బ్రెగ్జిట్ తో ఇండియాకు లాభమేనట..!
ఒక వైపు బ్రెగ్జిట్ వల్ల ప్రపంచ మార్కెట్ల కోటానుకోట్ల సంపద తుడిచిపెట్టుకుపోవడంతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోఉంటుందని విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తున్నారు. మరోవైపు ఈ విపత్కర పరిణామం వల్ల భారత దేశానికి వచ్చి ముప్పు ఏమీ లేదని, పైగా ముఖ్యమైన లబ్దిదారుగా అవతరించనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్రెగ్జిట్ పరిణామం మూలంగా రాబోయే కాలంలో భారత్ కు అంతా మంచి జరగనుందని ఎస్ బ్యాంక్ సీఈవో రానా కపూర్ వ్యాఖ్యానించారు. చాలా తక్కువ సమయంలోనే మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత ఆర్థిక సంబంధాల్లో ప్రతికూల వెల్లువ ఉంటుందని తెలిపారు తదుపరి ఆరు నెలల్లో అమెరికాలో వడ్డీ రేటు పెంపులో ఆలస్యం కూడా దీనికి మరింత తోడ్పడుతుందన్నారు. ఈ అసమంజసమైన అస్థిరతను ఎదుర్కొనే సత్తామన పాలకులకు ఉందంటూ, ప్రభుత్వం సంస్థాగత ఆర్థిక సంస్కరణలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తమ పెట్టుబడులకు ఇండియాను కేంద్రంగా ఎంచుకుంటారని, వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారులు భారత్ వైపు మొగ్గు చూపుతారని జోస్యం చెప్పారు. కనుక ఈ పరిణామం బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ లాంటిదని సీఈవో కపూర్ శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాలుగా, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, భారతదేశం మాత్రం స్థిరంగా నిలబడిందన్నారు. సంస్థాగత, నిర్మాణ చర్యల ద్వారా తన ఆర్థిక సత్తాను చాటుకుందని కపూర్ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సరళీకరణ, జీఎస్టీ బిల్లు లాంటి కీలక సంస్కరణల్లో ప్రభుత్వం పట్టుదల భారతదేశ అభివృద్ధికి సహాయపడుతుందన్నారు. . అలాగే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలగే అంశం పూర్తిగా ఊహించనిది కాదనీ, ఈ ఆందోళన మొత్తం తదుపరి వారాంతానికి మాయమవుతుందని కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.