multinational companies
-
జీసీసీల్లో హైరింగ్ జోరు
బడా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) తమ సొంత అవసరాల కోసం దేశీయంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు జోరుగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారిగా ఐటీ సేవల కంపెనీలను మించి వీటిలో హైరింగ్ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి క్యూ1లో 46 శాతం అధికంగా జీసీసీల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది బహుళజాతి సంస్థలు భారత్‌లో కొత్తగా జీసీసీలను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని విస్తరించడంపై అంతర్జాతీయ కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సరీ్వసుల విభాగంలో సిబ్బంది సంఖ్య నికరంగా 50,000 పైచిలుకు పెరగ్గా జీసీసీల్లో 60,000 పైచిలుకు స్థాయిలో వృద్ధి చెందిందని వివరించాయి. అంతే గాకుండా ఐటీ సరీ్వసుల కంపెనీలతో పోలిస్తే కేపబిలిటీ సెంటర్లలో వేతనాలు 30–40 శాతం అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉండగా.. వచ్చే ఏడాదినాటికి ఇది 1,900కి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. 70వేల పైచిలుకు నియామకాలు..పరిశ్రమ వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు) నియామకాలకు ఎంఎన్సీల జీసీసీల్లో డిమాండ్ 20–25 శాతం మేర పెరిగింది. బహుళజాతి సంస్థలు తక్కువ వ్యయాలతో అవసరాల మేరకు కార్యకలాపాలను విస్తరించుకునే వెసులుబాటుపై దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమనది విశ్లేషణ . ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో జీసీసీలు 70,000 వరకు గిగ్ వర్కర్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపారపరమైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఫుల్–టైమ్ ప్రాతిపదికన కన్నా ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలను బట్టి తక్కువ వ్యయాలతో ఎంతమందినైనా తీసుకోవడానికి అవకాశం ఉండటం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫుల్–టైమ్ ఉద్యోగులతో పోలిస్తే గిగ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా కంపెనీ సగటున 25–40 శాతం వరకు వ్యయాలను ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నాయి. తాత్కాలిక, ప్రాజెక్ట్–ఆధారిత థర్డ్ పార్టీ నియామకాల విధానంలో మానవ వనరుల విభాగంపరమైన వ్యయాలు, హైరింగ్..ఆన్‌బోర్డింగ్ వ్యయాలు, అడ్మిని్రస్టేషన్ వ్యయాలు, ఎప్పటికప్పుడు వేతనాల పెంపు మొదలైన భారాలను కంపెనీలు తగ్గించుకోవచ్చని వివరించాయి. కొన్ని వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మొత్తం జీసీసీ సిబ్బందిలో 8 శాతంగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య వచ్చే 12 నెలల్లో సుమారు 11.6 శాతానికి చేరనుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పలు బహుళజాతి కంపెనీలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన ఆదివారం జెడ్డాలోని పలు సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయ జనరల్ డైరెక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రాయెస్‌తో జరిగిన భేటీలో శ్రీధర్ బాబు తెలంగాణ విధానాలు, ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం తదితర అంశాలను వివరించారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రసాయనాలు, ఇంధన రంగాలకు సంబంధించి అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా పేరుపొందిన ఆరాంకో సంస్థ ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆల్ షరీఫ్ గ్రూప్ హోల్డింగ్స్ సంస్థ సీఈవో ఆల్ షరీఫ్ నవాబ్ బిన్ ఫైజ్ బిన్ అబ్దుల్ హకీమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్ట్స్ ఇంజనీర్ సులైమన్ కేతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమై పెట్టుబడులపై చర్చించారు. ఈ సంస్థ విద్యుత్, ఆతిథ్య, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, ఆవిష్కరణ రంగంలో అగ్రగామిగా ఉంది. సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో సహా పలువురితో భేటీ ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ సెడ్కో కేపిటల్స్ ప్రతినిధులతో, జెడ్డా చాంబర్స్‌తో, ఆహార ఉత్ప త్తుల దిగ్గజ సంస్థ అయిన సవోలా గ్రూప్ సీఈవో వలీద్ ఫతానాతో, సౌదీ బ్రదర్స్ కమర్షియల్ కంపెనీ సీఈవో, బోర్డ్ సభ్యులతో పెట్రోమిన్ కార్పొరేషన్ ప్రతినిధులతో, బెట్టర్జీ హోల్డింగ్ కంపెనీ చైర్మన్ మాజెన్ బెట్టర్జీతోనూ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అనువైన పరిస్థితులను వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, నాణ్యమైన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి కనబర్చినట్టు మంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. -
బహుళజాతి కంపెనీల ‘డిగ్రీ’ రూట్
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తిరిగి మంచి రోజులొస్తున్నాయి. బహుళజాతి కంపెనీలు కూడా డిగ్రీ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలకు ఆసక్తి చూపుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల తరహాలోనే ఇక్కడా నిపుణులైన వారికి మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) గత ఏడాది నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. గత ఏడాది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారిలో కంప్యూటర్ కాంబినేషన్ ఉన్న డిగ్రీ కోర్సులు చేసిన వారు 43శాతం ఉన్నట్టు గుర్తించారు. విప్రో, అమెజాన్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో గరిష్టంగా రూ.16 లక్షలు, కనిష్టంగా రూ.4 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్టు తేలింది. తెలంగాణలోనూ 45వేల మంది బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి ఈ ట్రెండ్ ఐదేళ్ల క్రితమే మొదలైందని.. గత ఏడాది నుంచి ఊపు వచ్చిదని నిపుణులు చెప్తున్నారు. డిగ్రీ స్వరూప స్వభావం మారుతోందని, అందుకే ఇప్పుడు వీటిని నాన్–ఇంజనీరింగ్ కోర్సులుగా పిలుస్తున్నారని ఉన్నత విద్య వర్గాలు అంటున్నాయి. టెక్నాలజీ ఆధారిత కోర్సులతో.. తెలంగాణవ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు డిగ్రీ సీట్లున్నాయి. ఏటా 2.25 లక్షల సీట్ల వరకూ భర్తీ అవుతున్నాయి. ఇందులో చాలా మంది కంప్యూటర్ సాంకేతికత కోర్సులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణ కోర్సుతోపాటు ఏదైనా డిమాండ్ ఉన్న కాంబినేషన్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు బహుళజాతి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీకాం కంప్యూటర్స్ చేసిన వారికి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. కోవిడ్ తర్వాత అన్ని విభాగాల్లో యాంత్రీకరణ ప్రభావం కనిపిస్తోంది. అన్ని కంపెనీలు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలను అభివృద్ధి చేసుకున్నాయి. డేటా ఎనాలసిస్, మార్కెటింగ్ ట్రెండ్స్, ఆడిట్ కోసం సాంకేతిక నిపుణులు అవసరం. బీకాం చేసినవారికి ఆడిట్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటున్నాయి. పెద్ద ఆడిటర్ల కన్నా బీకాం పూర్తిచేసే ఆడిటర్లను అసిస్టెంట్లుగా కంపెనీలు నియమించుకుంటున్నాయి. మూడో వంతు మందికి.. తెలంగాణవ్యాప్తంగా గత ఏడాది 76వేల మంది కామర్స్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వచ్చారు. వారిలో 24వేల మంది వరకు అసిస్టెంట్ ఆడిటర్లు, అనలిస్టులుగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. గత సంవత్సరం బీఏ నేపథ్యంతోపాటు కంప్యూటర్స్ ఆప్షన్‌తో ఉత్తీర్ణులైన విద్యార్థులు 18 వేల మంది మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాలు పొందినట్టు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యం ఉండటం, వారిని తక్కువ వేతనంతో తీసుకున్నా వీలైనంత త్వరగా శిక్షణ ఇచ్చి అనుకూలంగా మార్చుకోవచ్చని కంపెనీలు భావిస్తుండటమే దీనికి కారణం. విద్యార్థులు కూడా మొదట్లో తక్కువ వేతనాలకే చేరుతున్నా.. నైపుణ్యం పెరిగితే మంచి వేతనం వస్తుందని ఆశిస్తున్నారు. రాజధానికే పరిమితం... ఇప్పటికీ నాణ్యమైన డిగ్రీ విద్య కేవలం హైదరాబాద్, పరిసర ప్రాంతాలకే పరిమితమైంది. మంచి వేతనంతో ఉద్యోగం పొందుతున్నవారిలో ఇక్కడి కాలేజీల్లో చదివినవారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 83 కాలేజీల నుంచి డిగ్రీ విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని డిగ్రీ కాలేజీల్లో నాణ్యత పెరగడం లేదు. క్యాంపస్ సెలక్షన్‌కు వెళ్ల కంపెనీలు కూడా హైదరాబాద్ ప్రాంత డిగ్రీ కాలేజీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. డిగ్రీలో విద్యార్థుల్లో 43శాతం హైదరాబాద్, పరిసరాల్లోకి కాలేజీల్లోనే చేరుతున్నారు. ఇక్కడ డిగ్రీ చేస్తూనే పార్ట్‌టైం జాబ్ చేసుకోవచ్చనే ఆలోచన, చదువుకునే సమయంలో ఇతర కోర్సులు చేయడానికీ హైదరాబాద్ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశమే దీనికి కారణం. విద్యార్థుల చేరిక ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉండే వివిధ కాంబినేషన్ల కోర్సులను హైదరాబాద్‌లోని డిగ్రీ కాలేజీలు ప్రవేశపెట్టగలుతున్నాయి. ఇలా డేటాసైన్స్, ఆనర్స్ వంటి కోర్సులు హైదరాబాద్ పరిధిలోనే విజయవంతంగా కొనసాగుతున్నట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు కూడా చెప్తున్నాయి. భవిష్యత్‌లో అన్ని జిల్లాల్లోని డిగ్రీ కాలేజీల్లోని కోర్సుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. నైపుణ్యమే డిగ్రీ విద్యార్థులకు నజరానా డిగ్రీ విద్యార్థులను నియమించుకునేందుకు పెద్ద కంపెనీలు ఇష్టపడుతున్నాయి. వీరిలో ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానమైన నైపుణ్యం ఉంటుందని భావిస్తున్నాయి. వారిని తేలికగా తమ కంపెనీ అవసరాలకు తగినట్టుగా మలుచుకోవచ్చనే అభిప్రాయం కూడా ఉంది. డిగ్రీలో వస్తున్న కాంబినేషన్ కోర్సుల వల్ల నైపుణ్యం పెరిగింది. తక్కువ వేతనాలతో ఉద్యోగులను తీసుకునే కంపెనీలు కూడా డిగ్రీ విద్యార్థులను ఇష్టపడుతున్నాయి. వారు అంత తేలికగా కంపెనీ మారరనే భావన ఉంది. ఇవన్నీ డిగ్రీ విద్యార్థులకు కలసి వచ్చే అంశాలే. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి -
రోజుకు 1,600 మంది! ఐటీ కొలువుపై మాంద్యం వేటు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెకీలకు ‘డేంజర్ బెల్స్’మోగుతున్నాయి. ఐటీ రంగానికి సంబంధించి 2022లోనే ప్రారంభమైన ప్రతికూల పరిస్థితులు 2023 లోనూ కొనసాగే సూచనలు కన్పిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లే ఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. గత ఏడాది (2022) కాలంలో ప్రపంచంలోని వెయ్యికి పైగా కంపెనీలు మొత్తం 1,54,336 మందికి ఉద్వాసన పలికాయి. ఇక కోటి ఆశలతో కొత్త ఏడాది మొదలైన తొలి పదిహేను రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీలు లే ఆఫ్‌లు ప్రకటించాయి. దీంతో 25 వేల దాకా ఐటీ ఉద్యోగులు అంటే.. రోజుకు సగటున 1,600 మందికి పైగా టెకీలు లే ఆఫ్‌ల బారిన పడ్డారు. గతేడాది నుంచి లేఆఫ్‌లు ప్రకటించిన వాటిలో అనేక భారతీయ కంపెనీలతో పాటు పలు స్టార్టప్‌లు కూడా ఉన్నట్టు తేలింది. లే ఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లే ఆఫ్స్.ఎఫ్‌వైఐ’ తన తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. తొలి ప్రభావం ఐటీ రంగంపైనే..! ఆర్థిక రంగం ఒడిదుడుకులకు గురవుతున్నప్పుడు, ఆర్థికమాంద్యం పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు మొదటగా ప్రభావం పడేది ఐటీ రంగం పైనే. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడానికి ఇదే కారణం. ఆర్థికరంగ స్లోడౌన్‌కు సూచికగా ప్రస్తుత పరిణామాలను పరిగణించాలి. 2001లోనూ ఇలాంటి పరిస్థితులు సంభవించాయి. ఇండియన్ ఐటీ కంపెనీలకు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్‌లు తగ్గిపోతాయి కాబట్టి ఖర్చు తగ్గించుకునేందుకు లేఆఫ్‌ల వైపు మొగ్గు చూపుతాయి. ఆర్థికమాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలు రాగానే ఐటీ కంపెనీలు ముందుగా ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటాయి. అలాగే ఇప్పుడు కూడా లాభాల మార్జిన్లు తగ్గిపోయే కొద్దీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా అధిక జీతాలిచ్చే ఉద్యోగుల సంఖ్యను కంపెనీలు కుదించుకుంటున్నాయి. క్యాంపస్ సెలక్షన్లలో భాగంగా ఎంపిక చేసుకున్నవారి నియామక ఉత్తర్వులను సైతం కొన్ని సంస్థలు రద్దు (క్యాన్సిల్) చేస్తున్నాయి. ఓలా నుంచి అమెజాన్ వరకు.. అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా స్వదేశీ సామాజిక మాధ్యమ కంపెనీ షేర్‌చాట్ 20 శాతం వర్క్‌ఫోర్స్‌ను లేఆఫ్ చేసింది. దాదాపు 500 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడింది. ట్విట్టర్, గూగుల్, స్నాప్, టైగర్ గ్లోబల్ కంపెనీలు 2,300 మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఓలా (200 మంది తొలగింపు) వంటి కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించగా, వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్.ఏఐ ఈ నెలలో చాలా మందిని తొలగించింది. నిత్యావసర సరుకుల డెలివరీ సంస్థ ‘డంజో’తన కాస్ట్ కట్టింగ్ (ఖర్చు తగ్గింపు) చర్యల్లో భాగంగా 3 శాతం వర్క్‌ఫోర్స్‌ను తొలగించింది. అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందిని (భారత్‌లో వెయ్యి మంది) లే ఆఫ్ చేసింది. 6 నెలల దాకా లేఆఫ్‌ల ట్రెండ్ ఆర్థిక మాంద్యం, సమస్యలు ఎదురైనప్పుడు పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీలు కూడా పెద్ద కుదుపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో వీటిల్లో లే ఆఫ్‌ల ట్రెండ్ మూడు నుంచి ఆరునెలల దాకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత 3, 4 ఏళ్లుగా ఐటీ కంపెనీల్లో సరైన పద్ధతులు, విధానాల్లో హైరింగ్ జరగనందున ఉద్యోగులపై అధిక ప్రభావం పడనుంది. రిక్రూట్మెంట్ సవ్యంగా జరగకపోవడం, భారీ ప్యాకేజీలు ఆఫర్ చేయడం వంటివి జరిగినపుడు రెండేళ్లకోసారి దిద్దుబాట్లు జరుగుతుంటాయి. మరోవైపు ఆశించిన మేర ఇతర దేశాల నుంచి ఔట్సోర్సింగ్ బిజినెస్, బ్యాకెండ్ సపోర్ట్ వంటివి రాకపోవడం మన దేశంపై ప్రభావం చూపిస్తుంది. – డా.బి.అపర్ణా రెడ్డి,హెచ్ఆర్ నిపుణురాలు -
రెండు మల్టీనేషనల్ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం
గణపవరం(పశ్చిమగోదావరి): గ్రామీణ నేపథ్యం కలిగిన గణపవరం చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని రెండు బహుళజాతి కంపెనీల క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరై రెండు కంపెనీల్లో ఉద్యోగం సాధించింది. ప్రిన్సిపల్ శ్యాంబాబు తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న బాలం రుచితాదేవి ఇటీవల బహుళజాతి సంస్థలు నిర్వహించిన ఆన్లైన్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైంది, నాలుగు రౌండ్లలో జరిగిన రాత, ముఖాముఖి పరీక్షలలో విజయం సాధించి యాస్సెంచర్, క్యాప్‌జెమిని సంస్థలలో ఏడాదికి దాదాపు రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించింది. చదవండి: చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం ఈ విద్యార్థిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ తమ కళాశాలలో ఇచ్చిన శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. విద్యార్థిని రుచితను కాలేజి అభివృద్ది కమిటి అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ మధురాజు, న్యాక్ కోఆర్డినేటర్ అక్కిరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అఫీసర్ డివివి చినసత్యనారాయణ, రసాయనశాస్త్ర అధ్యాపకులు శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. -
దిగ్గజ టెక్ కంపెనీలపై 15 శాతం గ్లోబల్ ప్రాఫిట్ ట్యాక్స్
లండన్: ప్రపంచంలోని దిగ్గజ టెక్నాలజీ కంపెనీలపై మరొక పన్ను భారం పడనుంది. 15 శాతం గ్లోబల్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి జీ–7 దేశాలు అంగీకరించాయి. బహుళ జాతి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో గ్లోబల్ ట్యాక్స్ రేట్ 15 శాతంగా ఉండాలని తీర్మానించాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ జీ–7 దేశాల ఆర్ధిక మంత్రులతో లండన్‌లో సమావేశం జరిగింది. ఈ మేరకు ఆయా దేశాలు ఒప్పందం మీద సంతకాలు చేశాయని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు. ‘ ఈ ఒప్పందంతో సరైన కంపెనీలు సరైన పన్నులను సరైన ప్రదేశాలలో చెల్లిస్తాయి’ అని రిషి ట్వీట్‌చేశారు. ఒప్పందంలో కార్పొరేట్ పన్ను విధానంలో పోటీ ధరల తగ్గింపు నియంత్రణ ధిక్కరణలు ఉండవని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి, శ్రామిక ప్రజలకు న్యాయం జరిగేలా ఉంటుందన్నారు. జూన్ 11–13 తేదీల్లో కార్న్‌వాల్‌లోని కార్బిస్బేలో జరగాల్సిన జీ–7 దేశాల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అంతర్జాతీయంగా 15 శాతం కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మద్దతు ఇవ్వడంతో.. ఈ ప్రతిపాదనకు ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు చేతులు కలిపాయి. భౌతికంగా ఉనికి లేకపోయినా సరే వ్యాపారం చేసే ఇంటర్నెట్ ఆధారిత సంస్థలకు (ఆన్లైన్ కంపెనీలు) కూడా పన్ను విధానాల సమస్యలను పరిష్కరించేందుకు జీ–7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చాలా వరకు ఆన్లైన్ కంపెనీలు తక్కువ లేదా నో ట్యాక్స్‌లతో కార్యకలాపాలు సాగిస్తుంటాయి. -
జూలై చివరి వరకూ అదే మంచిది!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారికి ఇంకా అడ్డు కట్ట పడని నేపథ్యంలో గుర్గావ్ పరిపాలనా విభాగం అక్కడి కొర్పారేట్, టెక్ కంపెనీలకు కీలక సూచన చేసింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ కంపెనీలోని ఉద్యోగులు మరో రెండు నెలలపాటు ఇంటినుంచే పనిచేయాల్సి వుంటుందట. ఈ మేరకు గుర్గావ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో, హర్యానా అదనపు చీఫ్ సెక్రటరీ వీఎస్ కుందు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ విస్తరణను నిరోధించేందుకు వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటి నుండే పనిచేసేలా కంపెనీలు చూసుకోవడం మంచిదని ఆయన సూచించారు. కరోనావైరస్ మహమ్మారి స్వభావం అలాంటిది, మునుపటి సాధారణ స్థితికి తిరిగి ఎప్పటికి చేరతామో ఎవరికీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కేంద్రం గుర్గావ్లోనిఎంఎన్సీలు, బీపీఓలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్లు, పరిశ్రమలు తమ ఉద్యోగులను జూలై చివరి వరకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాల్సి ఉంటుందన్నారు. లాక్ డౌన్, వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు ఇంటి నుండి పని (వర్క్ ఫ్రం హోం) చేయించుకునే విధానాన్ని కొనసాగించాలన్నారు. (కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు) ఇంటినుంచే పనిచేయడం ఉత్పాదక రంగంలో సాధ్యం కాదు కాబట్టి, సాధ్యమైన ఇతర రంగాలన్నీ వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని సూచించారు. భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటిస్తూ డిఎల్ఎఫ్ సహా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతినిస్తున్నట్టు కుందు తెలిపారు. ఇంటినుంచి పని సాధ్యం కాని కార్మికులు ఇప్పటికే సైట్లో ఉంటున్న నిర్మాణరంగ కార్మికులు, ప్రాజెక్టుకు అతి సమీపంలో (నడక దూరంలో) ఉన్నవారు సామాజిక దూర నిబంధనలకు కట్టుబడి పని తిరిగి ప్రారంభించడానికి అనుమతివుంటుందని ఆయన చెప్పారు. గుర్గావ్లోని పరిస్థితి చాలా నియంత్రణలో ఉందని, కమ్యూనిటీ ట్రాన్సమిషన్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. ప్రాణాలను కాపాడటం, జీవనోపాధి కల్పించడం అనే రెండు లక్ష్యాలపై తాము పనిచేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం సర్వేలు నిర్వహిస్తోందనీ, రేషన్ కార్డులు లేని పేద కుటుంబాలకు ఆహార కూపన్లు అందించడం ప్రారంభించి, మూడు నెలల పాటు రేషన్ అందజేస్తున్నట్టు తెలిపారు. అలాగే దుస్తులు సంస్థలకు రెండింటికీ తమ ప్లాంట్లలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) తయారీకి అనుమతి ఇచ్చామనీ, తయారీ కూడా ప్రారంభించామని కుందు చెప్పారు. కాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భాగమైన గుర్గావ్ను మిలీనియం సిటీగా పిలుస్తారు. ఇది ఇన్ఫోసిస్, జెన్పాక్ట్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్నాలజీ దిగ్గజాలు సహా అనేక బీపీఓలు, ఎంఎన్సీలకు నిలయం. అంతేకాదు ఆటోమొబైల్ పరిశ్రమకు గుర్గావ్ ప్రధాన కేంద్రంగా ఉంది. -
ట్రంప్‌పై పోరుకు సై
రూ. 10.8 కోట్ల విరాళం ప్రకటించిన ట్వీటర్ శాన్ ఫ్రాన్సిస్కో: ట్రంప్ నిరంకుశ నిర్ణయాలపై పోరుకు అమెరికన్లే కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలు సైతం సై అంటున్నాయి. ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాన్ని ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, ట్వీటర్లతోపాటు పలు బడా కంపెనీలు తీవ్రంగా తప్పుపట్టాయి. తాజాగా ఈ పోరుకు సాయమందించేందుకు ట్వీటర్ ముందుకొచ్చింది. శరణార్థులు, వలసదారులపై నిషేధంపై పోరాటానికి ట్విటర్ సీఈవో జాక్ డోర్సే, ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు 1.59 మిలియన్ .10.8 కోట్ల) విరాళం ప్రకటించారు. మొదటిగా 925 మంది ట్వీటర్ ఉద్యోగులు 5.30 లక్షల డాలర్లు సేకరించగా... సీఈవో డోర్సే, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమిద్ కొర్దెస్తానీలు ఆ మొత్తాన్ని 1.59 మిలియన్ డాలర్లకు పెంచారు. ట్రంప్ నిర్ణయంపై కోర్టు వెలుపల, లోపల పోరాడుతున్న ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్యూ)’ సంస్థకు ఈ సాయం అందుతుంది. ‘పౌర హక్కులు ప్రమాదంలో పడ్డప్పుడు... వ్యక్తులగా మనం ఐక్యంగా పోరాడి స్వేచ్ఛను పరిరక్షించాలి... ప్రజల తరఫున పోరాడాలి’ అని ట్వీటర్ జనరల్ కౌన్సిల్ విజయ గద్దె అన్నారు. ఇష్టం లేకున్నా అమలు చేస్తాం.. శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధానితో గొడవపడ్డ ట్రంప్ ఒకడుగు వెనక్కి తగ్గారు. ఒప్పందంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నా దాన్ని అమలు చేస్తామని, అయితే శరణార్థుల వివరాలు క్షుణ్నంగా పరిశీలించాకే అమెరికాలోకి అనుమతిస్తామని వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ... ‘గత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పకుండా గౌరవించాలి. అదే సమయంలో దానిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని చెప్పారు.. చైనీయుల మనసు దోచిన ట్రంప్ కుమార్తె, మనువరాలు ఒకవైపు చైనాపై ట్రంప్ విమర్శలు చేస్తుంటే ఆయన కుమార్తె ఇవాంకా, మనువరాలు ఆరబెల్లాలు మాత్రం చైనీయుల మనసు దోచుకున్నారు. చైనీయుల కొత్త సంవత్సరం లూనార్ వేడుకల సందర్భంగా చైనీస్‌లో ఆరబెల్లా పాడిన పాట ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తుంది. కాగా, వలస విధానాలపై నిరసనల నేపథ్యంలో ఆయన వ్యాపార సలహా మండలి నుంచి ఉబర్ కంపెనీ చీఫ్ ట్రావిస్ కలనిక్ తప్పుకున్నారు. మండలిలో ఉండలేనని చెప్పానని కలనిక్ తన ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. మరో కొత్త చట్టం ప్రయత్నాల్లో ట్రంప్? ట్రంప్ సర్కారు మరో షాకిచ్చేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ పత్రిక వాషిం గ్టన్ పోస్టు పేర్కొంది. ఈ వివాదాస్పద ఉత్తర్వుల ప్రకారం.... వ్యక్తుల మతాల్ని ఆధారంగా చేసుకుని వారికి సేవలు, ఉద్యోగం, ఇతర సౌకర్యాల కల్పనను తిరస్కరించే హక్కు ఉంటుంది. ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా సంప్రదాయ క్రైస్తవులు పట్టుపడుతున్నారు. అయితే అమెరికా ప్రభుత్వానికి అలాంటి ఆలోచనేదీ లేదని వైట్‌హౌస్ వర్గాలు ఖండించాయి. -
బహుళజాతి కంపెనీలకు తొత్తుగా ప్రభుత్వాలు
l ఆదివాసీల అభివృద్ధిని విస్మరించిన పాలకులు l పోరాటాలే మన హక్కుల సాధనకు ఊపిరి l తుడుందెబ్బSరాష్ట్ర పొలిట్‌బ్యూరో కోచైర్మన్ లక్ష్మీనారాయణ l మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏటూరునాగారం : బహుళజాతి కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరుస్తూ ఆదివాసీల ఖనిజ వనరులు, సంపదను ప్రభుత్వాలు దోచిపెడుతు న్నాయని తుడుం దెబ్బSరాష్ట్ర పొలిట్ బ్యూరో కోచైర్మన్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు పొడెం బాబు ఆరోపించారు. మంగళవారం కొమురం భీం మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. 70 ఏళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీలు బతుకుతున్నారని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ఐటీడీఏలు ఏర్పా టు చేసినా అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, కానీ ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధిని విస్మరించాయని అన్నారు. కోట్లాది రూపాయలు తమ కోసం ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల చూపించి మైదాన ప్రాంతాల ప్రజ లకు ఖర్చు చేస్తుందన్నారు. బుధవారం వరంగల్‌లో జరిగే సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఐ రఘుచందర్ మాట్లాడుతూ ప్రకృతితో పెనువేస్తుకున్న జీవనం ఆదివాసీల మ న్యంలోనే ఉంటుందన్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సభలో తుడుం దెబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురా లు ఇర్ప విజయ, ఏటీడబ్ల్యూఓ దబ్బగట్ల జనార్దన్, ఆగబోయిన రవి, కోరగట్ల లక్ష్మణ్‌రావు, పొడెం శోభన్, అర్రెం లచ్చుపటేల్, చంద రఘుపతి, సపక నాగరాజు, బంగారు సాంబయ్య, దబ్బ సుధాకర్, చాప బాబుదొర, కోరం సంతోష్, బోదెబోయిన జయందర్, పొడెం నాగేశ్వర్రావు, సోలం పుల్లరావు, జానికిరామ్ పాల్గొన్నారు. కాగా, సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. తీర్మానాలు l ఎస్టీలలో వర్గీకరణ కోసం కమిషన్‌ను నియమించాలి l ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ఆదివాసీలకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి l 1/70 చట్టం అమలు కోసం ఐటీడీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను యంత్రాంగా న్ని ఏర్పాటు చేయాలి l పీసా, అటవీహక్కుల చట్టాలను అమలు చేయాలి, సాదాబైనామాలను ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయరాదు l జీఓ నంబర్ 3 ప్రకారం ప్రత్యేక డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి l ఏజెన్సీ ప్రాంతాలకున్న జీఓల ప్రకారం వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు l ఏజెన్సీ ప్రాంతాల్లో హెల్త్ ఎమర్టేన్సి ప్రకటించాలి l ఏజెన్సీ ప్రాంతాల్లో తాగు, సాగు నీరు, రోడ్లు, విద్య, విద్యుత్ సౌకర్యాలను కల్పించాలి -
దుఃఖ సముద్ర సందిగ్ధతలో న్యాయం
అభిప్రాయం దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్‌లు కొలువై ఉన్న సమావేశంలో, దేశ అత్యున్నత న్యాయస్థానం అధిపతి కంట కన్నీరొలకటం - న్యాయం కోసం ఈ దేశం ఎంతటి సంది గ్ధతలో, దుఃఖ సముద్రంలో విలవిల్లాడుతోం దనడానికి నిదర్శనం. ఆయన కన్నీళ్ళలో కోట్లాదిమంది న్యాయం అందని వాళ్ళ కన్నీళ్ళు దాగున్నాయి. చట్టంలో అన్నీ ఉన్నా న్యాయం అందించడంలో ఉన్నవన్నీ అడ్డంకులే అని అర్థం చేయిస్తు న్నాయి. మాల్యాలకు, మనీ ల్యాండరర్స్కు, మల్టీ నేషనల్ కంపెనీలకు, మైనింగ్ మాఫియాలకు అందుతున్న న్యాయం పేదవారికి, బాధిత స్త్రీలకి, పిల్లలకి, బలహీనులకి అందకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఈ అన్నింటి వెనక సమర్థవంతంగా నడిచే స్వార్థ రాజకీయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ నిర్భీతితో చేస్తున్న నీతి బాహ్యమైన పనులు న్యాయ వ్యవస్థని ఎంతగా నిర్వీర్యం చేస్తున్నాయనే నగ్నసత్యాన్ని మాటల్లో చెప్పలేని దుర్భర పరిస్థితికి కూడా ఈ కన్నీళ్ళు అద్దంపడుతున్నాయి. న్యాయవ్యవస్థ సమస్యలపై రూపొందిన అన్ని రిపోర్ట్లు చూసి, చర్చల మీద చర్చలు చేసి మళ్ళీ కొత్తగా ఈ సమస్యని అర్థం చేసుకుం టున్నట్లు నటిస్తున్న ఏలినవారి పోకడలకి దుఖం పొంగిపొర్లక ఎట్లా తడారిపోతుంది? పాలనా వ్యవస్థలో ఎన్నికైన రాజకీయ నాయకుడు/ నాయకురాలు మరణిస్తే ఏర్పడే ఖాళీ సీటును భర్తీ చేయడానికి ఆగ మేఘాల మీద రూల్స్ వర్తింప చేసి మళ్ళీ కొత్త మెంబర్‌తో నింపుతారు సీటుని. మరి కోర్టుల్లో ఇన్ని వందల సంఖ్యలో జడ్జీల సీట్లు ఖాళీగా పడి ఉంటే వాటిని నింపటానికి ఇన్నేళ్ల కాలం ఎందుకు పడుతోంది? న్యాయ వ్యవస్థని అత్యంత ఉన్నతంగా, స్వతంత్రంగా ఉంచితే కదా ఈ దేశంలో న్యాయం నాలుగు పాదాల నడిచేది! దానికి ఒక్కొక్క వేలుకి వేలు, కాలుకి కాలు విరగొట్టి పెడుతుంటే కేసులు కోట్లల్లో పెండింగులు కాక మరేం అవుతాయి? కనిపించని అసలు శత్రువు స్వార్ధ రాజకీయ వ్యవస్థ. నేర చరిత్ర గల తమ తమ రాజకీయ నాయకులని న్యాయపరమైన చిక్కుల నుండి తేలిగ్గా బయటికి తెచ్చుకోడానికి కొత్త ప్రభుత్వాలు రాగానే మార్పులు చేర్పులు చేస్తూ వారికి అనుకూలమైన వారిని న్యాయ వ్యవస్థలో చొప్పించి, ప్రయోజనం పొందుతున్నాయి. పైగా అనేక విషయాల్లో పాలనా వ్యవస్థ, పోలీసు వ్యవస్థ.. న్యాయ వ్యవస్థని ఎప్పుడూ ఒక ‘ప్రతిపక్షంగానే చూస్తున్నాయి.పైగా కోర్టులో బార్ అసోసియేషన్ల దగ్గర నుంచి, న్యాయవాదుల వరకు నిబంధ నలు తోసిపుచ్చి అవినీతికి దాసోహం అవటం న్యాయవ్యవస్థకి మరో పెద్ద సవాలుగా పరిణమించింది. న్యాయం పక్షాన నిలవాలంటే కన్నీరు ఉబికి వస్తుంది. ఇంతటి దుఃఖం అత్యున్నత న్యాయాధిపతి కంట కన్నీ రొలికించినది అనటంలో అతిశయోక్తి లేదు కానీ... స్త్రీలు, పిల్లలకి సంబంధించిన కేసులు, హత్యలు, అత్యాచారాల కేసులు, స్త్రీల ఆస్తి హక్కు, పిల్లల కస్టడీ మొదలైన సత్వరం పరిష్క రించాల్సిన కేసులు కూడా కొన్నేళ్లపాటు మగ్గుతున్నాయంటే కారణం ఎవ్వరని ప్రశ్నించాలి? ‘జడ్జిమెంట్ ఇంకా రాలేదని’ చెప్పులరిగేలా కోర్టుల చుట్టూ తిరిగే పేదలకి, మహిళలకి మొదటిగా కోపం వచ్చేది జడ్జి మీదనేగా. ఈ మధ్యలో మోసం చేస్తున్న రాజకీయ పరిస్థితుల మీద ధ్యాస మళ్ళదు.రోజు రోజుకి నేరాలు పెరుగుతుండగా ప్రపంచంలోనే 2వ అతి పెద్ద జనాభాగల మన దేశంలో 50 వేల మంది జడ్జీలు అవసరం ఉండగా, 18,000 మంది జడ్జీలతో మమ అనిపిస్తున్నారు. కోర్టులో 3 కోట్ల కేసులు పెండింగులు ఉండక, మరి మూడు కేసులు మాత్రమే పెండింగులో వుంటాయా? చట్టాలు సవరించడం కొత్తవి రూపకల్పన చేయడం మినహా ప్రభుత్వాలు ఉన్న చట్టాలని పకడ్బం దీగా పని చేయించలేకపోవడాన్ని ప్రశ్నించే ప్రజా చైతన్యం, సంఘటి తంగా గొంతెత్తడం కూడా కరువయింది. ఏపీఎస్సీపీసీఆర్ అనే పిల్లల హక్కుల పరిరక్షణ సంస్థను సీపీసీ ఆర్ అనే చట్ట పరిధిలో ఏర్పాటు చేసి, దానికి అతీగతీ రాకుండా చేసిన పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పోకడలను దగ్గరగా చూసిన సభ్యురాలిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గారి కంట వొలికిన కన్నీళ్ళతో నా కన్నీళ్ళు కలుపుతున్నా. - ఎం. సుమిత్ర వ్యాసకర్త పిల్లల హక్కుల పరిరక్షణ కార్యకర్త 9396883703 -
బహుళ జాతి కంపెనీలకే మోదీ సహకారం: ఈటల
ఢిల్లీ: డిసెంబర్లో జరగాల్సిన ఆర్థిక మంత్రుల సమావేశాన్ని బడ్జెట్‌కు 15 రోజుల ముందు నిర్వహిస్తున్నారని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రాల ప్రతిపాదనలు తీసుకోవాలని కేంద్రానికి ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏదో తూతూ మంత్రంగా ఆర్థిక మంత్రుల సమావేశం పెట్టారని మండిపడ్డారు. బహుళజాతి కంపెనీలకే ప్రధాని నరేంద్ర మోదీ సహకరిస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఆర్డీఎమ్ 3.5 శాతం పెంచాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్ర పథకాల్లో కోతలు కోసి అనేక కేంద్ర పథకాలకు నిధులు తగ్గించేశారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యూరప్‌యేతర ఉద్యోగులపై వెయ్యిపౌండ్ల సర్‌చార్జ్
యూకే సర్కారు పన్ను ♦ భారత ఐటీ నిపుణులకు మంచి అవకాశం లండన్: యూకేలో యూరప్యేతరులను ఉద్యోగులుగా నియమించుకునే కంపెనీలు ఇకపై ఏడాదికి అదనంగా వెయ్యి పౌండ్ల (దాదాపు రూ.95 వేలు) సర్చార్జ్ను చెల్లించాల్సి ఉంటుంది. టైర్2 వీసా విధానంలో భాగంగా.. కంపెనీల ‘ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్’ను సమీక్షించాక యూకే మైగ్రేషన్ అడ్వయిజరీ కమిటీ(మ్యాక్) ఈ సిఫార్సు చేసింది. దీంతో యూకేలో ఉద్యోగానికి వచ్చే వారికి శిక్షణనిచ్చి ఉద్యోగంలో చేర్చుకోవటం కంపెనీలకు భారమవుతుంది. నేరుగా నైపుణ్యమున్న వారికే ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. కొత్త విధానంతో కనీసం మూడేళ్ల వీసాపై వచ్చే యూరప్యేతరులపై కంపెనీలు 3 వేల పౌండ్లు చెల్లించాలి. దీనివల్ల అవి స్థానికులకే శిక్షణనిచ్చి వారికే ఉద్యోగాలిచ్చేందుకు అవకాశం ఉంటుందని మ్యాక్ తన నివేదికలో పేర్కొంది. నివేదికను యూకే ప్రభుత్వం త్వరగానే ఆమోదించనున్నట్లు సమాచారం. 2015 సెప్టెంబర్ వరకున్న లెక్కల ప్రకారం.. టైర్ 2 వీసా కింద అనుమతి పొందిన వారిలో 90శాతం మంది భారతీయ స్కిల్డ్ వర్కర్లే ఉన్నారని మ్యాక్ తెలిపింది. భారత్‌లోని మల్టీనేషనల్ కంపెనీలు పోటీ వాతావరణం వల్ల యూకేలో ఐటీ ప్రాజెక్టులకోసం భారతీయ ఉద్యోగులను తీసుకొస్తున్నాయంది. యూకేతో పోలిస్తే.. భారత్‌లో వేతనాలు చాలా తక్కువగా ఉండట కారణమంది. భారత్‌లోనూ శిక్షణ సంస్థల మధ్యతో నిపుణులైన ఉద్యోగులు బయటకు వస్తున్నారని.. వారికి యూకే కంపెనీలు మంచి వేతనంతో ఉద్యోగాలిస్తున్నాయ పేర్కొంది. కాగా, 2016 నుంచి 2020 వరకు వెయ్యిమంది యూకే గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముందుకొచ్చినట్లు తెలిసింది. -
‘బహుళజాతి’ మోసం
అబద్ధమాడటానికీ, మోసం చేయడానికీ ఉండే తేడాను చెబుతూ ‘నిజం చెప్పకపోవడం అబద్ధం... అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’ అంటాడు ఓ చిత్రంలో కథానాయకుడు. లక్షల కోట్లకు పడగలెత్తి దేశదేశాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలను శాసించగల స్థాయికి చేరుకున్న బహుళజాతి సంస్థలు ఇలాంటి మోసాలను సునాయాసంగా, యథేచ్ఛగా చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా... మార్కెట్ లీడర్‌గా చలామణి అవుతున్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు కంపెనీ ఈమధ్య చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రాంతిపరచింది. తాము ఉత్పత్తి చేస్తున్న డీజిల్ కార్లలో అవి వెలువరించే ఉద్గారాల తీవ్రత పరీక్షలకు దొరక్కుండా చేసే సాఫ్ట్‌వేర్‌ను అమర్చామని... ఇలా చేయడం ద్వారా లక్షలాది మంది ఖాతాదార్ల విశ్వాసాన్ని వమ్ము చేశామని ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకు తమను క్షమించాలని కోరింది. ఈ ప్రకటన చేశాక ఆ సంస్థ సీఈఓ మార్టిన్ వింటర్‌కార్న్ పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మామూలుగా అయితే ఫోక్స్వ్యాగన్తో పరుగెత్తలేక ఆయాసపడుతున్న మిగిలిన కంపెనీలన్నిటికీ ఈ ప్రకటన ఉపశమనం కలిగించేదే. అయితే మదుపుదార్లు వాటికా అవకాశాన్నివ్వ లేదు. స్టాక్ మార్కెట్లలో ఫోక్స్‌వ్యాగన్‌ను కాస్త ఎక్కువగా శిక్షిస్తే... మిగిలిన వాటికి కూడా అంతో ఇంతో వాతలు పెట్టారు. ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు వాటా ధర ఒక్కసారిగా 20 శాతం పడిపోతే... టయోటా, జనరల్ మోటార్స్ వంటి సంస్థల వాటా ధరలు కూడా పల్టీలు కొట్టాయి. ఫోక్స్‌వ్యాగన్ వెలువరించిన క్షమాపణ ప్రకటన చాలా ఖరీదైంది. అది చెల్లించుకోవాల్సిన మూల్యం సామాన్యమైనది కాదు. తమ దేశంలో 2009 నుంచి ఇంతవరకూ విక్రయించిన దాదాపు 5 లక్షల డీజిల్ కార్లనూ వెనక్కి తీసుకోవాలని అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఫోక్స్ వ్యాగన్‌ను ఆదేశించింది. అంతేకాదు... ఆ సంస్థ ఉత్పత్తులైన ఆడి, ఫోక్స్‌వ్యాగన్, పోర్షే డీజిల్ కార్లను ఇకపై విక్రయించవద్దని తాఖీదు పంపింది. జరిమానాల రూపంలో అది చెల్లించాల్సిన మొత్తం కూడా దాదాపు 18 వందల కోట్ల డాలర్ల (రూ.1,18,800 కోట్లు) వరకూ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ కాళ్లావేళ్లా పడితే ఇది ఏమేరకు తగ్గుతుందో తెలియదుగానీ షేర్ల ధరల పతనం వల్ల ఆ సంస్థ మార్కెట్ విలువ 17 వందల కోట్ల డాలర్ల (రూ.1,12,200 కోట్లు)మేర పడిపోయింది. ఆ సంస్థ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలనూ, నష్టపరిహారం కోసం న్యాయస్థానాల్లో దాఖలయ్యే క్లాస్ యాక్షన్ దావాలను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ పెను సంక్షోభాన్ని కేవలం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకొచ్చే ఆర్థిక నష్టాలతో మాత్రమే చూస్తే... కార్ల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి కలిగిస్తున్న నష్టాన్నీ, జనం ప్రాణాలకు తెస్తున్న ముప్పునూ తగ్గించి చూపినట్టే అవుతుంది. ఫోక్స్‌వ్యాగన్ దొరికిన దొంగైతే దొరకని దొంగలు చాలామంది ఉన్నారు. తమ వాహనాల మైలేజీని అతిగా చూపడం, ఉద్గారాలను తగ్గించి చూపడం అందరికీ అలవాటైంది. దాదాపు ఏ కంపెనీ విడుదల చేసే కారైనా ప్రయోగశాలల్లో జరిగే పరీక్షల్లో వెలువరించే ఉద్గారాలకూ... రోడ్లపై పరుగెత్తినప్పుడు వదిలే ఉద్గారాలకూ మధ్య ఎంతో తేడా ఉంటున్నదని వారు చెబుతున్నారు. యూరప్ ప్రయోగశాలలు ఇస్తున్న ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొంటున్న నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలకూ, అవి విడిచిపెట్టే ఉద్గారాలకూ మధ్య 2001లో 10 శాతం తేడా వస్తే ఇప్పుడది 40 శాతానికి చేరిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ధోరణిని గమనించాక ఉద్గారాల తగ్గింపునకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అమర్చుకోవాల్సిందేనన్న నిబంధన వచ్చింది. చాలా తక్కువ వ్యవధిలోనే దాన్ని అమలు చేయాల్సి రావడంతో ఫోక్స్‌వ్యాగన్ అడ్డదార్లు తొక్కింది. పెట్రోల్ ఇంజిన్లుండే వాహనాల్లో ఉద్గారాల తగ్గింపునకు ఉపయోగించే సాంకేతికత డీజిల్ ఇంజిన్లకు సరిపోదు. నేరుగా దాన్నే ఉపయోగిస్తే వాహనాని కుండే ఇంధన సామర్థ్యం పడిపోవడంతోపాటు ఇంజిన్ శక్తి కూడా తగ్గిపోతుంది. కనుక డీజిల్ కార్ల కోసం మరింత సంక్లిష్టమైన, ఖరీదైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అందుకు సమయం సరిపోకపోవడంతో పాటు... ఆ సాంకేతికతకయ్యే వ్యయానికి తగ్గట్టు వాహనం ధరను కూడా పెంచాల్సి ఉంటుంది. ఇందువల్ల మార్కెట్ డిమాండ్ పడిపోతుందన్న భయంతో ఫోక్స్‌వ్యాగన్ సాఫ్ట్‌వేర్‌లో మాయాజాలాన్ని ప్రదర్శించింది. సాధారణ పరిస్థితుల్లో రోడ్లపై అడ్డూ ఆపూ లేకుండా ఉద్గారాలను వెదజల్లే ఇంజిన్... పరీక్షకు నిలిచినప్పుడు మాత్రం పరిమితులకు లోబడి ఉండేలా కారులో అమర్చిన సాఫ్ట్వేర్ నియంత్రిస్తుంది. నిజానికి ఈ వంచన ఇన్నాళ్లూ బయటకు రాకపోవడానికి అమెరికాలో అమల్లో ఉన్న కాపీరైట్ చట్టమే ఒక రకంగా కారణం. వాహనం కొనే వినియోగదారు స్టీరింగ్ మొదలుకొని బ్రేకులు, టైర్ల వరకూ అన్నిటినీ తనిఖీ చేసుకోవచ్చు. కానీ వాహనంలో వాడే సాఫ్ట్వేర్ జోలికి మాత్రం వెళ్లకూడదు. దీన్ని మార్చాలని ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ (ఈఎఫ్ఎఫ్) ఎప్పటినుంచో కోరుతున్నది. మొత్తానికి ఇలాంటి కుంభకోణాల్లో కూరుకుపోయిన సంస్థల్లో ఫోక్స్‌వ్యాగన్ మొదటిదీ కాదు... బహుశా చివరదీ కాదు. గతంలో జీఎం, టయోటా వంటివి తమ ఉత్పత్తులను వెనక్కి రప్పించుకోవడంతోపాటు భారీగా జరిమానాలు కట్టాల్సి వచ్చింది. బ్రిటిష్ పెట్రోలియం సంస్థ కనీస భద్రతా నిబంధనలు ఖాతరు చేయ కుండా చమురు వెలికితీత కార్యకలాపాలు నడిపి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రమా దాలకు కారణమైంది. బహుళజాతి కంపెనీలన్నిటిదీ ఈ విషయంలో దుర్మార్గమైన చరిత్రే. లాభార్జన కోసం ఎంతకైనా దిగజారే చరిత్రే. తాజా స్కాంతోనైనా ప్రపంచ దేశాల్లోని పాలకులు బహుళజాతి వ్యామోహం నుంచి బయటపడి వాటిపట్ల కఠినంగా వ్యవహరిస్తే ప్రజలకు మేలు కలిగించినవారవుతారు. -
పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుణే: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే బహుళజాతి కంపెనీలకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలను అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. అమెరికా ఇంజనీరింగ్ సంస్థ-జీఈ కార్పొరేషన్ మొదటి మల్టీమోడల్ తయారీ కర్మాగారాన్ని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత సాంకేతిక నైపుణ్యతను సముపార్జించిన భారతీయ యువతను వినియోగించుకోవాలని బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి తయారీ రంగం పురోభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రత్యేకించి మూడు రంగాలు- తయారీ, వ్యవసాయం, సేవా రంగాల పురోభివృద్ధి ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యతలని వివరించారు. దీనితోపాటు ఆతిథ్య రంగంపై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. అమెరికాతో భారత్ సంబంధాలు మరింత పటిష్టం కానున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పెరుగుదల, రైల్వే రంగంలో సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 21వ శతాబ్దం ఆసియాదనీ, అందులో భారత్‌ది కీలక పాత్రని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రధాని ప్రారంభించిన జీఈ కర్మాగారం విద్యుత్, చమురు, గ్యాస్, రవాణా పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ మొత్తం ఉత్పత్తిలో 50 శాతాన్ని ప్రపంచంలోని తమ వివిధ జీఈ విభాగాలకు సరఫరా చేస్తుంది. ఈ కర్మాగారం ద్వారా 1,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది. -
బహుళజాతి కంపెనీలకు ఝలక్
* జన్యుమార్పిడి ప్రయోగాలపై అభ్యంతరాలు * సాంకేతిక సమాచారం కోరిన వ్యవసాయశాఖ సాక్షి, హైదరాబాద్: జన్యుమార్పిడి పంటలపై ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్సీ) చేసుకున్న దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయశాఖ పక్కనపెట్టింది. కంపెనీలు దరఖాస్తుల్లో వెల్లడించిన వివరాలు సంతృప్తి కలిగించకపోవడంతో ఆ శాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రయోగాలు ఎందుకు చేయదలిచారు? ఏ పంటలపై చేస్తారు? రైతులకు కలిగే లాభమేంటి? ప్రయోగించబోయే విత్తన మూలకాలు ఏ లేబరేటరీలో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో తయారుచేశారు? ఆ విత్తన మూలకాన్ని ఈ రాష్ట్రంలో జన్యుమార్పిడి చేస్తే విషపూరితం కావడానికి అవకాశం ఉందా? లేదా? తదితర సందేహాలను నివృత్తి చేస్తూ సమాచారంతో రావాలని వ్యవసాయశాఖ ఆదేశించింది. శాస్త్రీయ సమాచారంతో వస్తే అప్పుడు పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పినట్లు సమాచారం. జన్యుమార్పిడి పంట ప్రయోగాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వకూడదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. కంపెనీలు సాంకేతిక సమాచారం తీసుకొచ్చినా వాటిపట్ల సంతృప్తి చెందే పరిస్థితి కనిపించడం లేదు. గోధుమలు, వరి, కూరగాయలు వంటి వాటిల్లో జన్యుమార్పిడి ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అనుమతి సంపాదిస్తే తర్వాత పప్పుధాన్యాల్లోనూ దూరిపోవాలనేది బహుళజాతి కంపెనీల యోచనగా తెలుస్తోంది. -
జన్యు మార్పిడితోనే భవిష్యత్తు
బహుళ జాతి కంపెనీలు మన దేశంపై సురక్షితం కాని జీఎం పంటలను బలవంతంగా రుద్దుతున్నాయని దుష్ర్పచారం జరుగుతోంది. కానీ భవిష్యత్తులో ఏర్పడనున్న తీవ్ర ఆహార కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆ అత్యధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవడం తప్పనిసరి. జన్యు మార్పిడి (జీఎం) పంటలపై దేశంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని స్వార్థపర శక్తులు స్వచ్ఛంద సంస్థల ముసుగులో వ్యతిరేకిస్తున్నాయి. దేశ అత్యున్నత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సైతం అవి దురుద్దేశాలను ఆపాదిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి బదులు తాత్సార ధోరణిని అవలంబిస్తుండటం కూడా ఈ ఆందోళనకర పరిస్థితికి దోహదపడుతోంది. ఈ స్వచ్ఛంద సంస్థలు జన్యుమార్పిడి పంటలకు మద్దతు పలికే వారందరిపైనా బహుళజాతి కంపెనీల వత్తాసుదార్ల ముద్ర వేసి, దేశంలోని బయోటెక్ కంపెనీలు, విత్తన కంపెనీల సేవలను తక్కువ చేసి చూపుతున్నాయి. ఈ పరిస్థితులలో ఒకరి ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా వాస్తవాల ప్రాతిపదికన జన్యు మార్పిడి సాంకేతికత మంచి చెడ్డలను బేరీజు వేయడం సముచితం. మన దేశంలో జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను ప్రధాని శాస్త్ర సలహా మండలితోపాటు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ’, ‘జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ’ (జీఈఏసీ)లు ఎప్పుడో గుర్తించాయి. అయితే జీఎం సాంకేతికత వ్యతిరేకుల వితండవాదం వలన ప్రజల్లో ఏర్పడ్డ అపోహల కారణంగా వాటి అమలు నిలిచిపోయింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఈ స్వార్థపర శక్తులకు వంత పాడుతున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయంతోపాటు ఇతర అన్ని రంగాల్లోనూ జన్యుమార్పిడి సాంకేతిక పరిజ్ఞానానికి అనుమతులను మంజూరు చేయాల్సిన జీఈఏసీ అంచనాలకుపరిమితమైంది. ఒక్కసారి మొక్కుబడి సమావేశాలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటోంది. ఫలితం.. జీఎం పంటల విషయంలో అంతు తెలియని అసందిగ్ధత, అస్పష్టత! మరోవైపు ఇతర దేశాలు ఈ రంగంలో శరవేగంగా ముందుకెళుతున్నాయి. ఏడాదిలోపు అమెరికా, సహారా ఎడారి ప్రాంత రైతులకు కరువు కాటకాలను తట్టుకునే మెరుగైన మొక్కజొన్న వంగడాన్ని అందుబాటులోకి తేనుంది. చైనా, బ్రెజిల్‌లు బయోటెక్నాలజీల సాయంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. జీఎం సాంకేతికత ప్రమాదకరమా? జీఎం సాంకేతికత సురక్షితం కాదని, తగిన నియంత్రణ వ్యవస్థ లేని మన దేశంపై బహుళజాతి కంపెనీలు వీటిని బలవంతంగా రుద్దుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రధానంగా మూడు అంశాలను గమనించాల్సి ఉంది. జీఎమ్ సాంకేతిక ప్రయోజనాలు, భద్రతకు సంబంధించినది మొదటి అంశం కాగా... బహుళజాతి కంపెనీల పాత్ర ఏమిటి? భారత నియంత్రణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలు ఎలాంటివి? అనేవి మిగిలిన రెండు అంశాలు. చీడపీడలను తట్టుకునే విషయంలో జీఎం ఉత్పత్తుల శక్తిసామర్థ్యాలు మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా ఇప్పటికే విస్పష్టంగా నిరూపణైంది. రెండు జన్యుమార్పిడి ఉత్పత్తుల ద్వారా దాదాపు కోటీ 44 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడినట్లు ‘బ్రూక్స్ అండ్ బార్ఫుట్ ’ సంస్థ (బ్రిటన్) అధ్యయనం తెలిపింది. కీటక నాశనుల వాడకం 9 శాతం వరకూ తగ్గడంతోపాటు ఆర్థికంగా లాభసాటి అని తేల్చింది. బీటీ పత్తి మన రైతులకు ఎన్ని విధాలుగా మేలు చేకూర్చిందో కళ్ల ముందే కనిపిస్తోంది. 2002లో బీటీ వంగడాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేశంలో పత్తి సాగు విస్తీర్ణం 90 లక్షల హెక్టార్లు మాత్రమే. ప్రస్తుతమిది కోటీ 20 లక్షల హెక్టార్లకు చేరుకుంది. దిగుబడి కోటీ 30 లక్షల బేళ్ల నుంచి మూడు కోట్ల 40 లక్షల బేళ్లకు చేరుకుంది. అంటే దాదాపు 165 శాతం వృద్ధి! 2000లో హెక్టారుకు 200 కిలోలుగా ఉన్న పత్తి దిగుబడి... బీటీ పుణ్యమా అని 2005-06 నాటికి 362 కిలోలకు, 2010-11 నాటికి 510 కిలోలకు చేరుకుంది. ఒకప్పుడు దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఎగుమతిదారుగా మారింది. బహుళజాతి కంపెనీల బూచి... దేశీయ విత్తన మార్కెట్‌ను కబ్జా చేసేందుకు బహుళజాతి కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయన్న వాదన సామాన్య ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు పనికొస్తుందేగానీ... తర్కానికి నిలిచేది కాదు. విత్తనాలు, బయోటెక్నాలజీ రంగంలో ఎవరైనా ప్రవేశించవచ్చు. ఆ విషయంలో బహుళజాతి కంపెనీల ఆధిపత్యమేమీ లేదని అందరూ గుర్తించాలి. బహుళజాతి కంపెనీలు తాము ఆవిష్కరించిన జన్యువులను దేశీయ విత్తన కంపెనీకి ఒకే ఒకసారి డోనర్ విత్తనం ద్వారా అందిస్తుంది. బీటీ విషయాన్నే తీసుకుంటే ఇప్పటివరకూ అయిదు వేర్వేరు రకాలు (మోన్శాంటో, రెండో భారతీయ కంపెనీలు, సీఐసీఆర్లవి) అందుబాటులోకి వచ్చాయి. ఏ విత్తనానికి ఎంత ఆదరణ లభిస్తుందన్నది రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అటు హైబ్రిడ్లతోపాటు ఇటు ఓపీ రకాల్లోనూ బీటీ అందుబాటులో ఉందన్నది గమనార్హం. జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉన్న తొమ్మిది పంటలు సహా మరో 50 రకాల్లో సగం వాటివే. చైనాలో మాదిరిగా ప్రభుత్వ రంగంలో జన్యుమార్పిడి పంటల అభివృద్ధిని సాధించాలంటే జీఎం ఉత్పత్తులపై ఉన్న నియంత్రణలను తొలగించాలి. రాయల్టీల ద్వారా నష్టం వాటిల్లుతోందనుకుంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. తగు విధానాల రూపకల్పనతో కొత్త పంటల విషయంలో గుత్తాధిపత్య ధోరణులను సైతం అరికట్టవచ్చు. పటిష్టమైన ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలు, రక్షణ ఏర్పాట్లు అన్నీ శాస్త్రబద్ధంగా చేసినవేనని, అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనివని కేంద్రం ఇటీవలే సుప్రీం కోర్టుకు తెలిపింది. పైగా ఎప్పటికప్పుడు నియంత్రణ వ్యవస్థలను మరింత పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘అరుణా రోడ్రిగ్స్ కేసు’లో అది స్పష్టం చేసింది. జన్యుమార్పిడి పంటల విషయంలో ప్రస్తుతం అనేక సాంకేతిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కరువు కాటకాలను తట్టుకోడానికి, భూములు చవుడు బారడం సమస్యను అధిగమించడానికి ఇవి ఎంతగానో దోహదం చేయవచ్చు. అదే సమయంలో పెరిగిపోతున్న ఎరువుల సబ్సిడీల భారానికి కళ్లెం వేసి, వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచేందుకు సాయపడతాయి. ఒకవైపు పెరుగుతున్న జనాభాతో పాటు ఆహార అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ కూలీల కొరత కూడా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆహార కొరత, ప్రత్యేకించి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఆ ముప్పును నివారించాలన్నా, వ్యవసాయంలో మానవ శ్రమ వాడకాన్ని తగ్గించాలన్నా అత్యధునాతన సాంకేతికతల వాడకం తప్పనిసరి. వరి సాగులో నీటి వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరమూ ఉంది. కలుపు నివారణ కోసం వరి పొలాల్లో నీటిని నిల్వ ఉంచడం కంటే మెరుగైన సాంకేతిక పద్ధతులను, కలుపు నాశినులను వాడటమే మేలు. దేశంలో పంటల తీరుతెన్నులపై విస్తృత చర్చకు ఇదే సరైన సమయం. వ్యవసాయ అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు మెరుగైన సాంకేతికతలను ఉపయోగించుకోవాల్సిన తరుణమిది. జన్యుమార్పిడి వంగడాలు వేటిని ఉపయోగించాలి? ఏ ఏ జన్యు లక్షణాలు మన అవసరాలను మెరుగైన రీతిలో తీర్చగలవు? ఏ పంటల్లో మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించాలి? అనుమతించరాదు? తదితర అంశాలపై నిర్మాణాత్మకంగా అన్ని వర్గాల వారు కలసి చర్చిస్తే దేశ వ్యవసాయ రంగం భవిష్యత్తుకు ఒక దశ, దిశ లభిస్తుందన్నది నా నమ్మిక. దేశానికి ఇంత అన్నం పెడుతున్న రైతుల అభివృద్ధితో పాటు దేశ ఆర్థికాభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా ముందడుగు వేయాల్సిన తరుణమిది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పరిశోధన సంస్థలు పరస్పర సహకారంతో రైతన్నలకు మంచి భవిష్యత్తును అందించడానికి నడుం బిగించాల్సిన సమయమిది. (రచయిత అసోసియేషన్ ఫర్ బయోటెక్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అగ్రికల్చర్ గ్రూప్ చైర్మన్) రామ్ కౌండిన్య -
ఆదాయపన్ను వసూళ్లలో రాష్ట్రానిది ఐదో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పన్ను(ఐటీ) వసూళ్లలో రాష్ట్రం దేశంలో ఐదవ స్థానంలో ఉంది. పారిశ్రామిక పురోగతి కారణంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉండవచ్చని 2009లో అంచనా వేశారు. కానీ ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ లక్ష్యం నెరవేరలేదు. పెట్టుబడిదారులు వెనక్కు తగ్గడం, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఆదాయం అనుకున్న రీతిలో వృద్ధి చెందలేదు. బహుళజాతి కంపెనీలు సైతం తమ శాఖల విస్తరణకు ఇతర రాష్ట్రాలను ఎంపిక చేసుకున్నాయి. ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనప్పటికీ.. కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. భారీ ఆదాయం పన్ను చెల్లించే సంస్థలు కూడా గడచిన నాలుగేళ్లుగా వ్యాపార లావాదేవీల్లో వెనుకబడి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు దాదాపు 58 వరకూ ఉన్నాయని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకుల విస్తరణ కూడా ముంబై, ఢిల్లీతోపాటు దక్షిణ భారతదేశంలో బెంగళూరు, చెన్నైకే పరిమితమయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి క్షీణించింది. కార్పొరేట్ ట్యాక్స్ గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రూ.36 వేల కోట్ల ఆదాయ పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అది రూ.29 వేల కోట్లు దాటలేదు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సైతం మనకన్నా ముందుండడం విశేషం. దేశంలో ఆదాయపన్ను వసూళ్లలో మహారాష్ట్ర (రూ. 1,74,980 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ(రూ. 79,236 కోట్లు), కర్ణాటక(రూ. 49 వేల కోట్లు), తమిళనాడు(రూ. 35,266 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలిచాయి. కానీ రాష్ట్రంలో రూ. 29,716 కోట్లు మాత్రమే ఆదాయపన్ను వసూలైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పరిశ్రమలకు కేంద్ర బిందువైన హైదరాబాద్‌లోనూ అనిశ్చితి కొనసాగుతుండడం ఇందుకు కారణం. సుస్థిరత దిశగా అడుగులు పడకపోతే భవిష్యత్‌లో ఆర్థిక పురోగతి మరింత క్షీణించే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.