
పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్టూమాగ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 12న ఎల్‌బీ స్టేడియం వేదికగా అతిపెద్ద యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ కార్నివాల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు.
ఈ కార్నివాల్‌లో అధునాతన సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలను ప్రభావితం చేసే వినూత్న ఆలోచనా విధానాలను, టెక్నాలజీ సంబంధిత అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు మాట్లాడుతూ..ఎమర్జింగ్ టెక్నాలజీలో భవిష్యత్ అవకాశాలను అన్వేషించే వారికి స్టూమాగ్జ్ ‘స్టూడెంట్ ట్రైబ్ ఇనిషియేటివ్’ సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రోస్ట్ కార్నివాల్ రూపొందించినట్లు తెలిపారు. యువతలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ కృషి చేస్తుందని చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తోటం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment