సాక్షి, సిరిసిల్ల : పరిహారంపై బెంగతో ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో నిర్వాసితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క తంగళ్లపల్లి మండలం చీర్లవంచలో గత మూడు నెలల్లో చిలుక సత్తయ్య, అవదూత్త ప్రకాశ్, ఎడవల్లి నర్సయ్య, మొగులోజు బాలయ్య, వడ్ల బాలయ్య, జోగు దుర్గయ్య మరణించారు. వీరంతా కూడా తక్కువ పరిహారం, పరిహారం చేతికందకపోవడంతో బెంగపడి ప్రాణాలు వదిలినవాళ్లే. పరిహారంలో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. చీర్లవంచకు చెందిన చిలుక సత్తయ్య ఇంటిని మొదటిసారి సర్వే చేసి రూ.3 లక్షల 62 వేలుగా నిర్ణయించి, రెండో సర్వేలో రూ.లక్షా 30 వేలకు కుదించారు. తనకు పరిహారం తక్కువగా వస్తుందనే బెంగతో సత్తయ్య గత నెల రోజుల క్రితం గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.
పదేళ్లయినా అందని పరిహారం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బోయినపల్లి మండలం మాన్వాడలో నిర్మిస్తున్న మిడ్‌మానేరు ప్రాజెక్ట్ కింద 12 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, వరదవెల్లి, మాన్వాడ, వేములవాడ మండలం సంకెపల్లి, ఆరెపల్లి, రుద్రవరం, అనుపురం, కొడిముంజ, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల్‌ఠాణా, ఇల్లంతకుంట మం డలం గుర్రంవానిపల్లి గ్రామాలను ముంపు ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. 11,590 కుటుంబాలు ని ర్వాసితులుగా మారుతున్నట్లు అధికారులు నిర్ధారించా రు. పరిహారం అంచనా వేసేందుకు 2006–07లో అధికారులు ఈ గ్రామాల్లో సర్వే చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క గుర్రంవానిపల్లిలో 210 కుటుంబాలకు మాత్రమే పూర్తిగా రూ.2.39 కోట్లు పరిహారం చెల్లించారు. చాలా గ్రామాల్లో పాక్షికంగా ఇచ్చారు. దాదాపు 6,292 కుటుంబాలకు పరిహారం ఇప్పటికీ అందాల్సి ఉంది.
ఇక పరిహారం అంచనాలోనూ లోపాలున్నట్లు నిర్వాసితులు పేర్కొంటున్నారు. కేటగిరీల వారీగా విద్యార్థికి రూ.53 వేలు, ఇతరులకు రూ.58 వేలు, కూలీకి రూ.2 లక్షల 9 వేలు, వ్యవసాయదారునికి రూ.2 లక్షల 30 వేలుగా నిర్ధారించారు. సర్వే సంవత్సరాలుగా సాగుతుండడంతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పది సంవత్సరాల క్రితం విద్యార్థి, ఇప్పుడు వ్యవసాయదారుడిగా మారినా రూ.53 వేలుగానే నిర్ణయిస్తున్నారు. తాజాగా సమగ్రంగా సర్వే చేసి పరిహారాన్ని నిర్ధారించాలని, త్వరగా చెల్లించి మరో ప్రాణం పోకుండా కాపాడాలని నిర్వాసితులు వేడుకొంటున్నారు.