హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతరాణిగా పేరొందిన సిమ్లాలో తొలిసారిగా సిమ్లా వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రారంభించారు. ఏడు రోజుల పాటు కొనసాగే ఈ శీతాకాలపు కార్నివాల్.. సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ సాంస్కృతిక కవాతును వీక్షించారు. కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్‌లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కార్నివాల్‌లో మద్యం తాగి డ్యాన్స్ చేసే వారితో సీఎం స్నేహపూర్వకంగా కనిపించారు. అతిగా తాగి వచ్చే పర్యాటకులను పోలీస్ లాకప్‌లో కాకుండా హోటల్‌కు తరలించాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎవరైనా టూరిస్ట్ మద్యం తాగి రచ్చ చేస్తే పోలీసులు వారికి వీఐపీ ట్రీట్‌మెంట్ అందించాల్సి ఉంటుంది.
సిమ్లా వింటర్ కార్నివాల్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ విపత్తు సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక వ్యాపారం భారీగా నష్టపోయిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందన్నారు.
భారీ సంఖ్యలో జనం హిమాచల్ ప్రదేశ్‌కు తరలివస్తున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్‌ను 24 గంటలూ తెరిచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాకుండా పర్యాటకులను ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులు నానా హంగామా చేయకూడదని, చట్టాన్ని గుర్తుంచుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
సిమ్లా, మనాలిలకు పర్యాటకులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలో బస చేస్తున్నారు. కాగా మనాలిలో పర్యాటకులు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. కొందరు పర్యాటకులు మద్యం సేవించి లోయల్లో హల్‌చల్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
Comments
Please login to add a commentAdd a comment