♦ భవిష్యత్తులో సవాళ్లతోపాటు అవకాశాలు
♦ నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రెగ్జిట్ వల్ల 108 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగంలో స్వల్పకాలంలో అనిశ్చితి తప్పదని నాస్కామ్ హెచ్చరించింది. దీర్ఘకాలంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉంటాయని వెల్లడించింది. ‘భారత్‌కు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో యూరప్ ఒకటి. మనకు రెండో అతిపెద్ద మార్కెట్. దేశీ ఎగుమతుల్లో 30 శాతం యూరప్‌దే. ఈ విపణిలో యూకే చాలా కీలకం. యూరోపియన్ యూనియన్‌లో పెట్టుబడులకు యూకే ద్వారంగా నిలుస్తోంది’ అని నాస్కామ్ వివరించింది.
స్వల్పకాలంలో ప్రభావమిలా..
♦ పౌండ్ విలువ పడిపోవచ్చు. క్లయింట్లను సంప్రతించి కాంట్రాక్టు విలువ సర్దుబాటు చేసుకోకపోతే కంపెనీ ఆదాయం తగ్గుతుంది.
♦ ఈయూలో భారీ ప్రాజెక్టులు అనిశ్చితిలో పడతాయి.
♦ ఈయూ కోసం ప్రత్యేకంగా కార్యాలయాలు, కార్యకలాపాలను భారత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలో యూకే నుంచి కొంత పెట్టుబడుల ఉపసంహరణ జరగొచ్చు.
♦ నిపుణులైన మానవ వనరులను ఈయూ, యూకేకు సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు.
♦ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకుల మార్పుల వల్ల కరెన్సీపై ప్రభావం.
స్పష్టత ఇవ్వాలి..: చంద్రశేఖర్
బ్రసెల్స్, లండన్‌లోని విధాన నిర్ణేతలు తదుపరి చర్యలపై సాధ్యమైనంత త్వరగా స్పష్టతనిస్తే యూకే, యూరప్‌లో పెట్టుబడులు కొనసాగించేందుకు నమ్మకం ఏర్పడుతుందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. రెఫరెండం వల్ల ఏర్పడే వ్యతిరేక ప్రభావం తగ్గించేందుకు యూకే కట్టుబడి ఉందన్న విషయం అక్కడి విధాన నిర్ణేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందన్నారు. యూకేలోని 800 భారత కంపెనీల్లో 1,10,000 మంది స్థానికులు పనిచేస్తున్నారు. కాబట్టి భారత్‌తో పటిష్టమైన భాగస్వామ్యం కోసం బ్రిటన్ ఆసక్తి చూపవచ్చు. ఈయూకు చెందిన ఇతర సభ్యదేశాల మానవ వనరులపై యూకే పెద్దగా ఆధారపడలేదు. ఈ క్రమంలో భారత్‌తో సహా ఈయూయేతర దేశాల నిపుణులకు యూకే ద్వారాలు తెరిచినట్టే’ అని అన్నారు.
ఐటీకి ప్రతికూలం:గోపాలకృష్ణన్
స్వల్పకాలంలో మన ఐటీ రంగానికి ప్రతికూలమేనని ఇన్ఫోసిస్ మాజీ సీఈవో ఎస్.గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. అనిశ్చితి పరిశ్రమకు శ్రేయస్కరం కాదన్నారు.