నిర్వాసితులకు ఊరట | Expats is happy | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు ఊరట

Published Wed, Aug 3 2016 11:39 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

నిర్వాసితులకు ఊరట - Sakshi

నిర్వాసితులకు ఊరట

  • విపక్షాలకు సంతోషం
  • సర్కారుకు సంకటం
  • హైకోర్టు తీర్పుతో సర్కారుకు మొదలైన భూసేకరణ తలనొప్పి
  • భూసేకరణ చట్టాన్ని అమలు చేయాల్సిందేన ంటున్న గౌరవెల్లి, గండిపెల్లి భూ నిర్వాసితులు
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 123 జీవోను హైకోర్టు కొట్టివేయడంతో సాగునీటి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే నిర్వాసితుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఇరకాటంలో పడగా నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న విపక్షాలు మరింత ఉత్సాహంతో బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలో చేపడుతున్న కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం, గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు 14 వేల ఎకరాలు, ఇతర పరిశ్రమల కోసం సుమారు 20 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీనిని దష్టిలో ఉంచుకుని 123 జీవోకు అనుగుణంగా వేలాది ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు శరాఘాతంగా మారింది. 2013లో పార్లమెంటులో చేసిన భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరించాల్సిన ఆగత్యం ఏర్పడింది. దీంతో భూముల సేకరణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ప్రస్తుతం జిల్లాలో గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల కోసం భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. ఈ రిజర్వాయర్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రెండు వేలకుపైగా ఎకరాల భూమిని సేకరించింది. రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతో మరో మూడు వేల ఎకరాలను సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. 123 జీవో ప్రకారం ఎకరాకు రూ.5.5 లక్షల నుంచి 6.5 లక్షల చొప్పున చెల్లించి భూములు సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌సహా స్థానిక అధికారులు పలుమార్లు గ్రామాలకు వెళ్లి భూనిర్వాసితులతో మంతనాలు జరుపుతున్నారు. అదే సమయంలో సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. 2013 భూసేకరణ  చట్టం ప్రకారమే భూమిని సేకరించాలనికి కోరుతూ భూ నిర్వాసితుల సంఘం నిరవధిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గౌరవెల్లి, గండిపెల్లి ముంపు గ్రామాల్లో రెండు రోజులపాటు పాదయాత్ర చేసి నిర్వాసితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బీజేపీ లీగల్‌సెల్‌ నాయకులు గ్రామాల్లో పర్యటించి భూములు కోల్పోయే రైతులకు మద్దతు ప్రకటించారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తోపాటు ఆ పార్టీ నాయకులు భూనిర్వాసితుల పక్షాన పోరాటాలు చేపట్టారు. టీడీపై సైతం 2013 జీవో ప్రకారమే భూములు సేకరించాలని డిమాండ్‌ చేస్తోంది. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
     
    భూసేకరణ చట్టం ఏం చెబుతోందంటే...
    2013 భూసేకరణ చట్టం ప్రకారం మరీ ప్రత్యామ్నాయం లేకుంటే తప్ప ఏటా రెండు పంటలు పండే భూములను ప్రాజెక్టుల కోసం సేకరించరాదు. ఒకవేళ తప్పనిసరైతే పరిమితికి మించి భూమిని సేకరించడం లేదని నిరూపించాలి. భూ సేకరణ చేపట్టాలంటే ముందుగా ప్రభుత్వం దినపత్రికల్లో ప్రకటన జారీ చేయాలి. అరవై రోజుల సమయమిచ్చి గ్రామసభ నిర్వహించాలి. ఆ లోపే నిర్వాసితులకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించాలి. సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి గ్రామసభ ముందుంచాలి. గ్రామసభ ఆమోదిస్తేనే భూములను సేకరించాలి. అట్లాగే సవరించిన మార్కెట్‌ విలువ (రిజిస్ట్రేషన్‌ ధర)కు కనీసం మూడురెట్లు ధర చెల్లించాలి. అసైన్డు, పట్టా లేకున్నా సాగులో ఉన్న భూ యజమానులకు పట్టాభూమితో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కింద రూ.5లక్షలు లేదా ప్రతినెలా రూ.2వేల చొప్పున ఇరవై ఏళ్లపాటు పింఛన్‌ చెల్లించాలి. ప్రాజెక్టు కారణంగా ఇల్లు కోల్పోతే అన్ని సౌకర్యాలతో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. నివాస బదిలీ ఖర్చు కింద ఆర్థికసాయం అందించాలి. ఎస్సీ, ఎస్టీలకైతే నివాస బదిలీ ఖర్చు కింద అదనంగా రూ.50 వేలు చెల్లించాలి. పశువుల పాకకు ధర చెల్లించాలి. భూమి, ఇంటి రిజిస్ట్రేషన్‌ ఫీజు మాఫీ చేయాలి. వీటికితోడు ఒకవేళ భూమికి భూమి కోరుకుంటే ఆయకట్టు కింద ఒక ఎకరం భూమి ఇవ్వాలి. ఒకవేళ ప్రాజెక్టు కింద ఊరు ముంపుకు గురైతే సకల సౌకర్యాలతో మళ్లీ ఊరును నిర్మించాలి. ఈ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలంటే ప్రభుత్వానికి తలకుమించిన భారం కానుంది. 
     
    అప్పీల్‌కు వెళ్లే యోచనలో సర్కార్‌ 
     123 జీవో ప్రకారం భూములను సేకరించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం హైకోర్టు తీర్పుతో పునరాలోచనలో పడింది. భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూములను సేకరించాలంటే పెద్ద తతంగమే ఉంటుందని, దీనిద్వారా ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడే అవకాశముందని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిని దష్టిలో ఉంచుకుని కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లడమే మేలని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఒకటి రెండ్రోజుల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
     
    సర్కారుకు చెంపదెబ్బ
     123, 124 భూసేకరణ జీవోలను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీసెల్‌ చైర్మన్‌ ఆరెపల్లి మోహన్, డీసీసీ చైర్మన్‌ కటుకం మత్యుంజయం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వెంటనే రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని పొన్నం డిమాండ్‌ చేశారు. 123 జీవో ప్రకారం తీసుకున్న భూములను వెంటనే వెనక్కు ఇచ్చేయాలని శ్రీధర్‌బాబు సూచించారు. మరోవైపు కోర్పు తీర్పును స్వాగతిస్తూ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement