సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెకీలకు ‘డేంజర్ బెల్స్’మోగుతున్నాయి. ఐటీ రంగానికి సంబంధించి 2022లోనే ప్రారంభమైన ప్రతికూల పరిస్థితులు 2023 లోనూ కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లే ఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. గత ఏడాది (2022) కాలంలో ప్రపంచంలోని వెయ్యికి పైగా కంపెనీలు మొత్తం 1,54,336 మందికి ఉద్వాసన పలికాయి.
ఇక కోటి ఆశలతో కొత్త ఏడాది మొదలైన తొలి పదిహేను రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటించాయి. దీంతో 25 వేల దాకా ఐటీ ఉద్యోగులు అంటే.. రోజుకు సగటున 1,600 మందికి పైగా టెకీలు లే ఆఫ్‌ల బారిన పడ్డారు. గతేడాది నుంచి లేఆఫ్‌లు ప్రకటించిన వాటిలో అనేక భారతీయ కంపెనీలతో పాటు పలు స్టార్టప్‌లు కూడా ఉన్నట్టు తేలింది. లే ఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లే ఆఫ్స్.ఎఫ్‌వైఐ’ తన తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
తొలి ప్రభావం ఐటీ రంగంపైనే..!
ఆర్థిక రంగం ఒడిదుడుకులకు గురవుతున్నప్పుడు, ఆర్థికమాంద్యం పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు మొదటగా ప్రభావం పడేది ఐటీ రంగం పైనే. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడానికి ఇదే కారణం. ఆర్థికరంగ స్లోడౌన్‌కు సూచికగా ప్రస్తుత పరిణామాలను పరిగణించాలి. 2001లోనూ ఇలాంటి పరిస్థితులు సంభవించాయి. ఇండియన్ ఐటీ కంపెనీలకు ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్‌లు తగ్గిపోతాయి కాబట్టి ఖర్చు తగ్గించుకునేందుకు లేఆఫ్‌ల వైపు మొగ్గు చూపుతాయి.
ఆర్థికమాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలు రాగానే ఐటీ కంపెనీలు ముందుగా ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటాయి. అలాగే ఇప్పుడు కూడా లాభాల మార్జిన్లు తగ్గిపోయే కొద్దీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అధిక జీతాలిచ్చే ఉద్యోగుల సంఖ్యను కంపెనీలు కుదించుకుంటున్నాయి. క్యాంపస్ సెలక్షన్లలో భాగంగా ఎంపిక చేసుకున్నవారి నియామక ఉత్తర్వులను సైతం కొన్ని సంస్థలు రద్దు (క్యాన్సిల్) చేస్తున్నాయి.
ఓలా నుంచి అమెజాన్ వరకు..
అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా స్వదేశీ సామాజిక మాధ్యమ కంపెనీ షేర్‌చాట్ 20 శాతం వర్క్‌ఫోర్స్‌ను లేఆఫ్ చేసింది. దాదాపు 500 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడింది. ట్విట్టర్, గూగుల్, స్నాప్, టైగర్ గ్లోబల్ కంపెనీలు 2,300 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఓలా (200 మంది తొలగింపు) వంటి కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించగా, వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్.ఏఐ ఈ నెలలో చాలా మందిని తొలగించింది. నిత్యావసర సరుకుల డెలివరీ సంస్థ ‘డంజో’తన కాస్ట్ కట్టింగ్ (ఖర్చు తగ్గింపు) చర్యల్లో భాగంగా 3 శాతం వర్క్‌ఫోర్స్‌ను తొలగించింది. అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందిని (భారత్‌లో వెయ్యి మంది) లే ఆఫ్ చేసింది.
6 నెలల దాకా లేఆఫ్‌ల ట్రెండ్
ఆర్థిక మాంద్యం, సమస్యలు ఎదురైనప్పుడు పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా పెద్ద కుదుపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో వీటిల్లో లే ఆఫ్‌ల ట్రెండ్ మూడు నుంచి ఆరునెలల దాకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత 3, 4 ఏళ్లుగా ఐటీ కంపెనీల్లో సరైన పద్ధతులు, విధానాల్లో హైరింగ్ జరగనందున ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుంది. రిక్రూట్‌మెంట్ సవ్యంగా జరగకపోవడం, భారీ ప్యాకేజీలు ఆఫర్ చేయడం వంటివి జరిగినపుడు రెండేళ్లకోసారి దిద్దుబాట్లు జరుగుతుంటాయి. మరోవైపు ఆశించిన మేర ఇతర దేశాల నుంచి ఔట్‌సోర్సింగ్ బిజినెస్, బ్యాకెండ్ సపోర్ట్ వంటివి రాకపోవడం మన దేశంపై ప్రభావం చూపిస్తుంది.
– డా.బి.అపర్ణా రెడ్డి,హెచ్‌ఆర్ నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment