భారత్ లో అదే అత్యంత చౌక నగరం!
కోల్ కతాః ప్రవాసితులు నివసించేందుకు వీలుగా, ఇండియలోని మిగిలిన నగరాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ఒకప్పుడు సామాన్యులు సైతం బతికేందుకు వీలుగా, చౌకగా ఉండే నగరంగా పేరొందిన ముంబై ప్రస్తుతం ఆస్థానాన్ని కోల్పోయి అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయిందని సర్వేల్లో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ప్రస్తుతం కోల్ కతా అతి చౌక నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందిన కొద్ది రోజుల్లోనే ముంబైలోని అద్దెలు ఢిల్లీతో పోలిస్తే సుమారు 18 శాతం పెరిగిపోయినట్లు సర్వేలద్వారా తెలుస్తోంది.
భారతదేశంలో సామాన్యులకు, ప్రవాసితులకు అందుబాటులో, తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ నిర్వహించిన సంవత్సరాంతపు సర్వేల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరు విదేశీయులకు అందుబాటులో ఉంటుందని, అతి తక్కువ ఖర్చుతో కోల్ కతాలో సామాన్యులు సైతం జీవించేందుకు వీలుందని సర్వే చెప్తోంది. మెర్సర్స్ 2016 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఖర్చు ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో టాప్ ర్యాంక్ లో నిలువగా, రెండో స్థానంలో లువాండా, అంగోలా రాజధాని మోపడం లు ఉన్నాయి. జురిచ్, సింగపూర్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలువగా, గతేడాది ఆరోస్థానంలో ఉన్న టోక్యో ఈసారి ఐదో స్థానానికి ఎగబాకింది.
ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఎక్కువ ఖర్చుగల నగరాల్లో మొదటిస్థానాన్ని 82 వ ర్యాంకుతో ముంబై ఆక్రమించింది. ఆ తర్వాత ర్యాంకులు 130 ఢిల్లీ, 158 చెన్నై ఆక్రమించగా... కోల్ కతా 194, బెంగళూరు 180 ర్యాంకులతో తక్కువ ఖర్చుగల నగరాలుగా గుర్తింపు పొందాయి. మెర్సర్స్ సంస్థ ప్రతియేటా మార్చి నెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పై సర్వే నిర్వహించి, మే, జూన్ ప్రాంతాల్లో ర్యాంకులను వెల్లడిస్తుంది. ఏ నగరంలోనైనా వస్తువులు మరియు సేవలు, హౌసింగ్ ఆధారంగానే జీవన వ్యయాన్ని అంచనావేస్తామని, మూడేళ్ళుగా ముంబై, ఢిల్లీకన్నా ఐదు కేటగిరీల్లో అత్యంత ఖరీదైన నగరంగా ఉంటోందని మెర్సర్ సంస్థ గ్లోబల్ మొబిలిటీలో.. ప్రిన్సిపాల్ ఇండియా ప్రాక్టీస్ లీడర్ గా పనిచేస్తున్న రుచికా పాల్ తెలిపారు.