హుస్నాబాద్‌ రణరంగం  | Police Lotty Charge Again On Gouravelly project expats | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ రణరంగం 

Published Wed, Jun 15 2022 1:34 AM | Last Updated on Wed, Jun 15 2022 7:51 AM

Police Lotty Charge Again On Gouravelly project expats - Sakshi

హుస్నాబాద్‌ సింగిల్‌ విండో కార్యాలయం ఎదుట భూనిర్వాసితులపై లాఠీచార్జి చేస్తున్న పోలీసులు

సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులపై మళ్లీ లాఠీచార్జి జరిగింది. పూర్తిగా పరిహారమిచ్చాకే గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ చేపట్టాలంటూ నిర్వాసితుల ఆందోళన.. ప్రతిగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల ర్యాలీ.. పరస్పరం రాళ్లదాడులు.. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి.. కొట్టుకుంటూ, లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్లకు తరలించడంతో హుస్నాబాద్‌ పట్టణం రణరంగంగా మారింది. సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లిలో పోలీసుల అరెస్టులతో మొదలైన ఆందోళన.. మంగళవారం సాయంత్రానికి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. 

తెల్లవారుజామున అరెస్టులతో మొదలై
గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తికావడంతో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రధాన కాల్వ పనులపై కోర్టు స్టే ఉండటంతో ట్రయల్‌రన్‌ నిర్వహించేందుకు మరో కాల్వ నిర్మాణం చేపట్టి, నీళ్లు నింపాలని నిర్ణయించారు. ఇందుకోసం గుడాటిపల్లిలో సేకరించిన భూమిలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టగా.. నిర్వాసితులు అడ్డుకుని, నిరసన తెలిపారు. అయితే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు భారీగా పోలీసు బలగాలు గుడాటిపల్లికి చేరుకున్నాయి.

విద్యుత్‌ సరఫరా నిలిపేసి.. ఇళ్లలోకి చొరబడి నిర్వాసితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ నిర్వాసితులు పాదయాత్రగా హుస్నాబాద్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం హుస్నాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం కూడా నిర్వాసితులు ఆందోళన కొనసాగించారు. 
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన భూ నిర్వాసితులు 

ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. 
ఓ వైపు నిర్వాసితుల ఆందోళన కొనసాగుతుండగానే.. మరోవైపు టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలంతా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి చేరుకోవాలంటూ సమాచారం వెళ్లింది. గౌరవెల్లి రిజర్వాయర్‌ ట్రయల్‌రన్‌ జరగకుండా ప్రతిపక్షాలు అడ్డు కుంటున్నాయని, వెంటనే ట్రయల్‌ రన్‌ చేపట్టాలంటూ ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం ఇద్దామని.. అంతా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయానికి రావాలని సూచన వచ్చింది.

టీఆర్‌ఎస్‌ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర నేతలు క్యాంప్‌ కార్యాలయానికి చేరుకున్నారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ కూడా అక్కడికి వస్తున్నారని తెలిసిన నిర్వాసితులు.. ఎమ్మెల్యేకు తమ సమస్యలు వివరిస్తామంటూ భారీ ర్యాలీగా క్యాంప్‌ ఆఫీస్‌ వైపు బయలుదేరారు. పోలీసులు వారిని క్యాంపు ఆఫీసుకు కొద్దిదూరంలో హన్మకొండ ప్రధా న రహదారిపై అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు ప్రధాని రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

టీఆర్‌ఎస్‌ శ్రేణులు బయటికొచ్చి.. 
క్యాంపు ఆఫీస్‌లో పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు.. ప్రాజెక్టు ట్రయల్‌రన్‌ వెంటనే చేపట్టాలనే డిమాండ్‌తో ర్యాలీగా బయలుదేరారు. బయట నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారని, వెళ్లొద్దని ఏసీపీ, ఇతర పోలీసు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. టీఆర్‌ఎస్‌ నేతలు వినలేదు.

మరోవైపు ఆందోళన విరమించాలంటూ పోలీసులు కోరినా నిర్వాసితులూ వినలేదు. కాసేపటికే టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలంతా నినాదాలు చేసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాలు ఎదురుపడటంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు వచ్చి లాఠీచార్జి మొదలుపెట్టారు. 

దొరికినవారిని దొరికినట్టు కొడుతూ.. 
కర్ర, ఫైబర్‌ లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రధానంగా నిర్వాసితులను ఉరికించి కొట్టారు. కొందరిని ఈడ్చిపారేశారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డాయి. నిర్వాసితులను కొడుతుంటే వారి కుటుంబ సభ్యులు, మహిళలు అడ్డురాగా వారిపైనా పోలీసులు లాఠీ ఝలిపించారు.

కొందరిని క్యాంపు ఆఫీస్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకూ కొట్టుకుంటూ లాక్కెళ్లారు. తమ వారిని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి కొట్టి చంపుతారని ఆందోళన వ్యక్తం చేస్తూ మహిళలు, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని లాఠీలతో చెదరగొట్టి నిర్వాసితులను లోనికి తీసుకెళ్లారు. దీనితో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. నలుగురు మహిళలు స్పృహతప్పి పడిపోగా ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనల్లో హుస్నాబాద్‌ ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. 
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి  ర్యాలీగా వస్తున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు 

గుర్తుపెట్టుకుని మరీ కొట్టారు! 
పోలీసులు గత మూడు రోజులుగా ఆందోళనలో ముందున్న నిర్వాసితులను గుర్తుపెట్టుకుని మరీ లాఠీలు, కర్రలు విరిగేలా కొట్టారని కుటుంబ సభ్యులు, గుడాటిపల్లి గ్రామస్తులు మండిపడ్డారు. తమ వారిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పరామర్శించారు. కాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం రాత్రి గుడాలిపల్లి నిర్వాసితులను, గాయపడిన మహిళలను పరామర్శించారు. పోలీసులు, టీఆర్‌ఎస్‌ నేతలు కలిసి తమపై దాడి చేశారని మహిళలు రోదిస్తూ గోడు వెళ్లబోసుకున్నారు.

రిజర్వాయర్‌ లెక్క ఇదీ.. 
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గౌరవెల్లి రిజర్వాయర్‌ను 1.14 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2007లో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 1,870 ఎకరాల భూమికి ఎకరానికి రూ.2.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించి సేకరించారు. 

2015లో టీఆర్‌ఎస్‌ సర్కారు ఈ ప్రాజెక్టును రీడిజైన్‌ చేసింది. రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 8.23 టీఎంసీలకు పెంచింది. దీనితో గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి, మద్దెలపల్లి, చింతలతండా, జాలుబాయితండా, కొత్తపల్లి, సేవనాయక్‌ తండా, తిర్మల్‌ తండా, సోమాజి తండాల్లో ఇళ్లు, వ్యవసాయ భూములు పూర్తిగా రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యాయి.

రీడిజైన్‌ కోసం అదనంగా 1,900 ఎకరాలు అవసరమవడంతో.. మొదట 1,600 ఎకరాలను ఒక్కో ఎకరానికి రూ.6.95 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు. గత నవంబర్‌లో మరో 222 ఎకరాలను ఎకరానికి 15 లక్షల చొప్పున చెల్లించి సేకరించారు.   

నిర్వాసితుల డిమాండ్లివే!
► భూనిర్వాసితులు తమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన అందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. 2015 నాటికి నిర్వాసితుల్లో మేజర్లకు రూ.8 లక్షల చొప్పున, మైనర్లకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీనిని నిర్వాసితులు తిరస్కరించారు. అందరికీ రూ.8 లక్షల పరిహారమివ్వాలని కోరారు. ఈ ఏడేళ్లలో చాలా మంది మేజర్లు అయ్యారు. అందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలంటున్నారు.
► నిర్వాసితులకు పరిహారం చెల్లించే సమయంలో 57 మంది రైతుల పేర్లు మిస్సయ్యాయని.. మరో 59 మంది వృద్ధులని చెప్పి ప్యాకేజీ అందించలేదని.. వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. 
► ఇక 88 ఎకరాలకు చెందిన రైతులు తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
► మరోవైపు అధికారులు మాత్రం భూసేకరణకు సంబంధించి 80శాతం పరిహారం చెల్లింపు పూర్తయిందని, మిగతా వారికి నెలరోజుల్లో చెల్లిస్తామని చెప్తున్నారు. ఇక ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించి మైనర్లు తిరస్కరించడం వల్లే చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement