పుట్టపర్తి ఏరియల్ వ్యూ
అనంతపురం విద్య / శ్రీకంఠం సర్కిల్/పుట్టపర్తి: విస్తీర్ణంలో దేశంలోనే ఏడో అతి పెద్ద జిల్లా అయిన అనంతపురం ఇక మీదట రెండు జిల్లాలు కానుంది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధామం పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. బుధవారం నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశముంది. అనంతపురం జిల్లా పరిధిలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలోకి అనంతపురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ వస్తాయి. కొత్తగా ఏర్పాటయ్యే సత్యసాయి జిల్లాలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అనంతపురం జిల్లా విస్తీర్ణం 11,359 చదరపు కిలోమీటర్లుగా, సత్యసాయి జిల్లా విస్తీర్ణం 7,771 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది.
ఎన్నెన్నో అనుకూలతలు
పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు భౌగోళిక, ఆధ్యాత్మిక తదితర అంశాలు దోహదపడ్డాయి. పుట్టపర్తి ఇప్పటికే అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. సత్యసాయి బాబా నడయాడిన నేల కావడంతో పాటు ప్రకృతి రమణీయత, అందాలొలికే నిర్మాణాలు, విద్య, వైద్య సౌకర్యాలు, జిల్లా కేంద్రం అవసరాలకు అనుగుణంగా భూ, నీటివనరులు అందుబాటులో ఉండడం తదితర అంశాలు కలిసొచ్చాయి. సత్యసాయి జిల్లా ఏర్పాటు ఎంతో మంది బాబా భక్తుల ఆకాంక్ష కూడా. ఇప్పుడది కార్యరూపం దాల్చడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: (ఇక 26 జిల్లాలు)
పారిశ్రామిక ప్రగతికి ఊతం
సత్యసాయి జిల్లా ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతికి కూడా ఊతం ఇచ్చినట్లు అవుతోంది. విశ్వనాగరిక నగరం బెంగళూరుకు కేవలం 154 కిలోమీటర్ల దూరంలోనే పుట్టపర్తి ఉంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే 131 కిలోమీటర్ల దూరమే. ఇప్పటికే పుట్టపర్తిలో విమానాశ్రయం ఉంది. దీనివల్ల పారిశ్రామిక, పాలనాపరమైన కార్యకలాపాలు సులువుగా నిర్వహించుకోవచ్చు. పెనుకొండ సమీపంలోని కియా కార్ల కంపెనీ, కొడికొండ వద్ద ఏర్పాటైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రాంతాలు కూడా పుట్టపర్తికి దగ్గరగానే ఉంటాయి. దీంతో కొడికొండ చెక్‌పోస్టు నుంచి కియా కంపెనీ వరకు పరిశ్రమలు వృద్ధి చెందడానికి, మిగిలిన ప్రాంతాల్లోనూ పరిశ్రమల స్థాపనకు సత్యసాయి జిల్లా దోహదం కానుంది.
సేద్యపు సిరులు..చారిత్రక వైభవాలు
సత్యసాయి జిల్లా పరిధిలో ఆయకట్టున్న చెరువులు సింహభాగం వస్తున్నాయి. బుక్కపట్నం చెరువు 2,971 ఎకరాలు, పరిగి చెరువు 2,851 ఎకరాలు, ధర్మవరం చెరువు 1,922 ఎకరాలు, కొట్నూరు చెరువు 1,508 ఎకరాలు, హిందూపురం చెరువు 1,130 ఎకరాలు, గొట్లూరు చెరువు 642 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్నాయి. యోగివేమన, చిత్రావతి, పెడబల్లి రిజర్వాయర్లు, హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిధిలోని గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు ఈ జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. వీటితో పాటు చారిత్రక ప్రాంతాలైన పెనుకొండ, లేపాక్షి, హేమావతి, ఖాద్రీ లక్ష్మీనృసింహుని క్షేత్రం, తిమ్మమ్మమర్రిమాను వంటివి ఈ జిల్లాలో ఉంటాయి.
తప్పనున్న వ్యయప్రయాసలు
పాలనా సౌలభ్యం కోసం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే హిందూపురం పార్లమెంట్ పరిధిలో సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల వారికి ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రం సుదూరంలో ఉంది. ఎన్‌పీ కుంట వాసులకు 120 కి.మీ, మడకశిర వాసులకు 115 కి.మీ. దూరంలో ఉండడం గమనార్హం. పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు వల్ల వీరికి దూరం తగ్గి వ్యయప్రయాసలు తప్పనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment