భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
మిర్యాలగూడ : టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే దీక్షలకు గురువారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం నాలుగు గ్రామాలు నీటమునిగే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా ఎనిమిది ఎత్తిపోతల పథకాలు కూడా మునిగిపోతున్నాయని, వాటి పరిధిలోని నాలుగు వేల ఎకరాల భూమి బీడుగా మారనుందని పేర్కొన్నారు. 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తిరిగి యధావిధిగా ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా గతంలో కేవలం ఎకరానికి 1.25 లక్షల రూపాయలే చెల్లించారని, ప్రస్తుతం ముంపు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లింలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం –2013 ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డితో సమావేశమై భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్యానాయక్, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్‌నాయక్, పగిడి రామలింగయ్య, చిరుమర్రి కృష్ణయ్య, కందిమళ్ల లక్షా్మరెడ్డి, సీపీఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రవినాయక్, చంద్రశేఖర్‌యాదవ్, కమిటీ నాయకులు హనుమంతునాయక్, లాలునాయక్, మునినాయక్, బాబి, సేవానాయక్ తదితరులు పాల్గొన్నారు.