అమ్మాయిల కనీస పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచాలనే నిర్ణయాన్ని భాగస్వామ్యులైన నేటి యువతరం మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అయితే దేశంలోని పేదరికం, విద్య, వైద్య సదుపాయాలు... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మనస్తత్వం, వైవాహిక వ్యవస్థపై బలంగా నాటుకుపోయిన భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలనేది నిపుణుల భావన. పర్యవసానాల గురించి కూడా ఆలోచించాలనేది వారి సూచన. ఈ నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వాదనలేమిటనేది ప్రస్తావనార్హం.
అనుకూల వాదన
► అమ్మాయిలకు చదువులు కొనసాగించే వీలు కలుగుతుంది. నైపుణ్యాభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. దాంతో సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో వారో హోదాను పొందుతారు. మహిళా సాధికారికతకు దోహదపడుతుంది.
► ప్రపంచం, చుట్టూ ఉన్న సమాజం పట్ల అవగాహన విస్తృతం అవుతుంది. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. స్థిరమైన సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోగలుగుతారు. తమ గొంతుకను బలంగా వినిపించగలరు.
► లేబర్ ఫోర్స్‌లో (ఉద్యోగాల్లో) మహిళల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ 2019 అంచనాల ప్రకారం భారత లేబర్ ఫోర్స్‌లో మహిళలు 20.3 శాతం మాత్రమే. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో ఇది 30.5 శాతం. శ్రీలంకలో 33.7 %. 2020లో ప్రపంచ సగటు 46.9 %
► పోషకాహార స్థాయి పెరుగుతుంది.
► గర్భధారణ సమయంలో తలెత్తే సమస్యల కారణంగా (గర్భస్రావం, ప్రసవ సమయంలో) సంభవించే మరణాలు తగ్గుతాయి. 21 ఏళ్లు దాటితే శారీరక ఎదుగుదల బాగుంటుంది కాబట్టి అమ్మాయిలు బిడ్డను కనేందుకు అనువైన వయసు అవుతుంది. ప్రతి లక్ష మందితో గర్భధారణ, ప్రసవ సమయంలో ఎంత మంది మరణిస్తున్నారనే దాన్ని ‘మాటర్నల్ మొర్టాలిటీ రేషియో (ఎంఎంఆర్)గా పిలుస్తారు. 2014–16 మధ్య ఎంఎంఆర్ భారత్‌లో 130 ఉండగా, 2016–18 మధ్య ఇది 113 చేరిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంఎంఆర్‌ను 70గా నిర్దేశించారు.
ప్రతికూల వాదన
► అమ్మాయి పెళ్లి ఎప్పుడనేది భారత సమాజంలో తల్లిదండ్రులకు నిత్యం ఎదురయ్యే ప్రశ్న. వారిపై బయటికి కనిపించని సామాజిక ఒత్తిడి. కనీస వయసును 21 ఏళ్లకు పెంచినా గ్రామీణ భారతంలో ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది.
► కనీస వయసు 21 ఏళ్లకు పెంచకముందే... భారత్‌లో 2019 నాటికే అమ్మాయిల సగటు పెళ్లి వయసు 22.1 ఏళ్లుగా ఉందని భారత గణాంక, పథకాల అమలు శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో, పేదల్లో బాల్యవివాహాలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
► ప్రస్తుతం పీసీఎంఏ– 2006లో బాల్యవివాహం చేసిన వారికి, సహకరించిన వారికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఫిర్యాదు వస్తేనే కేసులు నమోదవుతున్నాయి. సామాజికంగా ఆమోదయోగ్యం కాబట్టి ఎవరికీ అభ్యంతరం లేకపోతే చెల్లుబాటు అవుతున్నాయి. తేబోయే చట్ట సవరణలో 21 ఏళ్ల కింది వయసులో పెళ్లిళ్లను నిషేధిస్తేనే ఫలితం ఉంటుంది.
► అమ్మాయిలు తమకు నచ్చిన వారిని పెళ్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. పరువు, కులం పేరిట తల్లిదండ్రులు యువజంటలకు వ్యతిరేకంగా దీన్నో ఆయుధంగా వాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో... అధికభాగం 18 ఏళ్లు నిండకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లాడిన అమ్మాయిల తల్లిదండ్రులు పెడుతున్నవే ఉన్నాయి.
ప్రపంచంలోని భిన్న ఖండాల్లోని వివిధ దేశాల్లో అమ్మాయిలు, అబ్బాయిల కనీస వివాహ వయసు ఇలా ఉంది. అమెరికాలో మూడు నాలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నా మెజారిటీ రాష్ట్రాల్లో 18 ఏళ్లుగానే ఉంది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment