రసకందాయంలో బ్రెగ్జిట్ భవితవ్యం? | How did Theresa May's gamble fail? | Sakshi
Sakshi News home page

రసకందాయంలో బ్రెగ్జిట్ భవితవ్యం?

Published Fri, Jun 9 2017 7:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

రసకందాయంలో బ్రెగ్జిట్ భవితవ్యం?

రసకందాయంలో బ్రెగ్జిట్ భవితవ్యం?

లండన్ :
భారీ మెజారిటీ ఆశించి మధ్యంతర ఎన్నికలు జరిపించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే వ్యూహం బెడిసికొట్టింది. ఓట్ల శాతం పెరిగినా ఉన్న మెజారిటీ కోల్పోవడంతో ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రతిపక్షనేత జెరిమీ కార్బిన్ నాయకత్వాన లేబర్ పార్టీ మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి అనూహ్యంగా బలం పుంజుకుంది. ఏ పార్టీకి మెజారిటీ రాని హంగ్ పార్లమెంటుతో ఈ ఎన్నికలకు కారణమైన బ్రెగ్జిట్ సంక్షోభంలో పడింది. తన నేతృత్వంలో కన్సర్వేటివ్ పార్టీ బలం ఏడెనిమిది సీట్లు తగ్గినా థెరిసా పదవికి రాజీనామా చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుకే పట్టుదలతో ఉన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలిగే ప్రక్రియను బ్రిటన్కు లాభసాటిగా చేయడానికి తగిన ఒప్పందం చేసుకోవడానికి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలంటూ టోరీ ప్రధాని ప్రజాతీర్పు కోరిన విషయం తెలిసిందే. మరి ఎన్నికల ఫలితాల వల్ల బ్రెగ్జిట్ సంప్రదింపులు అనుకున్నట్టే ఈ నెల 19న మొదలవుతాయా? ఎలా ముందుకు సాగుతాయి? ఒక వేళ కార్బిన్ ప్రధాని అయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఐరోపా, బ్రిటిష్ ప్రజలను వేధిస్తున్నాయి.

బ్రిటన్‌కు బ్రెగ్జిట్ గుదిబండేనా?
ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడానికి అవసరమైన ఒప్పందంపై చర్చలు అక్కడి రాజకీయ సంక్షోభం కారణంగా ఆలస్యమైతే ఇంగ్లండ్ బాగా నష్టపోతుంది. ఈ విషయాన్నే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ ‘బ్రెగ్జిట్ చర్చలు ఎప్పుడు ఆరంభమౌతాయో తెలియదు. ఎప్పుడు ముగించాలో తెలుసు. సంప్రదింపులు లేకుండా ఒప్పందమే కుదరని పరిస్థితి రాకుండా చేయాల్సింది చేయండి’ అంటూ అధికారం చేపట్టే కొత్త బ్రిటిస్ సర్కారుకు హెచ్చరికను ట్విట్టర్ ద్వారా జారీచేశారు. బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రభుత్వం కిందటి మార్చిలో 50వ అధికరణను అమలులోకి తేవడంతో చర్చలు సకాలంలో ప్రారంభించి ఈయూతో ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ఒప్పందం చేసుకున్నా లేకున్నా ఈ అధికరణ కారణంగా రెండేళ్లలో అంటే 2019 మార్చి ఆఖరుకు బ్రిటన్ ఈయూ నుంచి బయటపడుతుంది. చర్చలు జరిపి ఈలోగా ఒప్పదం చేసుకుంటే లబ్ధిపొందుతుంది. లేకపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందకుండానే ఈయూ నుంచి తప్పుకోవాలి.

థెరిసాకు ఐరిష్ డీయూపీ తోడైతే కొంత మేలే!
బ్రెగ్జిట్‌కు అనుకూలమైన ఉత్తర ఐర్లండ్కు చెందిన డెమొక్రాటిక్ యూనియనియనిస్ట్ పార్టీ(డీయూపీ-10 సీట్లు)తో కలిసి కన్సర్వేటివ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయూతో జరిపే చర్చలు కొంత మెరుగైన ఫలితాలు సాధించే వీలుంది. స్కాట్లండ్ స్వాతంత్ర్యమే లక్ష్యంగా పుట్టిన స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎసెన్పీ) బ్రెగ్జిట్ కు వ్యతిరేకం. హంగ్ పార్లమెంటులో 34 సీట్లున్న ఈ పార్టీ మాటనూ వినక తప్పదు. ఇక లేబర్ నేత కార్బిన్ కూడా బెగ్జిట్కు వ్యతిరేకమే. జనాభిప్రాయం వెల్లడయ్యాక ఆయన బ్రెగ్జిట్ను అమలు చేస్తాననే చెబుతున్నారు. అధికారంలోకి వస్తే మొదట బ్రెగ్జిట్ పై జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మాక్రాన్తో చర్చలు జరుపుతానని ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రకటించారు. ఈయూతో చర్చల సమయంలో బ్రిటిష్ కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలనేదే లేబర్ వాదన.

బ్రెగ్జిట్ నుంచి ఇతర అంశాలపై దృష్టి మళ్లినందుకే...!
ఇంగ్లండ్కు లాభదాయకమైన బ్రెగ్జిట్ కోసం అధిక మెజారిటీ ఇవ్వాలంటూ ప్రజాతీర్పు కోరిన థెరిసా మే ఎన్నికల ప్రచారంలో నెమ్మదిగా ఈ ప్రధానాంశానికి దూరమై ఇతర వివదాస్పద విషయాలను ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ఇతరత్రా రంగం మీదకు తేవడంతో ఏప్రిల్ 20 నాటి జనాదరణను కోల్పోయారు. వృద్ధులకు మేలు చేసే ఆరోగ్య పరిరక్షణ పథకాలకు ప్రభుత్వ సహాయం తగ్గించడం, పోలీసు శాఖకు నిధులు, నియామకాల్లో కోత విధించడం వంటి అనేక అంశాలు కన్సర్వేటివ్ పార్టీకి తగిన మెజారిటీ రాకుండా చేశాయి. ఏదేమైనా బ్రెగ్జిట్ పేరిట జరిగిన ఎన్నికలు పాలకపక్షం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం విశేషం.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement