innovation cell
-
‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వెల్లడించింది. ఆవిష్కర్తలు తమ ఎంట్రీలను సమర్పించడానికి ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది 6వ ఎడిషన్‌తో ముందుకు వచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ తెలంగాణలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.స్థానిక సవాళ్లకు పరిష్కారాలను తీసుకువచ్చే ఉద్దేశంతో, తమ ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు తయారు చేసిన ప్రజలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, ఆ ఆవిష్కరణలను ఆగస్టు 15న ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది.దరఖాస్తులను వాట్సాప్ ద్వారా 9100678543కు పంపించాలి. పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణ గురించి 100 పదాల వివరణ, నాలుగు అధిక-రిజల్యూషన్ చిత్రాలతో పాటు రెండు వీడియోలు (2నిమిషాలలోపు) పంపించాలని ఇన్నోవేషన్ సెల్ తెలిపింది. -
మార్చి 12న యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్టూమాగ్జ్ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 12న ఎల్బీ స్టేడియం వేదికగా అతిపెద్ద యూత్ కార్నివాల్ ‘ప్రోస్ట్’ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ కార్నివాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు. ఈ కార్నివాల్లో అధునాతన సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలను ప్రభావితం చేసే వినూత్న ఆలోచనా విధానాలను, టెక్నాలజీ సంబంధిత అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా స్టూమాగ్జ్ వ్యవస్థాపకుడు శ్రీచరణ్ లక్కరాజు మాట్లాడుతూ..ఎమర్జింగ్ టెక్నాలజీలో భవిష్యత్ అవకాశాలను అన్వేషించే వారికి స్టూమాగ్జ్ ‘స్టూడెంట్ ట్రైబ్ ఇనిషియేటివ్’ సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రోస్ట్ కార్నివాల్ రూపొందించినట్లు తెలిపారు. యువతలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేటివ్ సెల్ కృషి చేస్తుందని చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తోటం అన్నారు. -
జీహెచ్ఎంసీలో త్వరలోనే ఇన్నోవేషన్ సెల్!
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అంతర్గత అంశాలపై ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ తదితర అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అంతర్గత విషయాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలిపారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి, రోడ్ల విస్తరణ కోసం జీహెచ్ఎంసీలో త్వరలోనే ఇన్నోవేషన్ సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ సెల్‌కు ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వవచ్చునని తెలిపారు. ఇంకా మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే... * యూనిఫైడ్ మెట్రో ట్రాన్స్ పోర్ట్ అథారిటీని మరింత బలోపేతం చేస్తాం. * హైదరాబాద్ రోడ్ల విషయంలో మార్పులు. * రోడ్ల అభివృద్ధికి నేషనల్ హైవేస్.. ఆర్ అండ్ బీఈఎన్సీ.. జీహెచ్ఎంసీసీఈలతో ప్రత్యేక కమిటీ. * స్టాండర్డ్ రేట్ ప్రకారం బలమైన కంపెనీకి పనులు ఇస్తాం. వారికి దశల వారీగా చెలింపులు చేస్తాం. * 221 ట్రాఫిక్ జంక్షన్ లపై పోలీస్ యంత్రాంగంతో వచ్చేవారం సమావేశం. * త్వరలో చీఫ్ ఇంఫర్మేషన్ ఆఫీసర్ నియామకం. * పార్కింగ్ కాంప్లెక్స్ లు ప్రజలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు * వీటి ద్వారా వారికి ఆదాయం కూడా అందుతుంది. ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉంది. * త్వరలో ఆస్థిపన్ను పెంచే అవకాశం. * ఆగష్టు 15 నాటికి 15 ఏళ్లు దాటిన పాత జీహెచ్ఎంసీ వాహనాలు తొలగించి.. అదేరోజున కొత్తవాటిని అందజేస్తాం. * ఇవన్నీ సాకారం అవడానికి త్వరలో సిబ్బంది నియామకం.