సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి దక్షిణ కొరియాకు చెందిన ఉక్కు దిగ్గజం పోస్కో స్టీల్ ఆసక్తి వ్యక్తం చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. తదుపరి చర్చల కోసం సియోల్ నుంచి ప్రతినిధుల బృందాన్ని రాష్ట్రానికి పంపాలని కోరుతూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవన్ పోస్కో ఇండియా సీఎండీ సంగ్ లేకి లేఖ రాశారు. కృష్ణపట్నంలో యూనిట్ నెలకొల్పే ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఎంపిక చేయడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు విషయంపై చర్చిద్దామని పేర్కొన్నారు. పోస్కో ఇండియా బృందం గతేడాది డిసెంబర్ 18న కృష్ణపట్నం రావడంతో పాటు ఫిబ్రవరి 10న సంగ్‌లే స్వయంగా కృష్ణపట్నం వచ్చి పోర్టు అధికారులతో చర్చలు జరపడం ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేసిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై తమ చిత్తశుద్ధిని తెలియచేస్తోందన్నారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉంటుందన్నారు.
కృష్ణపట్నం.. రాష్ట్ర అభివృద్ధి కేంద్రం
రానున్న కాలంలో చెన్నై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలతో పోటీ పడుతూ పారిశ్రామికాభివృద్ధి జరిగే అవకాశాలు కృష్ణపట్నంలో పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కేంద్రంగా ఎదగనుందని కరికల్ వలవన్ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వ్యూహాత్మక ప్రాంతంలో ఉందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన పోర్టు పక్కనే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ఎగుమతులు, దిగుమతులకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.
దక్షిణాసియాలోనే పూర్తి ఆటోమేటెడ్ పోర్టు కావడంతోపాటు భారీ నౌకలు రావడానికి అనుగుణంగా ఈ పోర్టును నిర్మించారన్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే సాధ్యమైనంత త్వరగా భూమి అప్పగించేలా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ ఉక్కు కర్మాగారం యాంకర్ పరిశ్రమగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకు అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందన్నారు. పారిశ్రామిక పాలసీ 2020–23 ఇప్పటికే అమల్లో ఉందని, ఇవికాకుండా పెట్టుబడి విలువ, ఉద్యోగ అవకాశాలు, అనుబంధ కంపెనీల వృద్ధి లాంటి ప్రతిపాదనలతో వస్తే అవసరమైన రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment