లగ్జరీ, బ్రాండెడ్ కార్లపై భారీగా ధర తగ్గింపు
లగ్జరీ, బ్రాండెడ్ కార్లపై భారీగా ధర తగ్గింపు
Published Sat, Apr 22 2017 8:49 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM
న్యూఢిల్లీ : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి, గతేడాది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ బ్రెగ్జిట్ పరిణామాలు ఆ దేశంలో ఎలా ఉన్నాయో కాని, భారత్కు మాత్రం బాగానే ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. బ్రాండెడ్, ఖరీదైన లగ్జరీ కార్లపై భారీగా ధరలు తగ్గాయి. బ్రిటన్కు చెందిన ప్రతిష్టాత్మక కార్ల దిగ్గజాలన్ని భారత్లో భారీగా ధరలు తగ్గించేశాయి. రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్, ఫెర్రరి వంటి సంస్థలు తమ కార్లపై ధరలను 20 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా తగ్గించినట్టు వెల్లడైంది. ఇంత భారీ మొత్తంలో ధరలు తగ్గించడానికి కారణం బ్రెగ్జిట్ నిర్ణయం అనంతరం పౌండ్ విలువ భారీగా పతనం కావడమే.
రూపాయితో పోలిస్తే పౌండ్ విలువ ఏడాది వ్యవధిలోనే 20 శాతం దిగజారింది. దీంతో బ్రిటన్కు చెందిన తయారీసంస్థలు భారత్కు ఎగుమతి చేయడానికి ధరలు చౌకగా మారాయి. బ్రిటిష్ కరెన్సీలోనే భారత్ అమ్మకాలను గణిస్తారు. ఇలా ఎగుమతులు చౌకగా మారడంతో ఈ ప్రయోజనాలను భారత్లోని వినియోగదారులకు అందించాలని నిర్ణయించినట్టు కంపెనీలు చెబుతున్నాయి. 5 శాతం నుంచి 15 శాతం ధరలు కోత పెట్టి, ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాయి. రెండు కోట్లకు పైగా ధర ఉన్న కార్ల విక్రయాలు భారత్లో 2016లో 200 యూనిట్లు నమోదయ్యాయి. దీనిలో సగానికి పైగా కార్లు బ్రిటన్కు చెందినవే కావడం విశేషం. భారత్లో జీఎస్టీ అమలైతే, మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పాటుచేసి వృద్ధిని నమోదుచేసుకుంటామని ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుడు లలిత్ చౌదరి చెబుతున్నారు. గత ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలను భారీగా తగ్గించిందని పేర్కొన్నారు.
ఏ కారుపై ఎంత తగ్గింది....
కారు అసలు ధర ప్రస్తుత ధర
రేంజ్ రోవర్ స్పోర్ట్ 1.35 కోట్లు 1.04 కోట్లు
రేంజ్ రోవర్ వోగ్ 1.97 కోట్లు 1.56 కోట్లు
ఫెర్రరి 488 3.9 కోట్లు 3.6 కోట్లు
రోల్స్ రాయిస్ ఫాంటమ్ 9 కోట్లు 7.8-8.0 కోట్లు
రోల్స్ రాయిస్ గోస్ట్ 5.25 కోట్లు 4.75 కోట్లు
ఆస్టన్ మార్టిన్ డీబీ11 4.27 కోట్లు 4.06 కోట్లు
Advertisement
Advertisement