
సాక్షి, అమరావతి: ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూమికి కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్‌దారులు 2013 భూ సేకరణ చట్టం లేదా రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇతర చట్టం కింద పరిహారానికి అర్హులని చెప్పింది. ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో 259 ఆధారంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కి తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదని, చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మంగళం గ్రామానికి చెందిన కె.నాగవేణి మరో ఇద్దరు 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, భూ సేకరణ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై జస్టిస్ సత్యనారాయణమూర్తి తుది విచారణ జరిపారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది కాలవ సురేష్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారానికి అర్హులని వివరించారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమికి పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మేకల పాండు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని తెలిపారు.
ఆ స్టే ఎత్తివేసేంత వరకు జీవో 259 ప్రకారం పిటిషనర్లు కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమిని ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకున్నప్పటికీ పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తేల్చి చెప్పారు. ప్రస్తుత కేసులో కూడా పిటిషనర్లకు ఆరు నెలల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment