బ్రిటన్తో లింకుంటే కుదేలే!! | Sensex, Nifty fall most since February on Brexit tremors; Tata Motors plunges 7.99% | Sakshi
Sakshi News home page

బ్రిటన్తో లింకుంటే కుదేలే!!

Published Sat, Jun 25 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

బ్రిటన్తో లింకుంటే కుదేలే!!

బ్రిటన్తో లింకుంటే కుదేలే!!

టాటా మోటార్స్‌కు దశ తిరిగిందల్లా లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొన్నాకే. లాభాల వర్షం మొదలయ్యింది కూడా ఆ టేకోవర్ తరవాతే.

పలు కంపెనీల షేర్లు దారుణంగా పతనం
మధ్యాహ్నానికి పరిస్థితి మార్పు;
కాస్త రికవరీ కలసి వచ్చిన దేశీయ సంస్థల కొనుగోళ్లు

టాటా మోటార్స్‌కు దశ తిరిగిందల్లా లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొన్నాకే. లాభాల వర్షం మొదలయ్యింది కూడా ఆ టేకోవర్ తరవాతే. కాకపోతే ఇపుడు జేఎల్‌ఆర్ వ్యాపారంలో 20 శాతం బ్రిటన్లోనే ఉంది. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వెళ్లిపోవటం ఖాయమవటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేరు విపరీతమైన కుదుపులకు లోనయింది. ఒక దశలో 15 శాతం వరకూ పడిపోయింది. తరవాత కొంత తేరుకుంది. ఇదే కాదు. బ్రిటన్లో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలన్నిటి పరిస్థితీ ఇదే. ఆ మాటకొస్తే బ్రిటన్‌తో ఏమాత్రం సంబంధంలేని కంపెనీల పరిస్థితీ ఇదే. స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా పతనమై... అంతలోనే తేరుకున్నాయి. ఆయా కంపెనీల పరిస్థితిని చూస్తే...

 ఫార్మా షేర్లు బేర్: యూరప్‌తో వ్యాపార సంబంధాలున్న బారత  ఫార్మా కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. ఇంట్రాడేలో 3-8% నష్టపోయిన ఫార్మా షేర్లు... చివర్లో కాస్త కోలుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే పౌండ్ మారకం విలువ 10% పతనం కావడంతో... ఈ మేరకు ఫార్మా కంపెనీల ఆదాయం క్షీణిస్తుందని అంచనా. యూరప్ నుంచి అరబిందో ఫార్మాకు 22%, టొరంట్ ఫార్మాకు 13%, గ్లెన్‌మార్క్‌కు 9%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌కు 5%, లుపిన్‌కు 3% చొప్పున ఆదాయాలు వస్తున్నాయి.

 ఐటీ కాస్తంత తక్కువే: పలు భారత ఐటీ కంపెనీలకు యూరప్ నుంచి... ముఖ్యంగా ఇంగ్లండ్ నుంచే ఆర్డర్లు వస్తున్నాయి. భారత ఐటీ- ఐటీఈఎస్ రంగాలకు యూరప్ రెండో అతి పెద్ద మార్కెట్. 10వేల కోట్ల డాలర్ల ఐటీ పరిశ్రమలో 30 శాతం ఆదాయం యూరప్ నుంచే వస్తోంది. దీంతో యూరప్ నుంచి అధికాదాయం వచ్చే ఐటీ కంపెనీలు.... టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 నుంచి 5% మధ్య నష్టపోయాయి.

 వాహనాలది నష్టాల పరుగు: బ్రెగ్జిట్ కారణంగా వాహన విక్రయాలు తగ్గుతాయనే అంచనాలున్నాయి. దీంతో యూరప్‌తో వ్యాపార సంబంధాలున్న వాహన షేర్లు 10% వరకూ నష్టపోయాయి. టాటా మోటార్స్ 8% నష్టపోయింది. ఇది ఇంట్రాడేలో 15% పడిపోయింది. జేఎల్‌ఆర్‌కు కావలసిన విడిభాగాల్లో 40%న్ని యూరప్ నుంచే సమీకరిస్తున్నారు.

 లోహ షేర్లు విలవిల: టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత... ఈ లోహ షేర్లన్నీ 5-7 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. బ్రెగ్జిట్ వల్ల ఈ కంపెనీల అమ్మకాలు తగ్గుతాయని, కార్యకలాపాల వ్యయాలు పెరుగుతాయని అంచనాలున్నాయి.

 ఈ రికవరీకి కారణాలను చూస్తే: బ్రెగ్జిట్‌ను ఎవ్వరూ ఊహించలేదు కనక ఒక్కసారిగా మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడే స్థాయిలో వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. అయితే మధ్యాహ్నం ఆరంభమైన యూరప్ మార్కెట్లు ఊహించినంత పతనం కాలేదు. కొంత రికవరీ కూడా అయ్యాయి. ఇది కాస్త ఊతమివ్వగా... దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరపడంతో మార్కెట్ కొంత కోలుకుంది.

మార్కెట్ల పతనం ఎప్పుడెక్కువ?
2008 ఆర్థిక సంక్షోభాన్ని తలపిస్తోన్న బ్రె గ్జిట్

అది 2008, సెప్టెంబర్-15. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి కారణం లేమన్ బ్రదర్స్ దివాలా తీయడమే. ఇప్పుడు ఆ ఘటనలను గుర్తుకు తెస్తోంది బ్రెగ్జిట్ ఉదంతం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమించడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2008తో పోలిస్తే ఇప్పటి బ్రిటన్ బ్రెగ్జిట్‌తో కారణంగానే కొన్ని ప్రపంచ మార్కెట్లు పాయింట్ల పరంగా ఎక్కువగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే మాత్రం ఆ సమయంలోనే మార్కెట్లు ఎక్కువగా పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement