సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు
Published Sat, Jul 8 2017 9:31 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
ముంబై : ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇక అబ్బాయి తల్లిదండ్రులైతే, తమ కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పిలిచి మరీ పిల్లను ఇస్తారంటూ తెగ భరోసాతో ఉండేవారు. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఎక్కువగా తమ అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే బాగుండును అనుకుంటూ జల్లెడ వేసి మరీ సాఫ్ట్‌వేర్‌లను వెతికి పట్టుకుని తమ కూతురికిచ్చి కట్టబెట్టేవారు. అయితే తాజాగా ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న లేఆఫ్స్ బెడద, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కొత్తగా పెళ్లి కష్టాలు తెచ్చిపెడుతోంది. మ్యారేజ్ మార్కెట్లో వారికి ఉన్న పాపులారిటీ అంతకంతకు పడిపోతుందని మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ట్రెండ్‌లు వెల్లడిస్తున్నాయి.
ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న భారీగా ఉద్యోగాల కోత, ఆటోమేషన్ ప్రభావం, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత కల్లలవుతున్న డాలర్ కలలు వీరి డిమాండ్‌కు గండికొడుతున్నాయి. ముఖ్యంగా అరేంజ్ మ్యారేజ్‌ల విషయంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందట. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే కూతురి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నే అల్లుడిగా కోరుకునేవారు, ఇప్పుడు ఉద్యోగంఎప్పుడు ఊడుతుందో తెలియని వారికి పిల్లను ఎలా ఇచ్చేది అంటూ వెనుకకు జంకుతున్నారని మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, బిజినెస్ అల్లుళ్ల కోసం అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువగా కాల్ చేస్తున్నారని తెలిసింది.
2017 ప్రారంభం నుంచి ఐటీ ప్రొఫిషనల్స్ ను అమ్మాయిలు తక్కువగా కోరుకుంటున్నారని షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తెలిపారు. భారత్‌లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో షాదీ.కామ్ కూడా ఒకటి. ఇక అమెరికాలో సెటిలైన జీవిత భాగస్వాములను కూడా అమ్మాయిలు తక్కువగా చూస్తున్నారని చెప్పారు. ఈ ట్రెండ్ నవంబర్ నుంచి కొనసాగుతుందన్నారు. ఈ తగ్గింపు నవంబర్‌లో 11 శాతముంటే, ఫిబ్రవరికి వచ్చే సరికి ఇదీ మరింత తగ్గి 15 శాతానికి చేరుకుందని గౌరవ్ తెలిపారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడుతున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసే వారు స్వదేశ బాటపడుతున్నారు. షాదీ.కామ్‌లోనే కాక, జీవన్‌సాథి.కామ్‌లో కూడా ఇదే ట్రెండ్. దీంతో ఐటీ ప్రొఫిషనల్స్‌కు లేఆఫ్స్ ఇబ్బందులు మాత్రమేకాక, కొత్త కష్టాలు వస్తున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement