
నిర్వాసితులకు న్యాయం : గంటా
విశాఖ రూరల్ : ఎస్‌ఈజెడ్‌ల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ తగిన న్యాయం చేస్తామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీఐఐసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి యలమంచిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, పాయకరావుపేటలకు చెందిన ఎమ్మెలతో వారి నియోజకవర్గాలకు చెందిన మండలాల్లో ఎస్‌ఈజెడ్, ఫార్మాసిటీలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
పరవాడ, అచ్యుతాపురం మండలాల్లో ఎస్‌ఈజెడ్, ఫార్మా కంపెనీల కోసం భూములిచ్చిన, స్థలాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా కొంతమందికి సరైన పునరావాసం కానీ, ఆర్‌ఆర్ ప్యాకేజీ కానీ అందలేదని పెందుర్తి, యలమంచిలి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు తెలిపారు. నిర్వాసితులకు ఆయా కంపెనీల్లో ఉపాధి కల్పించాలని చెప్పారు.
అందుకు మంత్రి స్పందిస్తూ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే ఎన్టీపీసీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే లు పీలా గోవింద్, వి. అనిత, పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, జోనల్ మేనేజర్లు యతిరాజు, సారధి, అనకాపల్లి ఆర్డీఓ వసంతరాయుడు, ఆర్‌అండ్‌ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంక టేశ్వరరావు, కలెక్టరేట్ ఈ సెక్షన్, జి-సెక్షన్ సూపరింటెండెంట్లు నర్సింహమూర్తి, రమణి తదితరులు పాల్గొన్నారు.