న్యూఢిల్లీ: ఆటోరంగ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో వాటా కొనుగోలుకి డైవర్సిఫైడ్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీవైడీ ఇండియాలోనూ వాటాను సొంతం చేసుకునేందుకు స్టీల్ నుంచి స్పోర్ట్ వరకూ విభిన్న బిజినెస్‌లు కలిగిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
గ్రూప్ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఉత్సాహంగా చర్చిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎఫ్‌వో శేషగిరి రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. వెరసి ఫోర్ వీలర్స్ తయారీపై గ్రూప్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. తద్వారా మరిన్ని రంగాలలోకి గ్రూప్ విస్తరించనున్నట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం అటు ఎంజీ మోటార్ ఇండియా, ఇటు బీవైడీ ఇండియాలతో వాటా కొనుగోలు నిమిత్తం ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై స్పందించడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! మరోపక్క కంపెనీ విధానాల ప్రకారం ఇలాంటి అంచనాలపై స్పందించలేమంటూ ఎంజీ మోటార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment