో మహాలక్ష్మి కలిగిందని సంతోషపడ్డారు. మొదటి కాన్పులో ఎవరు పుట్టినా.. ఆ తర్వాత మగ సంతానం కలుతుందిలే అనే బంధువుల మాటలు సురేఖ మనసులో బలంగా నాటుకుపోయాయి. మలి విడత గర్భం దాల్చగా.. ఆరు నెలల క్రితం కవలలు జన్మించారు. ఆమె ఆశలను తలకిందులు చేస్తూ రెండో విడతలోనూ ఇరువురూ ఆడపిల్లలే కలగడం తట్టుకోలేకపోయింది. భర్త తరపు నుంచి ఎలాంటి వేధింపులు లేకపోయినా.. ఇదేదో తప్పుగా భావించి ఆమె తనలో తనే కుమిలిపోసాగింది. తల్లికి కూడా ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో.. తనకూ ఇకపై మగ పిల్లలు పుట్టరనే బెంగ పెట్టుకుంది. మంగళవారం పెళ్లి రోజు కావడంతో ఉదయం నుంచి ఆ ఇంట్లో హడావుడి నెలకొంది. సాయంత్రం వేళ పిల్లలతో కలసి వేడుక చేసుకునేందుకు భర్త మద్దిలేటి కేక్ తీసుకొస్తానంటూ డోన్‌కు బయలుదేరాడు. ఈ సమయంలోనే ఆమె మనసును ‘మగ’పురుగు తొలచింది. మగపిల్లలు కలగలేదనే దిగులుతో ఉరేసుకొని తనువు చాలించింది. రాత్రికి ఇంటికి చేరుకున్న భర్త జరిగిన ఘోరాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈమె తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ముగ్గురు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఒక పాపకు మూడేళ్లు.. మరో ఇద్దరు కవలలకు ఆరు నెలలు కావడంతో విగతజీవురాలైన తల్లిని బంధువులు వారికి చూపలేకపోయారు. పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మృతురాలి తల్లి సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్సై జయన్న తెలిపారు.