బోయినపల్లి (చొప్పదండి) : ‘మిడ్‌మానేరు’ ని ర్వాసితులు ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల బిల్లుల చెల్లింపు విషయంలో పీటముడి వీడడంలేదు. పెరిగిన ధరల ప్రకా రం ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు చెల్లించాల ని నిర్వాసితులు కోరుతున్నారు. గతంలో ఐఏవై కింద ఇల్లు ఉండేదని, దానికి రూ.70 వేలు వర్తించేవని, ఇప్పుడు పీఎంఏవై కిందకు రావడంతో రూ.1.20 లక్షలకు మించి చెల్లించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
మధ్య మానేరులో 5 టీఎంసీలు..
ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి మూడు నెలల క్రితం నీటిని విడుదల చేశారు. మిషన్ భగీరథ కోసం 5 టీఎంసీలను ఆ రిజర్వాయర్‌లో నిల్వ చేశారు. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో పలు ముంపు గ్రామాల్లోకి నీరు వచ్చిచేరింది. నిర్వాసితుల ఇళ్లు నీట మునిగాయి. దీంతో వారు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, శాభాష్‌పల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, వేములవాడ రూరల్ మండలం రుద్రవరం, అనుపురం, కొడుముంజ, సంకెపల్లి గ్రామాలు మధ్యమానేరులో ముంపునకు గురువుతున్నాయి. ఈ గ్రామాల్లో 11,731 కుటుంబాలు సర్వం కోల్పోతున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరికి పునరావాసం కల్పించేందుకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి నీరు చేరడంతో నిర్వాసితులు పునరావాసకాలనీల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. కొదురుపాక, నీలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఏళ్లుగా ఉంటున్నారు.
నిర్వాసితులకు ఐఏవై (ఇందిరా ఆవాస్ యోజన– గతంలో ఉన్న ఐఏవైని ఇపుడు పీఎంఏవైగా మార్చారు) కింద నిధులు మంజూరు చేయాలని గతనెల 6న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రాజెక్టుల సమీక్షలో హౌసింగ్ ఎండీ చిత్రారామచంద్రన్‌ను నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మంత్రి ప్రకటనతో కొత్తగా ఆర్ అండ్ ఆర్ కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే నిర్వాసితులకు ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు మంజూరవుతాయి. అయితే, తాము అప్పుసప్పు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, సర్కారు ఇచ్చే సొమ్ము సరిపోవడంలేదని నిర్వాసితులు ఆవేదన చెందారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. అంతకుముందున్న ఐఏవై పథకం కింది ఇంటి నిర్మాణాన్ని పీఎంఏవై కిందకు తీసుకొచ్చింది. ఒక్కో ఇంటిపై రూ.50 వేలు పెంచి ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే, ప్రస్తుతం ఈసొమ్ము సరిపోదని, మార్కెట్‌లో ధరలను పోల్చుకుని ఒక్కో ఇంటికి కనీసం రూ.2.50 లక్షలు చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఈపంచాయితీ ఎటూ తేలడంలేదు.
బిల్లుల కోసం ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి..
ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో నిర్వాసితులు నిర్మించుకుంటున్న ఇళ్ల జాబితా రూపొందించేందుకు తహసీల్దార్, పంచాయితీరాజ్ ఏఈతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచన మేరకు బిల్లులు మంజూరవుతాయి. ఇందుకోసం ఈక్రింది ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.
ఇంటి యజమాని ఆధార్ నంబరు
నిర్వాసితుడి బ్యాంకు పాస్‌బుక్
ఇంటి ఎదుట నిర్వాసితుడు దిగిన ఫొటో
వీటిని తహసీల్దార్, పీఆర్ ఏఈ కమిటీకి అందజేయాలి
ఇలా అందిన దరఖాస్తులను కమిటీ ఉన్నతాధికారులకు నివేదిస్తుంది
పరిశీలన పూర్తయ్యాక ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు విడుదలవుతాయి.
నిర్వాసితులు సహరిస్తే చెల్లింపులు
నిర్వాసితులు నిర్మించుకునే ఇళ్లకు మొదట ఐఏవై కింద రూ.70 వేలు వర్తించేవి. ఆ నిధులు సరిపోవడం లేదనే నిర్వాసితుల కోరిక మేరకు ఇళ్ల నిర్మాణాలను పీఎంఏవైగా మార్చాం. దీంతో ఒక్కో ఇంటికి రూ.1.20 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నిర్వాసితులు సహకరిస్తే తక్షణమే బిల్లులు చెల్లిస్తాం.
– జీవీ శ్యాంప్రసాద్‌లాల్, డీఆర్వో
Comments
Please login to add a commentAdd a comment