
అక్సో నోబెల్ ఇండియా కొనుగోలుకి రెడీ
ప్రమోటర్లు, పీఈ సంస్థల పెట్టుబడులు, రుణాలు
ముంబై: డ్యూలక్స్ బ్రాండ్ పెయింట్ల దిగ్గజం అక్సో నోబెల్ ఇండియా కొనుగోలుకి జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లతోపాటు.. పీఈ దిగ్గజాలు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నిధులను రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ ఎండీ పార్ధ్ జిందాల్ తెలియజేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గ్రూప్ కంపెనీ అంతర్గత వనరులు, ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను పీఈ సంస్థలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఐదేళ్ల క్రితమే ప్రస్థానం ప్రారంభించిన జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ తాజాగా డచ్ దిగ్గజం అక్సో నోబెల్.. ఇండియా బిజినెస్‌ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. డీల్ పూర్తయితే జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్ దేశీయంగా డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో మూడో పెద్ద కంపెనీగా అవతరించనుంది. రానున్న మూడేళ్లలో టర్నోవర్ రూ. 7,500 కోట్లకు చేరనున్నట్లు అంచనా.
కాగా.. భారత్ నుంచి పూర్తిగా వైదొలగడంలేదని అక్సో నోబెల్ సీఈవో గ్రెగ్ పౌక్స్ గిలామీ తెలియజేశారు. పౌడర్ కోటింగ్స్ బిజినెస్, ఆర్‌అండ్‌డీ కంపెనీ చేతిలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. అయితే జేఎస్‌డబ్ల్యూకి సాంకేతిక భాగస్వామిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లైసెన్సింగ్, రాయల్టీ ఒప్పందంకింద 4.5 శాతం అందుకోనున్నట్లు తెలియజేశారు.