ఐటీ పరిశ్రమకు ఢోకా లేదు: నాస్కామ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల వలసలపై కఠిన ఆంక్షలు విధించడం, ఆటోమేషన్ ఊహించని దానికన్నా వేగంగా విస్తరిస్తుండడం, మూకుమ్మడి లేఆఫ్‌లంటూ వదంతులు వ్యాపించడంతో 15,000 కోట్ల డాలర్ల భారతీయ ఐటి పరిశ్రమ వణుకుతోంది. దీనిపై అపోహలు తొలగించేందుకు నాస్కామ్ ప్రయత్నిస్తోంది. ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకున్నట్లయితే ఐటీ పరిశ్రమకు కూడా ఢోకా ఏమీ లేదని చైర్మన్ రామన్ రాయ్ తెలిపారు.
2018 ఆర్థిక సంవత్సరాని భారత్‌లో కొత్తగా 1,50,000 ఐటీ ఉద్యోగులు పెరుగుతారని నాస్కామ్ అంచనా వేసింది. గతేడాది 1,70,000 ఐటీ ఉద్యోగులు పెరిగారని, దానితో పోలిస్తే తగ్గే ఉద్యోగాలు 20 వేలు మాత్రమేనని తెలిపింది. 2025 సంవత్సరం నాటికి ఐటీ పరిశ్రమ 35,000 కోట్ల డాలర్లకు కూడా పెరుగుతుందన్నది అంచనా. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ లక్ష్యాలను సవరించుకుంటే ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు ఉండవని బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలసి పనిచేస్తున్న నాస్కామ్ తెలిపింది. ఏ కంపెనీ కూడా అనుభవజ్ఞులైన ఉద్యోగులను వదులుకోదని ఐటీలో ఐదవ పెద్ద కంపెనీ అయిన టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ కూడా స్పష్టం చేశారు. పనితీరు, సామర్థ్యంలేని కారణంగా ఉద్యోగాలు పోయే వారి సంఖ్య కూడా రానున్న సంవత్సరంలో 0.5 శాతం నుంచి 3 శాతానికి మధ్యనే ఉంటుందని నాస్కామ్ తెలిపింది.