పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
పుణే: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే బహుళజాతి కంపెనీలకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పేర్కొన్నారు. మరిన్ని సంస్కరణలను అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. అమెరికా ఇంజనీరింగ్ సంస్థ-జీఈ కార్పొరేషన్ మొదటి మల్టీమోడల్ తయారీ కర్మాగారాన్ని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత సాంకేతిక నైపుణ్యతను సముపార్జించిన భారతీయ యువతను వినియోగించుకోవాలని బహుళజాతి కంపెనీలకు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి తయారీ రంగం పురోభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రత్యేకించి మూడు రంగాలు- తయారీ, వ్యవసాయం, సేవా రంగాల పురోభివృద్ధి ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యతలని వివరించారు.
దీనితోపాటు ఆతిథ్య రంగంపై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. అమెరికాతో భారత్ సంబంధాలు మరింత పటిష్టం కానున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐల పెరుగుదల, రైల్వే రంగంలో సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 21వ శతాబ్దం ఆసియాదనీ, అందులో భారత్‌ది కీలక పాత్రని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రధాని ప్రారంభించిన జీఈ కర్మాగారం విద్యుత్, చమురు, గ్యాస్, రవాణా పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ మొత్తం ఉత్పత్తిలో 50 శాతాన్ని ప్రపంచంలోని తమ వివిధ జీఈ విభాగాలకు సరఫరా చేస్తుంది. ఈ కర్మాగారం ద్వారా 1,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.