కొత్తూరు నాలుగు రోడ్లు కూడలిలో ర్యాలీ నిర్వహిస్తున్న నిర్వాసితులు
శ్రీకాకుళం , కొత్తూరు: వంశధార నిర్వాసితులు తమ న్యాయమైన సమస్యలతో పాటు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని కోరుతూ కదంతొక్కారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులైన కొత్తూరు, హిరమండలం, ఎల్.ఎన్.పేట మండలాల్లోని పలు నిర్వాసిత గ్రామాలకు చెందిన వారంతా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తూరు నాలుగు రోడ్లు కూడలి నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ మహసింగి గ్రామం వరకు కొనసాగింది. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి సిర్ల ప్రసాదరావు అధ్యతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ నేతలను నమ్ముకుంటే.. నెట్టేట ముంచేశారని పలు నిర్వాసిత గ్రామాలకు చెందిన వారు వాపోయారు. అక్రమాలకు పాల్పడి అనర్హులకు యూత్, పలు రకాల ప్యాకేజీలు మంజూరు చేశారు తప్ప, అర్హులను విస్మరించారని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్వాసిత సమస్యలు పరిష్కరిస్తారని గెలిపించిన స్థానిక ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి అక్రమార్కులకు అండగా నిలిచారని మండిపడ్డారు.
నిర్వాసితుల పోరాటాల ఫలితమే
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భావితరాల కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. హిరమండలంలో నిరాహర దీక్షలతో పాటు ప్రత్యక్ష పోరాటాలకు నిర్వాసితులు సిద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదరబాదరగా రూ.420 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇది కేవలం పోరాటాలు ఫలితం తప్ప, టీడీపీ నేతలు కృషి మాత్రం కాదని తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం 2013 భూసేకరణ చట్టం అమలు కోసం నిర్వాసితులు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అదే విదంగా గూనభద్ర రిజర్వాయర్ పక్కన ఉన్న పాతకాలనీ 100 మీటర్ల దూరం కంటే తక్కువుగా ఉన్నప్పటకీ ముంపు గ్రామంగా ప్రభుత్వం గుర్తించక పోవడం దారుణమని విమర్శించారు. నిర్వాసితులను నీరుగార్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కుట్రలు పన్నుతున్నా.. అందుకు ధీటుగా బాధితులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కొయిలాపు సంజీవురావు మాట్లాడుతూ నిరాసితులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని, ఐక్య పోరాటాలతోనే వాటిని ఎదుర్కోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి గంగరాపు ఈశ్వరమ్మ, గణపతి, పెద్ద సంఖ్యలో నిర్వాసితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment